ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి..
ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి..
జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా
పెనమలూరు/పోరంకి: జూన్ 11, 2025
రేపు గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు.
కూటమి ప్రభుత్వ ఏడాది సుపరిపాలన సందర్భంగా ఈ నెల 12వ తేదిన పెనమలూరు మండలం, పోరంకి గ్రామంలోని మురళీ రిసార్ట్స్ లో అందుకు సంబంధించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమమును నిర్వహిస్తుండగా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా, ప్లానింగ్ ఫైనాన్స్ సెక్రటరీ అనంత శంకర్, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు డీకే బాలాజీ, నాగలక్ష్మీ, జాయింట్ కలెక్టర్లు గీతాంజలి శర్మ, భార్గవ్ తేజ్, కృష్ణా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, సాధారణ పరిపాలన శాఖ ప్రోటోకాల్ అధికారి మోహన్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, ఇతర అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు అన్ని నియోజకవర్గాల పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారని, వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. ముఖ్యమంత్రి రాకపోకలు, భద్రతకు ఎలాంటి అంతరాయం కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రితో పాటు ఇతర విఐపిలు, అధికారులకు భోజన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి నుంచి వేదిక ఆవరణ వరకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్లు అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి వారు నిర్వర్తించవలసిన బాధ్యతలపై శాఖల వారీగా సమీక్షించారు. అధికారులందరూ వారికి అప్పగించిన పనులను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, గుడివాడ ఆర్డీవో జి బాలసుబ్రమణ్యం, డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, తాడిగడప మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, అగ్నిమాపక శాఖ అధికారి యేసురత్నం, డిఎస్ఓ వి పార్వతి, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శర్మిష్ఠ, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, డ్వామా, డీఆర్డిఏ పీడీలు శివ ప్రసాద్ యాదవ్, హరిహరనాథ్, డీటీడబ్ల్యుఓ ఫణి ధూర్జటి తదితర అధికారులు పాల్గొన్నారు.