2047 నాటికి దేశంలోనే నంబర్ వన్ గా తెలంగాణ....
2047 నాటికి దేశంలోనే నంబర్ వన్ గా తెలంగాణ....
ప్రపంచంలోనే తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో పారదర్శకమైన పరిపాలనతో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో నడిపించడానికి ప్రజలందరూ ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలన్న ఆంకాక్షను వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జపాన్ కితాక్యిషూ మేయర్ కజుహిసా టక్యూచీ రాష్ట్ర అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
4 కోట్ల తెలంగాణ ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణను అభివృద్ధి పథంవైపు నడిపించడంలో ప్రజా ప్రభుత్వం తీసుకున్న చర్యలు అనుసరిస్తున్న ప్రణాళికలను వివరించారు.
“దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశగానే తెలంగాణ రైజింగ్ 2047 భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. వచ్చే పదేళ్లలో 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం.
రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాం. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. జరిగిన తప్పిదాలను సరిదిద్దుతూ రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత మాపే ఉంది.
ఇది నల్లేరుపై నడక కాదని తెలుసు. అయినా ప్రజల ఆకాంక్షలే ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణం దిశగా ప్రయత్నిస్తూ ముందుకు కదిలాం. ప్రజల ఆలోచనలే ఆచరణగా ముందుకు వెళుతున్నాం” అని ముఖ్యమంత్రి గారు చెప్పారు.
ప్రజా ప్రభుత్వ లక్ష్య సాధన కోసం ప్రధానంగా మహిళలు, రైతు సంక్షేమం, యువత, విద్య, వైద్య రంగాల్లో ఇప్పటివరకు సాధించిన ప్రగతిని వివరిస్తూ భవిష్యత్తు ప్రణాళికలను ఆవిష్కరించారు.
సామాజిక తెలంగాణ కోసం బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ ఉప కులాల వర్గీకరణ, ఇందిరమ్మ ఇండ్లు, ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం వంటి సామాజిక తెలంగాణ నిర్మాణానికి తీసుకున్న నిర్ణయాలను వివరించారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను, హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి మూసీ పునరుజ్జీవం పథకం, భారత్ ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, మెట్రో రైలు విస్తరణ ప్రణాళికలు, విమానాశ్రయాలు, రీజినల్ రింగ్ రోడ్డు వంటి అంశాలను తెలిపారు.
శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పుడే రాష్ట్ర అభివృద్ధి, నిర్ధేశిత లక్ష్యాలు సాధ్యమవుతాయని, ఆ లక్ష్యంతోనే పోలీసు యంత్రాంగాన్ని పటిష్టపరచడం, మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి చర్యల కారణంగా దేశంలోనే తెలంగాణ పోలీసు అగ్రస్థానంలో నిలవడానికి కారణమైన వివరాలను ముఖ్యమంత్రి సవివరంగా తెలిపారు.
హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ వేదికగా మార్చుతూ, ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా దేశాల నుంచి దాదాపు 450 మంది ప్రతినిధులు హాజరైన భారత్ సమ్మిట్ నిర్వహణ, తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో మన సంస్కృతి, చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటాలన్న లక్ష్యంతో 72 వ మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ వంటి అంశాలను చెప్పారు.
దేశ రక్షణ, సమగ్రత విషయంలో రాజకీయాలకు అతీతంగా కేంద్రానికి మద్దతుగా తెలంగాణ నిలిచింది. పహల్గామ్ దాడుల ఘటనలో భారత సైన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ మద్దతుగా నిలిచిన అంశాన్ని ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మంది ప్రముఖులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు పురస్కారాలను అందించారు. అలాగే, వివిధ కేటగిరీల్లో విశేష ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు గ్యాలంటరీ అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు, డీజీపీ జితేందర్ గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.