ఉరుములు, మెరుపులతో జాగ్రత్తగా ఉండాలి
ఉరుములు, మెరుపులతో జాగ్రత్తగా ఉండాలి
• రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు
• మెండుగా ఉరుములు, పిడుగులు పడే అవకాశం
• తగిన జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు
నైరుతి రుతుపవనాలు వేగంగా వచ్చేశాయి. వేసవి వానాకాలం ఆరంభంలోనే ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో పడుతున్న పిడుగులు జనాలను భయకంపితులను చేస్తున్నాయి. గురువారం ఆదిలాబాద్ జిల్లాలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. గతేడాది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు రైతులు పిడుగుపాటుకు బలయ్యారు. వర్షాల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల నుంచి బయటపడొచ్చనే విషయాన్ని నిపుణులు వివరించారు.
పిడుగులు పడే సందర్భంలో ఆరుబయట తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మెరుపులు, ఉరుములు వస్తున్న సమయంలో ఆరుబయట పని చేయడం, చేపలు పట్టడం, పశువులను మేపడం వంటివి చేయకూడదు. అత్యవసరమైతేనే తప్ప ప్రయాణాలు చేయకూడదు. చెరువులు, కుంటలకు దూరంగా ఉండాలి.
ఎత్తైన టవర్లు, స్తంభాలు, చెట్ల వద్దకు వెళ్లకూడదు. వాటి నుంచి దూరంగా ఉంటే మరీ మంచిది. పిడుగులు ఎత్తైన ప్రదేశాలలోనే పడతాయి. కనుక తప్పనిసరి పరిస్థితులలో చిన్న చెట్లను ఎంపిక చేసుకోవాలి. లేదా దగ్గరలో ఏదైనా ఇల్లు ఉంటే అక్కడికి వెళ్లాలి.
విద్యుత్తు నియంత్రికలకు దూరంగా ఉండాలి.
కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, కరెంట్ స్టవ్‌లు, విద్యుత్తు పరికరాలు ఉపయోగించొద్దు. ముఖ్యంగా విద్యుత్తు సరఫరా హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు జాగ్రత్త పాటించాలి.
పిడుగులు పడే సమయంలో ఆరుబయట ఉన్నవారు భూమిపై కూర్చోవాలి. ఆ సమయంలో పిడుగుల శబ్దం గుండెకు చేరకుండా చెవులు మూసుకొని ఉండాలి.
వర్షాలు కురుస్తున్నప్పుడు కరెంటు మోటార్ల వద్దకు వెళ్లి పనులు చేయకూడదు. సురక్షిత ప్రాంతానికి వెళ్లాలి. చరవాణులను వాడకూడదు. రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
నేరుగా పిడుగు మీద పడితే ఎక్కువ శాతం మంది మరణిస్తారు. దగ్గరలో పిడుగు పడినప్పుడు శరీరంపై కాలిన గాయాలుకావడం, గుండెపోటు రావడం, ఆ శబ్దానికి చెవులు వినిపించకుండాపోయే ప్రమాదాలున్నాయి. కనుక బాధితులకు వెంటనే చికిత్స అందించాలి.