రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Air India: విమాన ప్రమాదంలో... అందరి దృష్టి 'బ్లాక్ బాక్స్' పైనే ఎందుకు ఉంటుంది?

Vijay Rupani Ahmedabad plane crash Air India crash Gujarat Black box DGCA Flight data recorder Cockpit voice recorder Plane accident investigation MAY
Mounikadesk

Air India: విమాన ప్రమాదంలో... అందరి దృష్టి 'బ్లాక్ బాక్స్' పైనే ఎందుకు ఉంటుంది?

• అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిరిండియా విమానం..

• విమానంలో 242 మంది..

• ఇప్పటివరకు 204 మంది మృతి!

• లభ్యమైన బ్లాక్ బాక్స్!

అహ్మదాబాద్‌లో గురువారం పెను విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం కుప్పకూలిన ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా మొత్తం 204 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పుడు అందరి దృష్టి బ్లాక్ బాక్స్ పై పడింది. బ్లాక్స్ బాక్స్ లోని డేటాను విశ్లేషిస్తే విమాన ప్రమాదానికి దారితీసిన కారణాలేంటో తెలుస్తాయి.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ విమానం మధ్యాహ్నం 1:38 గంటలకు అహ్మదాబాద్‌లోని రన్‌వే 23 నుంచి గాల్లోకి ఎగిరింది. అయితే, టేకాఫ్ అయిన కేవలం 8 నిమిషాల వ్యవధిలోనే పైలట్లు అత్యవసర పరిస్థితిని సూచిస్తూ 'మేడే' (MAYDAY) కాల్ జారీ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే విమానంతో సంబంధాలు తెగిపోయి, అది కుప్పకూలింది.

లభ్యమైన బ్లాక్ బాక్స్.. దర్యాప్తునకు కీలకం

ప్రమాద వార్త అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టిన విమానాశ్రయ అధికారులు, ఘటనా స్థలంలో విమానానికి చెందిన బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విమాన ప్రమాదాల దర్యాప్తులో ఈ బ్లాక్ బాక్స్ అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తారు. విమానం కూలిపోవడానికి ముందు అసలేం జరిగిందనే విషయాలను కచ్చితంగా తెలుసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఈ బ్లాక్ బాక్స్‌ను విశ్లేషించడం ద్వారా ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి? 

విమానాల్లో అమర్చే 'బ్లాక్ బాక్స్' అనేది నిజానికి నల్లగా ఉండదు. ఇది ప్రకాశవంతమైన నారింజ రంగులో ఉండే ఒక ఎలక్ట్రానిక్ రికార్డింగ్ పరికరం. విమానయాన ప్రమాదాలు, సంఘటనల దర్యాప్తును సులభతరం చేసే ఉద్దేశంతో దీనిని విమానంలో అమర్చుతారు. ప్రమాదం జరిగిన తర్వాత దీనిని స్వాధీనం చేసుకొని, విమానం చివరి క్షణాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరిస్తారు.

సాధారణంగా బ్లాక్ బాక్స్‌ను టైటానియం లోహంతో తయారుచేస్తారు. దీనిని మరో టైటానియం పెట్టెలో భద్రపరుస్తారు. మంటలతో కూడిన తీవ్రమైన ప్రమాదాలను కూడా ఇది తట్టుకోగలదు. ఈ పెట్టెలో రెండు వేర్వేరు పరికరాలు ఉంటాయి: ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్‌డీఆర్), రెండోది కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్).

ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్‌డీఆర్) విమానం ప్రయాణ సమయంలో దాని సాంకేతిక పనితీరుకు సంబంధించిన డేటాను నమోదు చేస్తుంది. అంటే, విమానం ఎత్తు, వేగం, దిశ, ఇంజిన్ల పనితీరు వంటి అనేక అంశాలను ఇది రికార్డ్ చేస్తుంది. మరోవైపు, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) కాక్‌పిట్‌లో పైలట్, కో-పైలట్ల మధ్య జరిగిన సంభాషణలను, అలాగే వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో జరిపిన సంభాషణలను రికార్డ్ చేస్తుంది. ఒకవేళ విమానం నీటిలో మునిగిపోతే, దానిని గుర్తించడంలో సహాయపడటానికి ఎఫ్‌డీఆర్ నుంచి అల్ట్రాసోనిక్ 'పింగ్' శబ్దం వెలువడుతుంది.

ప్రస్తుతం లభ్యమైన బ్లాక్ బాక్స్‌లోని డేటాను విశ్లేషించడం ద్వారా అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కచ్చితమైన కారణాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. 



Comments

-Advertisement-