గుడ్ న్యూస్.. రేపటి నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
గుడ్ న్యూస్.. రేపటి నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
• రేపటి నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరిస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్..
• కొత్త కార్డులు, మార్పులు చేర్పులు, చిరునామా మార్చుకోవచ్చని వెల్లడి..
కొత్త రేషన్ కార్డుల జారీ ఈ-కేవైసీ కోసం ఆలస్యం అయ్యిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బుధవారం నుంచి (మే 7వ తేదీ) రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీకి దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. కొత్త కార్డులు జారీ, రేషన్ కార్డులు స్ప్లిట్, కొత్త సభ్యుల చేరిక, చిరునామా మార్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. 3.28 లక్షల దరఖాస్తులు రేషన్ కార్డు మార్పు కోసం వచ్చాయని తెలిపారు.
క్యూ ఆర్ కోడ్తో జారీ..
ఇకనుంచి రేషన్ కార్డులు స్మార్ట్ రేషన్ కార్డు, క్యూ ఆర్ కోడ్తో జారీ చేస్తామన్నారు. కుటుంబసభ్యుల పేర్లు అన్నీ చక్కగా కనిపించేలా స్మార్ట్ కార్డు జారీ ఉంటుందని మంత్రి వెల్లడించారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే గడిచిన ఆరు నెలలుగా రేషన్ తీసుకున్న వివరాలు కనిపించేలా ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఈ కార్డు వెసులుబాటు కల్పిస్తుందన్నారు. ఒక నెల పాటు కొత్తగా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు.
వచ్చే నెల నుంచే స్మార్ట్ కార్డులు: గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి పౌరులు తమ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. 4.24 కోట్ల మందికి స్మార్ట్ కార్డు జారీ అవుతుందని అన్నారు. జూన్ మాసం నుంచే స్మార్ట్ కార్డులు జారీ అవుతాయన్నారు. ప్రస్తుతం 95 శాతం మేర ఈ-కేవైసీ పూర్తి అయ్యిందని, ఈ-కేవైసీ పూర్తి అయిన వాళ్లు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.
వాట్సప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు..
వాట్సప్ గవర్నెన్స్ ద్వారాను ఈ నెల 12వ తేదీ తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. రేపటికి పూర్తి వివరాలు అందుతాయని తెలిపారు. అకాల వర్షంతో రైతులకు పంట నష్ట పరిహారం అందరికీ అందజేస్తామన్నారు. ఇప్పటి వరకూ 1.50 కోట్ల మందికి దీపం పథకం ద్వారా లబ్ది కలిగిందన్నారు. పాఠశాలలకు 25 కేజీల ఫైన్ క్వాలిటీ రైస్ ఈ ఏడాది నుంచి సరఫరా చేయబోతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడంచారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం..
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతుల ఆందోళన చెందవద్దని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని కలెక్టరేట్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ధాన్యం కొనుగోలుపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు సందర్భంగా ఎదురవుతున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పశ్చిమగోదావరిలో 7.5 లక్షల టన్నులు ధాన్యం ఉత్పత్తి అంచనా వేయగా, ఇప్పటివరకు 5.5 లక్షల టన్నులు కొనుగోలు చేశామని అన్నారు. రైతులకు రూ.1180 కోట్లు జమ చేశామన్నారు. అదనంగా లక్ష టన్నులు కొనుగోలు చేయడానికి అనుమతించామన్నారు. ఏలూరు జిల్లాలో 3.55 లక్షల టన్నులు పుట్టపర్తి అవుతుందని అంచనా వేయగా, ఇప్పటివరకు 2.20 లక్షల టన్నులు కొనుగోలు చేసి, రైతులకు రూ.487 కోట్లు జమ చేశామని మంత్రి మనోహర్ తెలిపారు. అదనంగా 50 వేల టన్నులు కొనుగోలుకు అనుమతి మంజూరు చేశామని తెలిపారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.