చెట్లే మనిషి ఆనవాళ్లు
చెట్లే మనిషి ఆనవాళ్లు
• వచ్చే ఏడాదికి అయిదు కోట్ల మొక్కలు నాటి పెంచడమే లక్ష్యం
• నల్లమల కోసం మూడు దశాబ్దాలుగా పని చేస్తున్న అంకారావు జీవితం స్ఫూర్తిదాయకం
• అడవుల పెంపకమే కాదు... కార్చిచ్చుల నివారణకు సదస్సులు
• పర్యావరణంపై అవగాహన కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
•మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
•రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్
•అనంతవరంలో నిర్వహించిన వన మహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాల్గొన్న పవన్ కళ్యాణ్
‘మా చిన్ననాటి కాలంలో మిత్రులకు ఇంటి చిరునామా చెప్పేటపుడు గుర్తులుగా చెట్ల పేర్లు చెప్పేవాళ్లం. మా ఇంటి ముందు ఫలానా చెట్టు ఉంటుందనో, వారి ఇంటి ముందు గోరింటాకు చెట్టు అంటూ ఆనవాళ్లు చెప్పేవాళ్లం. మనిషికి ఆనవాళ్లు చెట్లు, వృక్షాలే. వాటితో మన జీవనం.. జీవితం ముడిపడి ఉంద’ని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ చెప్పారు. నా వ్యక్తిగత జీవితంలో ఇప్పటి వరకు పర్యావరణాన్ని పెంపొందించే దిశగా పలు కార్యక్రమాలు చేశానని, ఇక మీదట దాన్ని సమాజం మొత్తానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతానని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తాడికొండ నియోజకవర్గం, అనంతవరంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితోపాటు పవన్ కళ్యాణ్ హాజరై మొక్కలను నాటి, అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ఈ ఒక్క రోజే కోటి మొక్కలు నాటడం... వచ్చే ఏడాదికల్లా అయిదు కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘చెట్టు మనకు ఆధారం. చెట్లు లేని భూమిని ఊహించలేము. నల్లమల అటవీ పరిరక్షణ కోసం మూడు దశాబ్దాలుగా అలుపెరగకుండా పని చేస్తున్న కొమ్మిర అంకారావు గారి లాంటి వ్యక్తి జీవితం భావితరాలకు స్ఫూర్తివంతం. అంకారావు గారి గురించి తెలుసుకున్న కొద్దీ మరింత ఆసక్తిని కలిగిస్తుంది. పర్యావరణం, మొక్కల పెంపకం, అడవుల్ని సంరక్షించుకోవడం అనేది మనిషి ప్రాథమిక బాధ్యత అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. నేను ప్రతిసారి వ్యక్తిగతంగా పర్యావరణం గురించి చాలా పనులు చేశాను. ఇక వచ్చే ఏడాది ఇదే సమయానికి అయిదు కోట్ల మొక్కల పెంపకం అనేది లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తాను. ఆ అనుభవాలను వచ్చే ఏడాది మీ అందరి ముందు పంచుకుంటాను. కార్చిచ్చులు ఆపేందుకు గొర్రెల కాపర్లకు తగిన అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. వాటిని నివారించేలా ప్రణాళికతో ముందుకు వెళతాం.
• 50% పచ్చదనం లక్ష్యం నిర్దేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
రాష్ట్రంలో పచ్చదనం మీద మేమంతా రకరకాల లెక్కలు చెబుతుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం కచ్చితంగా రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంపొందాలని బలంగా చెప్పారు. లక్ష్యాలను మాకు నిర్దేశించారు. ప్రకృతి పరిరక్షణ మీద, పర్యావరణం మీద అవగాహన కలిగిన గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు . దీనికి అనుగుణంగా మేం కూడా నగర వనాలు, అడవుల సంరక్షణ, కార్చిచ్చుల నిరోధం, మొక్కల పెంపకం మీద ఓ ప్రణాళికను నిర్దేశించుకొని ముందుకు వెళతాం. చంద్రబాబు హయాంలో నీరు – చెట్టు వంటి పనులు విజయవంతంగా నిలిచాయి. ఆయన విజన్ లో పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. చంద్రబాబు మార్గదర్శకంలో అద్భుతమైన పచ్చటి ప్రగతిని సాధించి, తగిన విధంగా బాధ్యతను నిర్వర్తిస్తాం’’ అన్నారు.
అంకారావును అటవీ శాఖ సలహాదారుగా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వేదిక నుంచి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ కృష్ణయ్య, అమరావతి డవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ లక్ష్మీ పార్థసారధి, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, పీసీసీఎఫ్ ఎ.కె.నాయక్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.