గుర్తింపు లక్ష్యంగా టూరిజం టెక్ AI 2.0 కాన్క్లేవ్ నిర్వహణ
టూరిజాన్ని ప్రపంచ స్థాయి గుర్తింపు లక్ష్యంగా టూరిజం టెక్ AI 2.0 కాన్క్లేవ్ నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ టూరిజాన్ని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ టూరిజం(GFST) మరియు ఆంధ్ర ప్రదేశ్ టూరిజం శాఖ సంయుక్తంగా టూరిజం టెక్ AI 2.0 కాన్క్లేవ్‌ను జూన్ 26 & 27, 2025 తేదీలలో విజయవాడలోని ఒక హోటల్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి టూరిజం మరియు కల్చర్ ప్రత్యేక కార్యదర్శి . అజయ్ జైన్, ఆంధ్రపదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ సీఈఓ ఆమ్రపాలి కాటా, ఆంధ్రపదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ .N.బాలాజీ, గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ టూరిజం(GFST) సభ్యులు .S.P.టక్కర్ మరియు ఇతర అధికారులు హాజరయ్యారు.
ఈ సదస్సులో మొదటి రోజు పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడే కీలక అంశాలపై ప్యానెల్ చర్చలు నిర్వహించారు. పర్యాటక అనుబంధ రంగాలలోని ప్రముఖ నిపుణులు, వాటాదారులు మరియు ప్రముఖ జాతీయ మరియు అంతర్జాతీయ బ్రాండ్‌ల నుండి పెట్టుబడిదారులు ఈ ప్యానెల్ సెషన్‌లలో పాల్గొన్నారు. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తులు & ప్రాజెక్టులు, పెట్టుబడులు, సామర్థ్య నిర్మాణ బ్రాండింగ్ & కమ్యూనికేషన్లు మరియు పర్యాటకంలో సాంకేతికత వంటి అంశాలపై నిపుణులు, భాగస్వాములతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటివలే రూపొందించిన టూరిజం పాలసీ 4.0కి అనుగుణంగా పటిష్టమైన వ్యూహాలను చర్చించి వాటిని అమల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్యానెల్ సెషన్‌లను నిర్వహించారు.
టూరిజం మరియు కల్చర్ ప్రత్యేక కార్యదర్శి. అజయ్ జైన్ మాట్లాడుతూ, ఈ కాన్క్లేవ్ వేదికగా టూరిజం శాఖ 80 మంది ప్రముఖ పెట్టుబడిదారులతో అవగాహన ఒప్పందాలు(MoU)కుదుర్చుకోనుందని, ఈ ఒప్పందాల ఫలితంగా రాష్ట్రంలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. రూ.10,140 కోట్లకు పైగా పెట్టుబడులతో చేపట్టే ఈ ప్రాజెక్టుల ద్వారా రాబోయే నాలుగు సంవత్సరాలలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో 22,325 మందికి పైగా ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించనునట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టులు ద్వారా హోటల్స్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడమే కాకుండా భారతదేశంలో ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా మారాలనే రాష్ట్ర ఆశయానికి బలమైన మద్దతునిస్తాయన్నారు. హోమ్‌స్టేలు, క్రూయిజ్‌లు, అడ్వెంచర్ స్పోర్ట్స్ మరియు వాటర్ స్పోర్ట్స్ నుండి వివిధ కంపెనీలు మరియు పెట్టుబడిదారులు ఈ కాన్క్లేవ్ లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నారని, గ్లోబల్ టూరిజం హబ్‌గా ఆంధ్రప్రదేశ్ మారడానికి ఈ కాన్క్లేవ్ దోహదపడుతుందని అజయ్ జైన్ తెలిపారు
టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి కాటా మాట్లాడుతూ, ఆంధ్రపదేశ్ లో టూరిజం రంగం అభివృద్ధి చేయడానికి కావలసిన వనరులు ఉన్నాయని, అందులోను ప్రతేక ఆకర్షణగా ఉన్న తీరప్రాంతం మరియు తిరుపతి వంటి ఆద్యాత్మిక ప్రాంతాలు పర్యాటక రంగ అభివృద్ధికి మరింత దోహదం చేస్తాయన్నారు. ఆంధ్రపదేశ్ లో దాదాపు 80 వేలకు పైగా దేవాలయాలు ఉన్నాయని, టెంపుల్ టూరిజం పై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లయితే మన గౌరవ ముఖ్యమంత్రి ఆశించిన విజన్-2047 లక్ష్యాలకు చేరువ కావచ్చని ఆమ్రపాలి తెలిపారు.
టూరిజం కాన్క్లేవ్ మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసే ఆరు కీలక అంశాలపై వేరువేరుగా ఆరు వ్యూహాత్మక ప్యానల్లకు, ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్లు సమన్వయ కర్తలుగా వ్యవహరించారు. బ్రాండింగ్ & మార్కెటింగ్, డిజిటల్ సాధనాల ద్వారా స్మార్ట్ టూరిజం, ఉత్పత్తులు మరియు ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల పెట్టుబడులు మరియు భాగస్వామ్యాలు, నాణ్యమైన డెలివరీ కోసం సామర్థ్య నిర్మాణ నైపుణ్యం, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ - కళలు మరియు సంస్కృతి ద్వారా జీవనోపాధిని కల్పించడం వంటి వివిధ అంశాలపై అధికారుల సమక్షంలో చర్చలు జరిగాయి.
ఈ కాన్క్లేవ్ లో భాగంగా 2వ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భాగస్వాములు మరియు పెట్టుబడి దారులతో సమావేశం కానున్నారని, గౌరవ ముఖ్యమంత్రి సమక్షంలో వివిధ అవగాహన ఒప్పందాలపై(MoU's) పై సంతకాలు చేయనున్నారని టూరిజం మరియు కల్చర్ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుల కార్యాచరణ చర్యలకు కూడా మార్గనిర్దేశం చేయడానికి ప్యానెల్ సిఫార్సులను నేరుగా గౌరవనీయ ముఖ్యమంత్రికి సమర్పించనున్నట్లు అజయ్ జైన్ తెలిపారు. ఈ టూరిజం కాన్క్లేవ్ లో గౌరవ ముఖ్యమంత్రి కీలకమైన వ్యూహాత్మక పరికరాలు మరియు డాష్‌బోర్డ్‌లు, స్ట్రాటజీ పేపర్, కాఫీ టేబుల్ బుక్, టూరిజం డిజిటల్ కాలండర్ ను ప్రారంభించనున్నారని తెలిపారు.
టూరిజం కాన్క్లేవ్ లో బ్రాండింగ్ & మార్కెటింగ్ పానెల్ సమన్వయ కర్తగా వ్యవహరించిన రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు, హిమాన్షు శుక్లా మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల గురంచి మీడియా ద్వార ప్రజల్లో అవగాహనా కల్పిస్తున్నట్లే, ఆంధ్రప్రదేశ్ టూరిజం రంగాన్ని ప్రపంచ స్థాయి గుర్తింపు తిసుకురావడానికి కృషి చేస్తామని అందుకు కావాల్సిన వ్యూహాత్మక చర్యలను పెట్టుబడిదారులతో చర్చించి కార్యాచరణలోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. పర్యాటక ప్రాంతాలలో కావాల్సిన మౌలిక సదుపాయాల నుండి ఆటవిడుపు మరియు వినోదాత్మక అంశాల ఏర్పాటు వరకు అన్ని విషయాలపై పెట్టుబడిదారులతో కూలంకుష చర్చ జరిపి నివేదిక ఇవ్వనున్నట్లు హిమాన్షు శుక్లా తెలిపారు.
ఈ కార్యక్రమానికి మైలవరపు కృష్ణతేజ ఐఏఎస్, ప్రభాకర్ జైన్ ఐఏఎస్, రేఖారాణి ఐఏఎస్, వాకాటి కరుణ ఐఏఎస్ మరియు పలు అధికారులు, జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కలగిన సంస్థల అధినేతలు, పెట్టుబడి దారులు హాజరయ్యారు.