యోగాతోనే ఆరోగ్య వైభోగం
మెగా యోగాంధ్ర ర్యాలీకి విశేష స్పందన
యోగాతోనే ఆరోగ్య వైభోగం
- యోగాతోనే ఆరోగ్య వైభోగం
- ప్రతి మనిషి మనసులో యోగా ముద్ర పడాలి
- జిల్లాలో 10 లక్షల మందికి యోగాసనాలు నేర్పాలన్నది లక్ష్యం
- అయిదువేల మంది ట్రైనర్లతో ప్రజలకు శిక్షణ ఇస్తున్నాం
- నగరంలో మూడువేల మందితో మెగా యోగాంధ్ర ర్యాలీ
- ర్యాలీకి తరలివచ్చిన ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, యోగా ఔత్సాహికులు
- ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
యోగా ఆవశ్యకతను చాటిచెప్పేందుకు నిర్వహిస్తున్న యోగాంధ్ర ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని, జిల్లాలో పది లక్షల మందికి యోగాసనాలు నేర్పేందుకు అయిదువేల మంది ట్రైనర్లతో శిక్షణ ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా సంపూర్ణ ఆరోగ్యానికి యోగాతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించి, జీవితాంతం యోగా సాధన చేసేలా ప్రజలను ప్రోత్సహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీని కలెక్టర్ లక్ష్మీశ.. అధికారులతో కలిసి ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి వడివడిగా అడుగులేస్తూ యోగాసనాల ఉపయోగాలను చాటిచెప్పారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ నెల రోజుల యోగాంధ్ర కార్యక్రమాల ద్వారా మన భారతీయ వారసత్వ సంపద యోగాను ప్రతిఒక్కరికీ చేరువచేసే గొప్ప ప్రయత్నం జరుగుతోందని.. ఇందులో భాగంగా 20వ రోజు యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా మెగా యోగా ర్యాలీలు నిర్వహించినట్లు తెలిపారు.
భారతదేశంలో పుట్టిన యోగా నేడు విశ్వవ్యాప్తమవుతోందని, నేడు ఎన్నో దేశాల ప్రజలు తమ దినచర్యలో యోగాను భాగం చేసుకుంటున్నారన్నారు. గౌరవ ప్రధానమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి పిలుపుతో మన దేశం, మన రాష్ట్రంలో యోగాకు రోజురోజుకూn ఆదరణ పెరుగుతోందని, ప్రతిరోజూ యోగాసనాల అభ్యసన ద్వారా రోగాలు, రుగ్మతలు దరచేరవని పేర్కొన్నారు. రాష్ట్రంలో జూన్ 21 నాటికి కనీసం రెండు కోట్ల మందికి, జిల్లాలో దాదాపు పది లక్షల మందికి యోగాసనాలను నేర్పించేందుకు ప్రతి గ్రామం, పట్టణంలోనూ యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దాదాపు 5 వేల మంది యోగా ట్రైనర్లతో ప్రజలకు శిక్షణ ఇస్తున్నామన్నారు. రోజూ వివిధ వర్గాల వారితో.. చిన్నారుల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు అందరికీ యోగాసనాలను చేరువచేసేందుకు కృషిచేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు.
యోగాసనాలు వేయండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి:
యోగాసనాలు వేయండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.. అనే నినాదంతో యోగాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిపుణులతో రూపొందించిన 45 నిమిషాల సరళ యోగా కామన్ ప్రోటోకాల్‌తో యోగాసనాలను నేర్పిస్తున్నట్లు వివరించారు. ఒత్తిడి రహిత జీవిత ప్రయాణానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందన్న విషయాన్ని వివరిస్తూ తమ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో మీడియా కూడా కీలకపాత్ర పోషిస్తోందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
కార్యక్రమంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. అధికారులతో కలిసి డ్రగ్స్ వద్దు బ్రో (1972 టోల్ ఫ్రీ నంబరు) నినాదంతో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. డ్రగ్స్ భూతాన్ని సమాజం నుంచి తరిమేసే లక్ష్యంతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను అమలుచేస్తున్నామని, డ్రగ్స్ రహిత జిల్లా, రాష్ట్రం లక్ష్యంగా భాగస్వామ్య పక్షాలతో కలిసి కృషిచేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
యోగా మెగా ర్యాలీ కార్యక్రమంలో విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, స్వచ్ఛంద సంస్థలు, వాకర్స్ అసోసియేషన్స్, యోగా శిక్షణ సంస్థలు, యోగా గురు సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు.