నాణ్యమైన వరి, ఉద్యాన వన పంటల సాగును ప్రోత్సహించాలి
నాణ్యమైన వరి, ఉద్యాన వన పంటల సాగును ప్రోత్సహించాలి
•ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ ప్రకృతి సేద్యాన్ని, పంట మళ్లింపును ప్రోత్సహించాలి
•వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15 శాతం వృద్ది రేటును సాదించే విధంగా చర్యలు
•నూతన సాంకేతికను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు పెద్ద ఎత్తున వినియోగించాలి
రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, మే 21: రాష్ట్రంలో నాణ్యమైన వరి సాగుతో పాటు ఉద్యానవన పంటల సాగను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థకం మరియు మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. కొన్ని సాంప్రదాయ పంటల సాగు మాత్రమే కాకుండా పలు ఉద్యాన, వాణిజ్య పంటల సాగుపై కూడా రైతుల దృష్టి మళ్లేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాగు వ్యయాన్ని తగ్గించుకునేందుకు, నాణ్యమైన అదిక దిగుబడులను సాదించేందుకు మరియు మార్కేటింగ్ సౌకర్యాలను విస్తృత పర్చేందుకు నూతన సాంకేతికను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సును పెద్ద ఎత్తున వినియోగంలోకి తీసుకు రావాలన్నారు.
రైతులు ఖరీఫ్ సంసిద్దతపై వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నత స్థాయి అధికారులతో పాటు అన్ని జిల్లాల అధికారులతో రాష్ట్ర సచివాలయం నుండి బుధవారం ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయానికి అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15 శాతం వృద్ది రేటును సాదించాలనే లక్ష్యంతో అధికారులు అంతా సమైఖ్యంగా కృషి చేయాలన్ని ఆదేశించారు. ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్, వాల్యూమ్ అండ్ మార్కెటింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఖరీఫ్ పంట సాగు విషయంలో రైతులు ఎటు వంటి ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కొనేందుకు ఏ మాత్రం అవకాశం లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఖరీఫ్ సాగుకు అవసరైన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు సకాలంలో రైతులకు అందే విధంగా చూడాలన్నారు. బహిరంగ మార్కెట్ లో ఎటు వంటి నకిలీ విత్తనాలు, ఎరువుల సమస్య లేకుండా అధికారలు ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ ప్రకృతి సేద్యాన్ని, సాంప్రదాయ పంటల సాగును క్రమంగా తగ్గిస్తూ ఉద్యానమన పంటల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాన్నారు. ప్రకృతి సేద్యం అమల్లో ఉన్న ప్రాంతాల్లో శత శాతం అమల్లోకి తేవాలని, క్రమేణా మిగిలిన ప్రాంతాల్లో కూడా ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు. భూసార పరీక్షల నివేదికలు రైతులకు సమకాలంలో అందజేయాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకై అందే ధరఖాస్తులను నాలుగైదు రోజుల్లో పరిష్కరించాలని, ఈ పథకం క్రింద 50 శాతం రాయితీ సొమ్మును ముందుగానే అందజేస్తున్నామని, రైతుల వాటా సొమ్ము బ్యాంకు ఋణాలు ద్వారా అందజేసే అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బిందు తుంపర్ల సేద్యాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, శత శాతం లక్ష్యాలను సాదించే విధంగా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు సకాలంలో అందజేయాలన్నారు. కౌలు రైతులు అందరికీ సి.సి.ఆర్.సి. కార్డులు అందజేయాలను, ప్రతి కౌలు రైతుకు బ్యాంకు ఋణం అందేలా చూడాలన్నారు.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వం అండగా ఉంది అనే విషయాన్ని రైతుల్లో పాదుకొల్పేందుకు వ్యవసాయ అనుబంధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ రైతుల్లో మనో దైర్యాన్ని కల్పించాలన్నారు. ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అవినీతికి ఏమాత్రము అవకాశం లేకుండా కంప్యూటరైజేషన్ విధానాన్ని అమల్లోకి తేవడం జరుగుచున్నదన్నారు. ఇందుకై అధికారులు, సిబ్బందికి కుడా తగిన శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. వ్యవసాయ అనుబంధ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తామని, ఏ ఒక్కరూ మద్యవర్తులను ఆశ్రయించి డబ్బులను పోగొట్టుకోవద్దని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్ బి.రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సేవా రంగం పూర్తి స్థాయిలో అభివృద్ది చెందాలంటే ఎంతో సమయం పడుతుందన్న నేపథ్యంలో ప్రాథమిక రంగం అభివృద్దిపైనే రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకోవడం జరిగిందన్నారు. కాబట్టి వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15 శాతం వృద్ది రేటును సాదించాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది అంతా సమైఖ్యంగా పనిచేస్తూ ఈ లక్ష్యాన్ని సాధించే విధంగా ముందుకు అడుగులు వేయాలని ఆయన కోరారు. స్థానికంగా ఉన్న పరిస్థితులు, అవకాశాలకు అనుగుణంగా పంటల సాగును, దిగుబడులను పెంచుకునేందుకై నూతన సాంకేతకను, ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్టును పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని, అందుకు అనుగుణంగా ప్రత్యేక యాప్ లను రూపొందించుకోవాలని ఆయన కోరారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆర్.వై.ఎస్.ఎస్. ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ మరియు వ్యవసాయ & సహకార శాఖ సలహాదారులు టి.విజయ కుమార్, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ ఎం.సుబ్బారెడ్డి, వ్యవసాయ శాఖ సంచాలకులు ఎస్.డిల్లీరావు, ఉద్యానవన& పట్టుపరిశ్రమ శాఖ సంచాలకులు కె.శ్రీనివాసులు, మార్కెటింగ్ శాఖ సంచాలకులు ఎమ్.విజయసునీత, సహకార శాఖ కమిషనర్ అహ్మద్ బాబు, పశుసంవర్థక శాఖ సంచాలకులు దామోదర్ నాయుడు, మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ తదితరులతో పాటు అన్ని జిల్లాల వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.