అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలు భాగస్వామ్యం కావాలి
అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలు భాగస్వామ్యం కావాలి
• పాత భవనాల్లోని వైరింగ్ పటిష్టత ఆధారంగా విద్యుత్ ఉపకరణాలు వినియోగించాలి
• ప్రతి గదికి ఎంసీబీలను ఏర్పాటు చేసుకోవాలి.
• ఎర్తింగ్ ఏర్పాటు చేసుకోవాలి
• స్మోక్ డిటేక్టర్లను, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లు ఏర్పాటు చేసుకోవాలి.
• ప్రతి భవనానికి కచ్ఛితంగా బ్రీతింగ్ బాల్కాని ఉండాలి.
వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని ప్రజలు కూడా అగ్ని ప్రమాదాల నివారణలో భాగస్వామ్యం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ డైరక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ డి.జి. మాదిరెడ్డి ప్రతాప్ మాట్లాడుతూ రాష్ట్రం లోని పెద్ద పెద్ద నగరాల్లోని ఓల్డ్ సిటీల్లో అనుకోని అగ్నిప్రమాదం సంభవిస్తే ప్రమాద స్థాయి ఎక్కువగా ఉంటుందని, రహదారులు ఇరుకుగా ఉండటం, షాపుల పై అంతస్థుల్లో నివాస గృహాలు ఉండటం ఇలా పలు కారణాలు ఉంటున్నాయన్నారు. ఉదాహరణకు ఇటీవల హైదరాబాద్ ఛార్మినార్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య అధికంగా ఉండటానికి కూడా ఇవే కారణాలుగా స్పష్టమవుతున్నాయన్నారు. మన రాష్ట్రంలోనూ విజయవాడ, విశాఖ, తిరుపతి తదితర పెద్ద పట్టణాల్లో సైతం ఈ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. కావున ప్రతి ఒక్కరూ ముందు జాగ్రర్త చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించిన వారిమవుతామని వివరించారు.
పాత భవనాల్లోని విద్యుత్ వైరింగ్ ఇప్పుడు మనం వాడుతున్న విద్యుత్ ఉపకరణాల లోడ్ ను తట్టుకునే విధంగా మార్పు చేసుకోవాలని కోరారు. దీంతో షార్ట్ సర్యూట్ ప్రమాదాలను సగానికి పైగా తగ్గించవచ్చన్నారు. నూతన భవనాల్లో, పాత భవనాల్లో ఎఫ్ఆర్ఎల్ఎస్ వైర్ ను వాడటం వల్ల అధిక ప్రయోజనం ఉంటుందన్నారు. అలాగే ప్రతి గదికి మైక్రో సర్క్యూట్ బ్రేకర్స్ (ఎంసీబీ)లను ఏర్పాటు చేసుకోవాలని, ఎసీలను బిగించే సమయంలోనే వైర్ కెపాసిటీని ఒక సారి పరిశీలించాలని, అలాగే ప్రతి భవనానికి ఎర్తింగ్ చేయించుకోవాలని కోరారు. తక్కువ ఖర్చుతో వీటిని అమర్చుకుంటే నిశ్చింతగా ఉండచ్చని తెలిపారు. షార్ట్ సర్యూట్ లేదా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువగా పోగ కమ్ముకోవడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారని, కావున ప్రతి గృహంలో స్మోక్ మేనేజ్ మెంట్ లో భాగంగా స్మోక్ డిటెక్టర్లు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి గృహానికి బ్రీతింగ్ బాల్కాని ఏర్పాటు చేసుకుంటే అధిక ఫలితం ఉంటుందన్నారు.
మన రాష్ట్రంలోని శ్రీకాకుళంలో ఓ షాపింగ్ మాల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది లోపలకు వెళ్లడానికే ఆరుగంటల సమయం పట్టిందని, లోపన ఉన్న దుస్తులు కాలడంతో అధిక పొగ కమ్మేసిందని, దీంతో చాలా మంది ఊపిరాడక ఇబ్బంది పడ్డారన్నారు. ఈ పరిస్థితి ఇతర ప్రాంతాల్లో తలెత్తకుండ ప్రతి అపార్ట్ మెంట్ ఎన్ ఓ సీ ఇచ్చే సమయంలోనే అన్ని ఏర్పాట్లు పరిశీలిస్తున్నామన్నారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో పాటిస్తున్న నిబంధనలు ప్రజల మేలు కోసమేనన్నారు. సమావేశంలో అగ్నిమాపక శాఖ డైరక్టర్ డి. మురళీ మోహన్, అడిషనల్ డైరక్టర్ టి. ఉదయ్ కుమార్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కె. వినయ్, సిబ్బంది పాల్గొన్నారు.