తోతాపురి మామిడి రైతులకు రూ.4/- సబ్సిడీని సద్వినియోగం చేసుకోండి
తోతాపురి మామిడి రైతులకు రూ.4/- సబ్సిడీని సద్వినియోగం చేసుకోండి
ప్రతి రోజూ ర్యాంపుల వద్ద మామిడి అమ్మకం పై ఎంఏఓ లు, ఎంహెచ్ఓ లు, తహశీల్దార్లు నివేదికలు సమర్పించండి
- జిల్లా కలెక్టర్
చిత్తూరు, జూన్ 26: తోతాపురి మామిడి రైతులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.4/- ల ఆర్థిక సహాయం ను రైతులకు అందేలా చూడాలని మండల అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్ అసిస్టెంట్లు, తహశీల్దార్లు చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు.
మామిడి అమ్మకం, ప్రభుత్వ సబ్సిడీ వివరాల పై గురువారం ఆర్ డి ఓ లు, జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కుప్పం, పలమనేరు నియోజకవర్గాలలో గతంలో పండే దాదాపు 70 వేల మెట్రిక్ టన్నుల మామిడిని వ్యాపారవేత్తలు నేరుగా మామిడి తోటలకే వెళ్ళి కొనుగోలు చేసే వారని, ప్రస్తుతం ర్యాంప్ ల వద్ద కొనుగోలు తగ్గిందన్నారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాలలో మామిడి గుజ్జు పరిశ్రమలు లేవని, ఈ కారణంగా జిల్లాలోని ఇతర మామిడి గుజ్జు పరిశ్రమల వద్దకు రైతులు పోటెత్తుతున్నారన్నారు. మామిడి కాయల దిగుబడి పెరిగి డిమాండ్ తగ్గడంతో మార్కెట్ లో మామిడి కాయల ధర తగ్గిందన్నారు. ప్రస్తుత పరిస్థితి కారణంగా రైతులు నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు అండగా మార్కెట్ ధరకు అదనంగా రూ.4 లను రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. మండలాలలో గల ర్యాంప్ లను మండల వ్యవసాయ, ఉద్యాన, సెరి కల్చర్ అసిస్టెంట్లు సందర్శించాలన్నారు. షిఫ్ట్ ల ప్రకారం పని చేయు సిబ్బంది ర్యాంప్ ల వద్ద రైతులు జరుపుతున్న అమ్మకం వివరాలను నిర్దేశించిన ప్రోఫార్మాలలో పూరించి కలెక్టర్ కార్యాలయానికి పంపాలన్నారు. ఈ క్రాప్ తో సంబంధం లేకుండా సబ్సిడీ అందించడం జరుగుతుందన్నారు. తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వం అందించనున్న రూ.4/- సబ్సిడీని సద్వినియోగం అయ్యేలా చూడాలన్నారు. ప్రభుత్వం అందించే రూ.4 సబ్సిడీ పొందడానికి రైతులు మామిడి కాయలను కోసిన తరువాత గుజ్జు పరిశ్రమలకు, మండీలకు, ర్యాంపులకు తరలించిన యెడల గుజ్జు పరిశ్రమలు, మండీలు, ర్యాంపుల వద్ద నియమించిన అధికారులకు రైతు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు మరియు బ్యాంక్ వివరాలను ఇచ్చి నమోదు చేసుకోవాలన్నారు. రైతు స్వయంగా మామిడి తోట నుండి నేరుగా తమ పంటను వేరే రాష్ట్రాలకు సరఫరా చేసినా కూడా వివరాలను రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలన్నారు. ఈ సమాచారం ను విలేజ్ అగ్రికల్చర్, హార్టి కల్చర్, సెరికల్చర్ అసిస్టెంట్లు రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.