సోమిశెట్టి మధుసూదన్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ రూ.50 లక్షలు ఆర్థిక సాయం
సోమిశెట్టి మధుసూదన్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ రూ.50 లక్షలు ఆర్థిక సాయం
• కావలిలో మధుసూదన్ కుటుంబానికి చెక్కులు అందించిన కందుల దుర్గేష్
పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో హతమైన కావలి వాసి, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సోమిశెట్టి మధుసూదన్ రావు కుటుంబానికి జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన రూ.50 లక్షలు ఆర్థిక సాయాన్ని శుక్రవారం కావలిలో రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అందించారు. కావలిలో మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించి పవన్ కళ్యాణ్ పంపించిన చెక్కులను అందించారు. టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మధుసూదన్ కుమార్తె, కుమారుడు పేరిట రూ.22.5 లక్షలు చొప్పున రూ.45 లక్షలు, తల్లితండ్రులకు రూ.5 లక్షలు... మొత్తంగా రూ.50 లక్షలు సాయం చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ భార్య, తల్లితండ్రులు తమకు ఆర్థిక సాయం అందించిన పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియచేశారు. ఎంతో నిండు మనసుతో తమకు ఆండగా నిలిచిన పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా తమ బిడ్డలను చదివిస్తామని మధుసూదన్ సతీమణి తెలిపారు.
అనంతరం కందుల దుర్గేష్ మాట్లాడుతూ “విహార యాత్రకు కుటుంబంతో కశ్మీర్ వెళ్ళిన సోమిశెట్టి మధుసూదన్ రావు గారిని ఉగ్రవాదులు హతమార్చారు. ఎంతో కష్టపడి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఎదిగిన మధుసూదన్ గారి మరణంతో ఆ కుటుంబం ఎంతో తల్లడిల్లిపోయింది. ఆ పరిస్థితిని కళ్ళారా చూసిన మా అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు రూ.50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఆ మేరకు చెక్కులను పంపించారు. పవన్ కళ్యాణ్ నిన్న మాతో మాట్లాడిన సందర్భంలో మధుసూదన్ కుటుంబానికి ధైర్యం చెప్పాలని సూచించారు. దేశం పట్ల భక్తి, ప్రజల పట్ల బాధ్యత కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ . ఆయన ఆశయాలను విశ్వసించిన జనసేన పార్టీ శ్రేణులు, నాయకులు ఎప్పుడూ బాధ్యతతో ఉంటాయి. ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది. నుదిటి తిలకం చెరిపిన ఉగ్రవాదుల మూలాలను చేరిపేసేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా చేపట్టిన యుద్ధం ద్వారా దీటైన జవాబు ఇచ్చారు” అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అలహరి సుధాకర్, చిత్తలూరి సుందరరామిరెడ్డి, కోలా విజయలక్ష్మి, నూనె మల్లికార్జున యాదవ్, గునుకుల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.