అంటువ్యాధులు ప్రబలకూడదు... స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం
అంటువ్యాధులు ప్రబలకూడదు... స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం
- డ్వాక్రా మహిళల జీవన ప్రమాణాలు పెంచాలి
- ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలపై ఫోకస్ పెట్టండి
- పౌల్ట్రీ వేస్ట్ పాలసీని తీసుకురండి
- లెగసీ వేస్ట్ కన్పించకూడదు
- మున్సిపల్ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, జూన్ 28: మున్సిపాల్టీలు, కార్పోరేషన్లల్లో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం సీఎం క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ శాఖపై చంద్రబాబు సమీక్షించారు. మున్సిపల్ శాఖ పనితీరు, మున్సిపల్ శాఖ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రగతి, వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, మున్సిపాల్టీలు, కార్పోరేషన్లల్లో మౌలిక సదుపాయాల కల్పన, మెప్మా పరిధిలో చేపడుతున్న కార్యక్రమాలు వంటి అంశాలపై చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కొన్ని సూచనలు చేశారు. “వర్షాకాలం వస్తోంది. దోమలు పెరుగుతాయి.. డ్రైనేజీలు పొంగి పొర్లకుండా చూసుకోండి. నీరు కలుషితం కాకూడదు.. స్వచ్ఛమైన తాగు నీరు అనేది ప్రజలకు అందివ్వాలి. అంటు వ్యాధులు ప్రబలకూడదు. దోమల వల్లే వ్యాధులు వస్తాయి. దీన్ని నివారించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి.. కొన్ని ప్రాంతాల్లో పౌల్ట్రీవేస్ట్ వల్ల పరిసరాలు అపరిశుభ్రమవుతున్నాయి. పౌల్ట్రీ వేస్టును ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా.. ఓ పద్దతి ప్రకారం జరిగేలా చూడాలి. పౌల్ట్రీ వేస్ట్ కోసం ప్రత్యేకంగా పాలసీని తీసుకురండి. దీనికి అవసరమైతే సర్క్యులర్ ఎకానమీని కూడా అనుసంధానం చేసుకోవచ్చేమో పరిశీలించండి.” అని సూచించారు.
డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయాలి
“డ్వాక్రా సంఘాల ద్వారా మహిళాభివృద్ధి జరుగుతుంది. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు డిమాండ్ పెరిగేలా చేయాలి. వారు చేసే ఉత్పత్తులు నాణ్యతగా ఉండేలా చూడాలి. దీనికి అవసరమైన నైపుణ్య శిక్షణను డ్వాక్రా మహిళలకు నిరంతరం ఇవ్వాలి. ప్రభుత్వం చేస్తున్న కృషి వల్ల డ్వాక్రా మహిళల ఆదాయం పెరగాలి. వారి జీవన ప్రమాణాలు పెరగాలి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మెప్మా అధికారులు పని చేయాలి. ఈ-కామర్స్ వంటి ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ల ద్వారా డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేలా చూడాలి. మహిళా సాధికారతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుంది. ప్రజలకు సేవలు అందించడంతో పాటు.. మనం ఆయా మున్సిపాల్టీలకు ఎంత మేర ఖర్చు పెడుతున్నామనే విషయాన్ని కూడా ప్రజలకు వివరించాలి. మున్సిపాల్టీల్లో రోడ్లను పూర్తి స్థాయిలో వేయాలి.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
రోడ్లపై చెత్త కన్పించకూడదు
“కాలుష్యం బారిన పడి ప్రజలు ఆరోగ్యం దెబ్బతినకూడదు. నగరాలు, పట్టణాల్లో పొల్యూషన్ అనేది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అర్బన్ ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ పెరగాలి. డస్ట్ పొల్యూషన్ అనేదే ఉండకూడదు. స్వీపింగ్ మిషన్లతో ఎప్పటికప్పుడు రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలి. మున్సిపాల్టీలు.. కార్పోరేషన్లల్లో స్ట్రీట్ లైటింగ్ కోసం సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి రావాలి. దీని కోసం ఎలాంటి విధానాలు అవలంభించాలో ఆలోచించి.. ఆ మేరకు చర్యలు తీసుకోండి. అలాగే విద్యుత్ పొదుపు మీదా దృష్టి సారించండి. అన్నక్యాంటీన్లల్లో నాణ్యత ఎంత మాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా.. దీన్ని అమలు చేస్తున్నాం. ఎవరైనా విరాళాలివ్వడానికి ముందుకు వస్తే స్వీకరించండి.” అని సీఎం సూచించారు.
ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యను పరిష్కరించండి
“మున్సిపల్ శాఖ పరిధిలోని ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించండి. గత ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ విధానాన్ని అస్తవ్యస్తం చేసేసింది. ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు.. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అర్బన్ హౌసింగ్ విభాగాన్ని గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది. గత ప్రభుత్వంలో అర్బన్ హౌసింగ్ లబ్దిదారులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు.. రకరకాల సమస్యలున్నాయి. త్వరలోనే దీనిపై సమావేశం ఏర్పాటు చేస్తాం. ఎస్టీపీ ప్లాంట్ల ద్వారా నీటి శుద్ధి చేసే అంశంపై మరింతగా ఫోకస్ పెట్టి.. ఆ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. లెగసీ వేస్ట్ అనేది మున్సిపాల్టీలకు.. ప్రజలకు భారంగా మారింది. లెగసీ వేస్ట్ కన్పించకుండా చర్యలు తీసుకోవడంతో పాటు.. భవిష్యత్తులో చెత్తను ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేసేలా చర్యలు తీసుకోవాలి.” అని చంద్రబాబు ఆదేశించారు.
కేంద్రం నుంచి వీలైనన్ని నిధులు తేవాలి
“మున్సిపల్ శాఖ పరిధిలో కేంద్ర ప్రాజెక్టులు ఏమున్నాయో చూసుకుని.. వాటికి మరిన్ని నిధులు ఏ విధంగా తీసుకురావాలనే అంశంపై దృష్టి సారించండి. ఈ మేరకు ఏమైనా బిల్లులు పెండింగ్ ఉన్నా.. యూసీల విషయంలో ఏమైనా సమస్యలు ఉన్నా.. వాటిని ఆర్థిక శాఖతో సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలి. ఆర్థిక శాఖ కూడా ఈ విషయంలో మున్సిపల్ శాఖకు సహకరించాలి. గత ప్రభుత్వం వివిధ పథకాలకు రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రానికి చాలా నిధులు రాలేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి తలెత్తకూడదు. ఇప్పుడు ఏఐఐబీ నుంచి వచ్చిన రూ. 5800 కోట్లు, స్వచ్ఛ భారత్ కింద వచ్చిన రూ. 3000 కోట్ల పనులను వేగంగా జరిపించేలా చర్యలు తీసుకోవాలి. అమృత్, అమృత్-2, ఏఐఐబీ, యూఐడీఎఫ్ ప్రాజెక్టుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలి.” అని చంద్రబాబు సూచించారు. ఈ సమీక్షలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, మున్సిపల్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.