కృష్ణా తీరం.. యోగా తరంగం..
కృష్ణా తీరం.. యోగా తరంగం..
- హరిత బెర్మ్ పార్కులో యోగాంధ్ర కార్యక్రమం
- పెద్దఎత్తున పాల్గొన్న యోగా ఔత్సాహికులు
- ఒక్క మాసమే కాదు.. ప్రతిరోజూ యోగా సాధన చేయాలి
- జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ
భానుని లేలేత కిరణాలు ప్రకృతిని పలకరించే వేళ.. కృష్ణమ్మ చెంత హరిత బెర్మ్ పార్కులో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, యోగాను ఒక్క మాసానికే పరిమితం చేయకుండా ప్రజలు ప్రతిరోజూ కొంత సమయాన్ని యోగాసనాలకు కేటాయించి, ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు.
ఆదివారం హరిత బెర్మ్ పార్కులో జిల్లా అధికార యంత్రాంగం, పర్యాటక శాఖ, ఆయుష్ శాఖ, వీఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన యోగాంధ్ర ప్రత్యేక కార్యక్రమంలో జేసీ ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర పాల్గొని యోగాసనాలను అభ్యసించారు. అనంతరం జేసీ ఇలక్కియ మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో యోగాసనాల సాధనతో కొత్త ఉత్సాహం వచ్చిందని.. తాను రోజూ యోగా సాధన చేస్తానని, ప్రజలందరూ తమకు వీలైనంత సమయాన్ని యోగాకు కేటాయించాలని సూచించారు. యోగాసనాలతో ఒక్క శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యమూ సొంతమవుతుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామం, పట్టణాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. ఇదే విధంగా పర్యాటక ప్రాంతాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, యోగా ఔన్నత్యాన్ని చాటిచెప్పేందుకు జిల్లాలో ఇప్పటికే గాంధీహిల్, పవిత్ర సంగమం పర్యాటక ప్రాంతాల్లోనూ యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాని, ఆదివారం దాదాపు 2 వేల మందితో నదీముఖ పర్యాటక ప్రాంతమైన బెర్మ్ పార్కులో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. బెర్మ్ పార్కును ప్రతిరోజూ చాలామంది పర్యాటకులు సందర్శిస్తారని.. ఇదేవిధంగా ప్రజలు తమకు వీలున్నప్పుడు పార్కును సందర్శించి, ప్రకృతిని ఆస్వాదించాలని జేసీ ఇలక్కియ సూచించారు.
వార్డు సచివాలయం స్థాయిలో యోగా కార్యక్రమాలు: వీఎంసీ ధ్యానచంద్ర
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి వార్డు సచివాలయం పరిధిలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. ప్రతి
సచివాలయానికి తొమ్మిది మంది ట్రైనర్లను ఏర్పాటుచేసి ప్రజలకు యోగాసనాలు నేర్పిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర అన్నారు. ఒక్కో ట్రైనర్ దాదాపు 150 మందికి యోగాను నేర్పిస్తున్నట్లు వెల్లడించారు. సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువచేసే ఉద్దేశంతో థీమ్ యోగాను నిర్వహిస్తున్నామని, నగరంలోని బీఆర్‌టీఎస్ రోడ్డును యోగా స్ట్రీట్‌గా నామకరణం చేసి రోజూ ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు యోగాసనాల కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.
కార్యక్రమంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, శిరీష యోగా అకడమీ విద్యార్థుల ఆర్టిస్టిక్ యోగా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, డీఎంహెచ్‌వో డా.ఎం.సుహాసిని, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డా. కొల్లేటి రమేష్, ఆయుష్ అధికారులు డా. వి.రాణి, డా. రామత్లేహి, డా. రత్నప్రియదర్శిని, యోగా గురు రామాంజనేయులు, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యోగా ఔత్సాహికులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.