Health news: ఈ కారణాలతో పెరగనున్న గుండె జబ్బులు..!
Health news: ఈ కారణాలతో పెరగనున్న గుండె జబ్బులు..!
• పొగాకు, గంజాయి వాడకంతో గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని పరిశోధకుల హెచ్చరిక..
• 2030 నాటికి పొగాకు సంబంధిత గుండె మరణాలు 43.7 % పెరిగే అవకాశం ఉందని వెల్లడి..
• నియంత్రణ, అవగాహన పెంచాలని నిపుణుల సూచన..
రాబోయే ఐదేళ్లలో గుండె జబ్బులు, మరణాలు ఏకంగా 50 శాతం మేర పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న పొగాకు వాడకం, గంజాయి వినియోగమే దీనికి కారణమని తెలిపారు. ఈమేరకు వాషింగ్టన్ డీసీలో జరిగిన సొసైటీ ఫర్ కార్డియోవాస్కులర్ యాంజియోగ్రఫీ అండ్ ఇంటర్వెన్షన్స్ (ఎస్ సీఏఐ) 2025 సైంటిఫిక్ సెషన్స్‌లో సమర్పించిన రెండు కొత్త అధ్యయనాలలో ఈ విషయం వెల్లడించారు. పొగాకు, గంజాయి వాడకం వల్ల గుండెకు పొంచి ఉన్న ప్రమాదాలను ఈ అధ్యయనాలు మరోసారి నొక్కి చెప్పాయి.
వేన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ (కరోనరీ ఆర్టరీ వ్యాధి) పై దృష్టి సారించారు. 1999 నుంచి 2020 మధ్యకాలంలో 25 ఏళ్లు పైబడిన వారి హెల్త్ డేటాను విశ్లేషించారు. దీని ప్రకారం.. 2030 నాటికి పొగాకు వాడకం వల్ల సంభవించే గుండె జబ్బుల మరణాలు 43.7% పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. మహిళల్లో మరణాల రేటు తగ్గినప్పటికీ, పురుషుల్లో మాత్రం ఈ ముప్పు తీవ్రంగా పెరుగుతోందని తేలింది. "పొగాకు సంబంధిత ఇస్కీమిక్ గుండె జబ్బు ఇప్పటికీ ప్రధాన మరణకారణంగానే ఉంది. ఏ వర్గాలు ఎక్కువ ప్రమాదంలో ఉన్నాయో గుర్తించడం ప్రజారోగ్య కార్యక్రమాల రూపకల్పనకు కీలకం" అని వేన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు రూపేష్ వెంపటి తెలిపారు.
మరో అధ్యయనాన్ని అమెరికాలోని సినాయ్ హాస్పిటల్ పరిశోధకులు నిర్వహించారు. గుండె వైఫల్యంతో బాధపడుతున్న 1.3 మిలియన్లకు పైగా రోగులను వీరు పరిశీలించారు. గంజాయి వినియోగ రుగ్మత (సీయూడీ) ఉన్నవారిలో తీవ్రమైన గుండె సమస్యల ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. గుండె వైఫల్యంతో పాటు సీయూడీ బాధితుల్లో గుండెపోటు వచ్చే అవకాశం 50%, కార్డియోజెనిక్ షాక్ (గుండె రక్తాన్ని పంప్ చేయలేని స్థితి) ఏర్పడే ప్రమాదం 27%, అరిథ్మియా (గుండె లయ తప్పడం) వచ్చే అవకాశం 48% ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో గంజాయి వినియోగం వల్ల కలిగే గుండె నష్టాల గురించి రోగులకు ముందుగానే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సినాయ్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ రెసిడెంట్ డాక్టర్ సయ్యద్ ఇషాక్ నొక్కిచెప్పారు.
గుండెపోటును ఎలా నివారించాలి?
మీ పాదాలకు పనిచెప్పారంటే గుండెపోటును నివారించడం చాలా సులభం. ఎలా అంటే క్రమం తప్పకుండా నడవడం, శారీరక శ్రమ, వ్యాయామం చేయడం ద్వారా మీరు గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. వ్యాయామం మొత్తం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మధుమేహం, రక్తపోటును నియంత్రించడంలో, ఊబకాయాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఇది ఒత్తిడి, కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. అదే సమయంలో ధూమపానం, అధికంగా మద్యపానం వంటి అనారోగ్యకరమైన అలవాట్లను వదిలించుకోవడానికి మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది. ఈ ప్రయోజనాలే కాదు. సాధారణ శారీరక శ్రమ మీ మందుల అవసరాన్ని సగానికి సగం తగ్గించి మిమ్మల్ని ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచుతుంది.