మసుల బీచ్ ఫెస్టివల్ లో పర్యాటక రంగానికి ప్రాచుర్యం కల్పించాలి
మసుల బీచ్ ఫెస్టివల్ లో పర్యాటక రంగానికి ప్రాచుర్యం కల్పించాలి
మంగినపూడి బీచ్‌లో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి కొల్లు రవీంద్రను కోరిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్
మంగినపూడి మసుల బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై వెలగపూడి సెక్రటేరియట్ లో మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్ మధ్య చర్చ
బందరు చరిత్ర తిరగ రాసేలా మసులా బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయంపర్యాటకుల వినోదం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్న ఇరువురు మంత్రులు
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):
బందరు చరిత్ర తిరగ రాసేలా మసులా బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలని మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్ నిర్ణయించారు. కేబినెట్ సమావేశం అనంతరం మంగళవారం వెలగపూడి సెక్రటేరియట్ 2వ బ్లాక్ లోని మంత్రి కందుల దుర్గేష్ పేషీలో ఈ మేరకు ఇరువురు మంత్రులు భేటీ అయ్యారు. జూన్ 6-8 తేదీల్లో మచిలీపట్నం మంగినపూడి మసూల బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై చర్చించారు. మంగినపూడి బీచ్ అత్యద్భుతమైన పర్యాటక ప్రాంతమని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా లక్షలాది సంఖ్యలో తరలివచ్చే సందర్శకులకు తెలిసేలా రాష్ట్ర పర్యాటక రంగానికి తగిన ప్రాచుర్యం కల్పించాలని సూచించారు. అంతేగాక రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించాలని కోరారు. ఇసుక తిన్నెలపై ఉత్సవాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఉత్సవాల్లో ఏర్పాటు చేసే స్వాగత తోరణాలు మొదలుకొని సాంస్కృతిక, కళా వైభవాన్ని స్ఫురించేలా, పర్యాటక ప్రాంతాల గొప్పతనం తెలిసేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి కొల్లు రవీంద్రను కోరారు. మసుల బీచ్ ఫెస్టివల్ కు తరలివచ్చే లక్షలాది ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్భందీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఉత్సవాల రేఖా చిత్రపటాన్ని పరిశీలించిన మంత్రి దుర్గేష్ ఉత్సవాల్లో ఏర్పాటు చేసే బందోబస్తు, ప్రదర్శనశాలలు, ఫుడ్ కోర్టులు, పార్కింగ్, క్రీడల నిర్వహణ, పారిశుద్ధ్యం, జనసమూహ నిర్వహణ, తాగునీటి ఏర్పాట్లు, వైద్య శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై తనదైన సూచనలు అందించారు. ఈ సందర్భంగా మసుల ఫెస్టివల్ కు సంబంధించిన ప్రోమో వీడియోలను మంత్రి దుర్గేష్ ఆసక్తిగా తిలకించారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిస్తూ ఉత్సవాల్లో భాగంగా పర్యాటకుల వినోదం కోసం జాతీయ క్రీడలైన బీచ్ కబడ్డీ, కయాకింగ్ జల క్రీడలు, హెలీ రైడ్, పారా గ్లైడింగ్, నీటిలో గ్లైడింగ్, స్కూబా డైవింగ్, స్పీడ్ బోట్లు తదితర సాహస క్రీడలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖ సినీ కళకారులు, సంగీత దర్శకులతో సంగీత విభావరి నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా బీచ్ ఫెస్టివల్ విజయవంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. మంత్రి కందుల దుర్గేష్ సూచించనట్లుగా పర్యాటక రంగానికి తగిన ప్రాచుర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ పాల్గొన్నారు.