నేతన్నలకు చంద్రన్న గుడ్ న్యూస్
నేతన్నలకు చంద్రన్న గుడ్ న్యూస్
- వేతనాలు, ప్రాసెసింగ్ చార్జీల పెంపు
- రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి వెల్లడి
- నెలకు రూ.3 వేల అదనపు వేతనం రాక
- ఈ ఏడాది ఆప్కో ద్వారా రూ.7 వేల కోట్ల చేనేత వస్త్రాల కొనుగోలు
- ఆప్కో బలోపేతానికి ఐఐఎం-వీ ఒప్పందం
- చేనేత, హస్త కళాకారులకు నూతన డిజైన్ల పోటీ
- ఉత్తమ డిజైన్లు రూపొందించిన విజేతలకు నగదు బహుమతులు
- పీపీపీ మోడళ్లలో ఇతర రాష్ట్రాలో లేపాక్షి షో రూమ్ ల ఏర్పాటు : మంత్రి సవిత
అమరావతి, జూన్ 13: వేలాది మంది నేతన్నలకు లబ్దిచేకూర్చే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ చార్జీలను పెంచే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లు రాష్ట్ర బి.సి., ఇ.డబ్ల్యు.ఎస్. సంక్షేమం, చేనేత మరియు టెక్సటైల్స్ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ సాంప్రదాయ చేనేత రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో దాదాపుగా 1,036 చేనేత సహకార సంఘాలున్నాయని, వాటిలో 89 వేల మగ్గం నేత కార్మికులు ఉన్నారని అన్నారు. వీరందరికీ ఆర్థికంగా ఊతం ఇచ్చే విధంగా, వారి జీవనోపాధి మెరుగుపడే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను గణనీయంగా పెంచడం జరిగిందన్నారు. APCO కు ఉత్పత్తులను సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలు (PHWCSలు) కింద పనిచేసే నేత కార్మికులకు వేతనాలు మరియు ఛార్జీల పెంపు వర్తిస్తుందన్నారు. బ్లీచింగ్ ఛార్జీలు బండిల్‌కు రూ.129 నుంచి రూ.148లకు (15%), డైయింగ్ ఛార్జీనలు బండిల్‌కు రూ.362 నుంచి రూ.434లకు (20%), బెడ్‌షీట్ నేత మజూరి రూ.83 నుంచి రూ.100లకు (20%) మరియు టవల్ నేత మజూరి రూ.31 నుంచి రూ.40లకు (30%) పెంచడం జరిగిందని ఆమె తెలిపారు. ఫలితంగా ఒక్కో నేతన్నకు నెలకు అదనంగా రూ.3 వేల ఆదాయం రానున్నదన్నారు. ఈ విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీల పెంపుదలతో నేతన్నలకు ఆర్థిక భరోసా కలగడమే కాకుండా నేతన్నల సంక్షేమం, అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. ఈ ఏడాది ఆప్కో ద్వారా రూ.7 కోట్ల చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలని నిర్ణయించామని మంత్రి సవిత వెల్లడించారు. ఇందుకు ఏడాదిలో కాలాన్ని 4 నెలలు చొప్పున్న మూడు క్వార్టర్లగా కొనుగోలు సమాయాన్ని నిర్ణయించామన్నారు.
దేశంలోను, రాష్ట్రంలోను గ్రామీణ ఉపాధిలో వ్యవసాయం తర్వాత చేనేత రంగంపైనే ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నేతన్నల సంక్షేమానికి పెద్ద పీఠ వేయడం జరిగిందన్నారు. అధికారంలోకి రాగానే నేతన్నలకు చేదోడుగా ఉండేందుకై ఎగ్జిబిషన్లు, విక్రయదారులు, కొనుగోలు దారుల సమావేశాలు నిర్వహించడం జరిగిందని, ఆధునిక డిజైన్లపై నేతన్నలకు శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు. అదే విధంగా ఎన్నికల సమయంలో చేనేతలకు 50 సంవత్సరాలకే ఫించను ఇస్తామని ఇచ్చిన హామీని నిలపెట్టుకోవడం జరిగిందని, ప్రతి నెలా రూ.4 వేల చొప్పున దాదాపు 92,274 మంది నేతన్నలకు ఫించను అందజేయడం జరుగుచున్నదన్నారు. నేతన్న మగ్గాలకు ఉచితంగా విద్యుత్ను అందజేయడం జరుగుచున్నదని, మర మగ్గాలకు 500 యూనిట్లు, చేతి మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ లకు 500 యూనిట్లు ఉచితంగా అందజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. గృహ నిర్మాణ పథకం క్రింద కూడా నేతన్నలకు రూ.50 వేలు అదనంగా అందజేయడం జరుగుచున్నదన్నారు.
చేనేత, హస్తకళల నూతన డిజైన్ల పోటీలు......
రాష్ట్రంలోని నేత కార్మికులతో పాటు హస్తకళాకారుల ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో నూతన డిజైన్ల కోసం పోటీలు నిర్వహించబోతున్నామని మంత్రి తెలిపారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్ (NID-AP) సహకారంతో ఆప్కో, లేపాక్షి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ నెల 17 నుంచి 30 రోజుల పాటు నూతన డిజైన్లను కళాకారుల నుంచి స్వీకరిస్తున్నామన్నారు. పలు కేటగిరీల్లో ఉత్తమ డిజైన్లను ఎంపిక చేసి విజేతలకు రూ.5 లక్షల నగదు బహుమతులు అందజేయనున్నామని ఆమె తెలిపారు.
ఆప్కో, లేపాక్షి పనితీరు మరింత మెరుగుపరచడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, విశాఖపట్నం (IIM)తో ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. ఆప్కో, లేపాక్షిలో జవాబుదారీతనం, పారదర్శకతను బలోపేతం చేయడం, లాభాల బాటలో పయనించేలా చేయడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం అన్నారు. పబ్లిక్-ప్రైవేటు- పార్టనర్ షిప్(PPP) మోడల్ ద్వారా ఇతర రాష్ట్రాల్లో లేపాక్షి షోరూమ్ లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
రాష్ట్ర చేనేత మరియు టెక్సటైల్స్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా మాట్లాడుతూ చేనేత మరియు జౌళి శాఖలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు పలు సూచనలు, ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. విద్యుత్ మగ్గాలు, పలు కంపెనీలు రావడం వల్ల రాష్ట్రంలోని నేత కార్మికులు, హస్తకళాకారులు ఎటు వంటి సంక్షోభానికి గురి కాకుండా వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆ దిశలో నేతకార్మికుల కష్టానికి తగ్గట్టుగా వారికి ఆదాయం ఉండాలనే లక్ష్యంతో వేతనాలు, ప్రాసెసింగ్ చార్జీలు పెంచేందుకై రాష్ట్ర స్థాయి కమిటీని నియమించి, ఆ కమిటీ సూచనలు మేరకు తగు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
ఆప్కో మరియు లేపాక్షి మేనేజింగ్ డైరెక్టర్ విశ్వ మాట్లాడుతూ ఆప్కో మరియు లేపాక్షి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, విశాఖపట్నం (IIM)తో మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్ (NID-AP) ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని తెలిపారు. ఆప్కో నష్టాలను ఏ విధంగా నియంత్రించాలి, ఉత్తమ ఆర్థిక నిర్వహణ ఏ విధంగా చేయాలనే అంశంపై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీ చేస్తుందని తెలిపారు. పిపిపి విధానంలో ఏ విధంగా లేపాక్షి షోరూమ్ లను విస్తరించాలన అనే అంశంపై కూడా స్టడీచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆప్కో 93 షోరూమ్లు మరియు 19 లేపాక్షి షోరూమ్లు ఉన్నాయని, ఆప్కో ఉత్పత్తులు లేపాక్షి షోమ్ లలోను, లేపాక్షి ఉత్పత్తులు ఆప్కోషోరూమ్లలోను అందుబాటులో ఉండే విధంగా కుడా ఒప్పందం చేస్తుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.