రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

దేశ ప్రగతికి చేయూతనిచ్చే సంస్కరణ... ఒకే దేశం – ఒకే ఎన్నిక

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

దేశ ప్రగతికి చేయూతనిచ్చే సంస్కరణ... ఒకే దేశం – ఒకే ఎన్నిక


  • దేశ జీడీపీకి ఊతం ఇచ్చే విధానం
  • జమిలి ఎన్నికలతో దేశానికి ఎలాంటి నష్టం వాటిల్లదు

  • తమిళనాట వన్ నేషన్.. వన్ ఎలక్షన్ గురించి అబద్దపు ప్రచారం సాగుతోంది
  • ఒకప్పుడు కరుణానిధి  వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అంటే సూపర్ అన్నారు
  • ఆ విధానం ఇప్పుడు తప్పు ఎలా అవుతుంది?
  • జమిలి వ్యతిరేకంపై తమిళనాడు సీఎం  స్టాలిన్  పునరాలోచన చేయాలి
  • ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ప్రాంతీయ పార్టీలకు, సమాఖ్య స్ఫూర్తికీ ఎలాంటి నష్టం జరగదు
  • ద్వంద్వ వైఖరితో తమిళ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు
  • వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పై చెన్నైలో నిర్వహించిన సెమినార్ లో
  • జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్ 

"వన్ నేషన్ – వన్ ఎలక్షన్ దేశానికి చాలా అవసరమైన మార్పు. దేశంలో ఎన్నికలు అనేవి ఒక నిరంతర ప్రక్రియలా మారిపోయి... దేశ ప్రగతికి ఆటంకం కలిగిస్తున్నాయి. తరచూ ఎన్నికల నిర్వహణతో భారీగా ఖర్చుతోపాటు సమయం వృథా అవుతోంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడం వల్ల ప్రభుత్వ విధానాల అమలు స్తంభించిపోతుందని, తద్వారా అభివృద్ధి, సంక్షేమం నిలిచిపోతుంద"ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. ఐదేళ్ల పాలన కాలంలో దాదాపు 800 రోజులు కేవలం ఎన్నికల నిర్వహణకే ఖర్చయిపోతున్నాయి అన్నారు. జమిలి ఎన్నికల వల్ల దేశానికి లాభమే తప్ప నష్టం వాటిల్లదని, మన దేశానికి ఉన్న సామర్ధ్యం రీత్యా జమిలి ఎన్నికల ఆచరణలో సాధ్యమేనని అన్నారు. ఈ తరహా ఎన్నికల వల్ల ప్రచార ఖర్చులు తగ్గుతాయని, పరిపాలనలో అవరోదాలు ఉండవని, పాలన క్రమబద్ధీకరణ జరుగుతుందని అన్నారు. తమిళనాట ఒకే దేశం.. ఒకే ఎన్నిక గురించి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారంలో ఇండియా కూటమి పక్షాలు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. ఒకప్పుడు  కరుణానిది గారు సమర్ధించిన వన్ నేషన్.. వన్ ఎలక్షన్ విధానాన్నే నేడు ఆయన కుమారుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు వ్యతిరేకించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఈ అంశంపై  స్టాలిన్  పునరాలోచన చేయాలని సూచించారు. ఒకే దేశం.. ఒకే ఎన్నిక అంశంపై అవగాహన కల్పించేందుకు సోమవారం చెన్నైలోని తిరువాన్మియూర్ లోని రామచంద్ర కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన సెమినార్ లో ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ మాజీ గవర్నర్, వన్ నేషన్ వన్ ఇండియా తమిళనాడు సమన్వయకర్త శ్రీమతి తమిళసై సౌందరరాజన్ ఆధ్వర్యంలో ఈ సెమినార్ జరిగింది.

ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్  ప్రసంగిస్తూ " చెన్నైలోనే చాలా కాలం ఉన్నాను. తమిళనాడును వీడి మూడు దశాబ్దాలు గడచినా నన్ను ఈ గడ్డ వదలడం లేదు. నాపై ఈ తమిళ నేల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. తిరుక్కురళ్, మార్షల్ ఆర్ట్స్ తో పాటు సినిమా ప్రభావం నాపై ఎక్కువగా ఉండటానికి చెన్నైలో నివసించడమే. ఇది తిరువళ్లువర్ పుట్టిన భూమి, సిద్దులు నడయాడిన నేల, మురుగన్ వెలసిన నేల, మహాకవి సుబ్రహ్మణ్య భారతియార్ పుట్టిన భూమి. వేలాది దేవాలయాలు కొలువైన పుణ్యభూమి. నాకు ఎంతో ఇష్టమైన ఎంజీఆర్ పెరిగిన, సేవలు అందించిన భూమి. వీరత్వానికి ప్రతీక అయిన జల్లికట్టుకు నెలవైన భూమి. ఈ భూమికి వీర వందనం చేస్తున్నాను. తమిళనాడు నాకు నేర్పిన పాఠాలు జీవితాంతం నాకు స్ఫూర్తిని కలిగిస్తాయి.

ఒకే దేశం.. ఒకే ఎన్నిక కొత్తగా తెచ్చిన విధానం కాదు

ఒకే దేశం.. ఒకే ఎన్నిక అనే అంశం మీద తమిళనాడులో ఒక విదమైన అబద్దపు ప్రచారం సాగుతోంది. ఒకప్పుడు దేశం మొత్తం ఒకే ఎన్నిక కావాలని కోరుకున్న వారే ఇప్పుడు ఆ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వైసీపీ లాంటి రాజకీయ పక్షాలు ఎన్నికల్లో గెలిస్తే అది తమ గొప్పే అని, ఓడిపోతే ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని నిందిస్తున్నాయి. అలా సమయానుకూలంగా ద్వంద్వ వైఖరి ప్రదర్శించే వారే నేడు వన్ నేషన్.. వన్ ఎలక్షన్ ను వ్యతిరేకిస్తున్నారు. వీళ్ల వైఖరి చూస్తుంటే 'అత్త పగలగొడితే పాత కుండ.. కోడలు పగలగొడితే కొత్త కుండ' (అత్తై ఒడ్రెచ్చా మన్ కుడం.. మరుమగళ్ ఒడైచ్ఛా ఫొన్ కుడం) అన్న సామెత గుర్తుకు వస్తోంది.

వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అనేది కొత్తగా తెరపైకి వచ్చిన అంశం కాదు. గతంలో కూడా భారత్లో ఈ విధానాన్ని అనుసరించాం. స్వతంత్రం వచ్చాక సుమారు రెండు దశాబ్దాలపాటు దేశం మొత్తం ఒకసారి ఎన్నికలు జరిగేవి.

 కరుణానిధి గారి కల

ఒకే దేశం ఒకే ఎన్నికలు కావాలని మాజీ ముఖ్యమంత్రి  కరుణానిధి  గతంలో పట్టుబట్టారు. నెంజిక్కు నీది పుస్తకంలో కూడా ఒకే దేశం.. ఒకే ఎన్నిక అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు అదే మాట గౌరవ ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ  అంటుంటే ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారో అర్ధం కావడం లేదు. ఒకే దేశం.. ఒకే ఎన్నిక అనేది  కరుణానిధి  కల. ఈ విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలి.

ఐదేళ్ల పాలనలో 800 రోజులు ఎన్నికల నిర్వహణకే సరిపోతున్నాయి.

తరచూ ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశం ఆర్ధికంగా ఎంతో నష్టపోతుంది. లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు ఇలా ఒక దాని తర్వాత ఒకటి వస్తూ ఉంటే దేశంలో అభివృద్ధి, సంక్షేమం కుంటుపడుతోంది. ఉన్న సమయం అంతా ఎన్నికల ప్రణాళికల రూపొందించడానికీ, నిర్వహణకే సరిపోతుంది. ఇప్పటికే ఐదేళ్ల పాలనా కాలంలో 800 రోజులు ఎన్నికలకే సరిపోతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన పార్టీలు కూడా వెంటనే తర్వాత రాబోయే ఎన్నికలపైనే దృష్టి పెడుతున్నాయి. ప్రజల సంక్షేమం కన్నా ఎన్నికల మీదే ఎక్కువ ఆలోచన చేస్తున్నాయి. ప్రభుత్వం యొక్క విలువైన సమయం వృథా కావడంతోపాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, పోలీసు యంత్రాంగం, భద్రతా దళాలు అంతా ఎన్నికల విధుల్లోనే నిమగ్నమవ్వాల్సి వస్తోంది. ఎన్నికల వ్యయం విషయంలో కూడా గత ఎన్నికల్లో మనం అమెరికాని దాటేశాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహణపై మాజీ రాష్ట్రపతి  రామ్ నాథ్ కోవింద్  నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికలో.. జమిలి ఎన్నికల వల్ల దేశ జీడీపీ 1.5 శాతం మేర పెరిగే అవకాశం ఉందని సూచించింది. ఇది సుమారు రూ.4.5 లక్షల కోట్లతో సమానం. జీడీపీ పెరిగితే అది ప్రతి సామాన్యుడి జీవితాన్ని మెరుగుపరుస్తుంది. ఆ మొత్తం ద్వారా దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన, విద్యా, వైద్యంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఉపయోగపడుతుంది.

ప్రతిపక్షాల వాదనలో పస లేదు

'ఒకే దేశం ఒకే ఎన్నిక' అప్రజాస్వామికమని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలకు జమిలి ఎన్నికలు నష్టం చేస్తాయని కొన్ని చెబుతున్నాయి. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీస్తాయని అంటున్నాయి. నేను ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన వ్యక్తిని. మాకు ఎప్పటి నుంచో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఒకేసారి ఎన్నికలు జరిగిన సందర్భాల్లో టీఆర్ఎస్, టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలకు పరాభవం తప్పలేదు. ప్రతిపక్షాల వాదనలో పస లేదనేది ప్రాంతీయ పార్టీల విజయంతో స్పష్టం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లోప్రాంతీయ పార్టీని, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఒడిశా ప్రజలు ఎన్నుకున్న దాఖలాలు ఉన్నాయి. ఎక్కడ ఎవరిని గెలిపించాలన్నది ప్రజలే నిర్ణయిస్తారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రజలకు బలం అవుతుంది. దీన్ని వ్యతిరేకించే రాజకీయ పార్టీలంతా ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి.

 స్టాలిన్ గారు పునరాలోచన చేయాలి

ఇండియా, డీఎంకే కూటమి జమిలి ఎన్నికలు సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయని వాదిస్తున్నాయి. అదే నిబం అయితే  కరుణానిధి గారు దేశం మొత్తం ఒకే ఎన్నికల విధానం కావాలని పోరాడారు కదా. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ని  కరుణానిధి  ఎక్కడా వ్యతిరేకించలేదు. దాని వల్ల దేశానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. మరి తమిళనాడు ముఖ్యమంత్రి  స్టాలిన్  ఎందుకు ఈ విధానానికి అడ్డుపడుతున్నారు. ఒకే దేశం.. ఒకే ఎన్నికపై తమిళనాడు ప్రభుత్వం చేసిన తీర్మానంపై పునః పరిశీలించాలి. తమిళ ప్రజల మనోభావాలను నేను అర్ధం చేసుకోగలను. నాది జాతీయ పార్టీ కాదు. మా ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తెరిగి ముందుకు వెళ్తున్నాం.  స్టాలిన్  జమిలి ఎన్నికల వ్యవహారంలో సందేహాలు ఉంటే కూర్చుని చర్చించాలి. అధికారంలో ఉన్న పార్టీలు రాజకీయపరంగా తీసుకునే నిర్ణయాలు ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలి తప్ప అడ్డుపడరాదు. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేది రాజకీయ పరమైన సంస్కరణ కాదు. దేశ ఆర్థిక ప్రగతికి సంబందించిన సంస్కరణ. పాలనాపరమైన సంస్కరణ. దేశానికీ, తమిళనాడుకీ ఎంతో అవసరం అయిన సంస్కరణ.

అవసరం అయితే తమిళనాడు ఎన్నికల్లోనూ ప్రచారం

తమిళ యువత ఒకే దేశం.. ఒకే ఎన్నికల విధానంపై పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకోవాలి. తరచు ఎన్నికలు జరగడం వల్ల అది మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది.  విజయ్  నాకు మంచి మిత్రుడు. పార్టీ అధినేతగా ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనే.  విజయ్  ఎవరినీ అనుసరించకపోవడం మంచిది. నటుడుగా రాణించడం వేరు. నటుడు రాజకీయాల్లోకి రాణించడం వేరు. కూటమికి మద్దతుగా ప్రచారం చేయడం నా బాధ్యత. గతంలోనూ మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేశాను. అవసరం అనుకుంటే తమిళనాడు ఎన్నికల్లో కూడా ప్రచారం నిర్వహిస్తాను. మనది సనాతన ధర్మం పరిఢవిల్లిన భూమి. సనాతన ధర్మం అనే అంశాన్ని కొంత మంది తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రామాలయం లేని గ్రామం లేదు. తమిళనాట వినాయకుడి లేని ఊరుండదు" అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి  సత్యకుమార్ యాదవ్, బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు  నయినార్ నాగేంద్రన్, జాతీయ కార్యదర్శులు  అనిల్ ఆంటోని,  అరవింద్ మేనన్, తమిళనాడు, కర్ణాటక కో ఇన్ ఛార్జి  పొంగులేటి సుధాకర్ రెడ్డి, తమిళనాడు బీజేపీ నాయకులు  చక్రవర్తి,  అర్జునమూర్తి,  అమర్ ప్రసాద్ రెడ్డి,  కరాటే త్యాగరాజన్, తమిళనాడు సీనియర్ రాజకీయ నాయకులు  కె.ఎస్. రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-