ఇష్టముంటే పని చేయండిలేదంటే వెళ్లిపోండి
ఇష్టముంటే పని చేయండిలేదంటే వెళ్లిపోండి
ఐసీడీఎస్ అధికారుల పని తీరుపై అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అసహనం
సీడీపీఓలు పని చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక
అనంతపురం:
జిల్లాలో పని చేయాలనుకుంటే మనస్సు పెట్టి పని చేయండి. వంద శాతం ప్రగతి సాధించాలి. ఇష్టం లేదంటే ఇక్కడి నుంచి వెళ్లిపోండి...అంటూ ఐసీడీఎస్ అధికారులపై అనంతపురం కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ మండిపడ్డారు. ముఖ్యంగా సీడీపీఓల పని తీరుపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కిశోరి వికాసం కార్యక్రమం అమలులో వెనుకబడి ఉండటంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు.
బాల్య వివాహాలపై సమీక్ష సందర్భంగా కలెక్టర్ డీఎస్పీ మహబూబ్ బాషా, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధిని ఆరా తీశారు. అయితే తమకు కిశోరి వికాసం, బాల్య వివాహాల గురించి కనీస సమాచారం కూడా ఐసీడీఎస్, అనుబంధ విభాగాల అధికారులు ఇవ్వడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్ సీరియస్ అయ్యారు.
అన్ని శాఖల అధికారులను కలుపుకొని సమన్వయంతో పని చేయకపోగా..వారికి సమాచారం కూడా ఎందుకు ఇవ్వడం లేదని ఐసీడీఎస్ పీడీ నాగమణిని ప్రశ్నించారు.
మీరు తరచూ సెలవులు పెడుతుంటే కుదరదు. ఇక్కడ పురోగతిలో జిల్లా వెనకబడిపోతోంది. మీ ఆరోగ్యం సహకరించకపోతే సొంత జిల్లాకు బదిలీపై వెళ్లండి. ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. ఇక్కడికి మరొకరు వస్తారు అంటూ కలెక్టర్ పేర్కొన్నారు. కనీసం సీడీపీఓలను కూడా కంట్రోల్ లో పెట్టుకొని పని చేయించుకోకపోతే ఎలాగని ప్రశ్నించారు. ఐసీపీఎస్, చైల్డ్ లైన్ వారిని కూడా కలెక్టర్ మందలించారు. వస్తినమ్మా.. పోతినమ్మా అంటే కుదరదని, పని చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మళ్ళీ సమీక్ష సమావేశం నిర్వహించే నాటికి బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు కిశోరి వికాసం లక్ష్య సాధనలో పురోగతి లేకపోతే ఐసీడీఎస్ అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.