రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ప్రాంతాలు వేరైనా తెలుగుజాతి ఒక్కటే

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

ప్రాంతాలు వేరైనా తెలుగుజాతి ఒక్కటే

తెలుగుజాతిని నెంబర్ వన్ చేయడమే ధ్యేయం

దత్తాత్రేయ రాజకీయ జీవితం అందరికీ ఆదర్శనీయం

తెలుగు రాష్ట్రాల్లో అజాతశత్రువు అంటే దత్తన్నే

అలయ్ బలయ్‌తో అన్ని పార్టీల నేతలను ఏకతాటిపైకి తెచ్చారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

దత్తాత్రేయ రచించిన “ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తకావిష్కరణకు అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు

హైదరాబాద్, జూన్ 8 ‘ప్రాంతాలు వేరైనా తెలుగుజాతి ఒక్కటే. తెలుగుజాతిని ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలపడమే ధ్యేయం. దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడైన పీవీ నరసింహారావు ఈ గడ్డపై పుట్టిన బిడ్డే. ఈ శిల్పకళా వేదిక పేరు వినగానే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. తెలుగుజాతిని ఏవిధంగా అగ్రస్థానంలో పెట్టాలని ఆలోచన చేసినప్పుడు హైటెక్ సిటీతో హైదరాబాద్ అభివృద్ధికి నాందిపలికాం. అప్పటి ప్రధాని వాజ్‌పేయ్‌తో హైటెక్ సిటీని ప్రారంభించి ఐటీ, టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఆ సమయంలో మన వారసత్వాన్ని మరిచిపోకూడదని చెన్నారెడ్డిని కలిసి ఈ స్థలం ఇవ్వాలని కోరగా వెంటనే ఇచ్చారు. దీంతో వెంటనే శిల్పకళా వేదిక, శిల్పారామం రెండూ అభివృద్ధి చేశాం. ఓ వైపు హైటెక్ సిటీ మరోవైపు ఐటీ కంపెనీలు... మధ్యలో శిల్పకళా వేదిక, శిల్పారామం ఏర్పాటు చేశాం. బిల్ క్లింటన్ వచ్చిన సమయంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు కొత్తగా సైబరాబాద్ నిర్మాణానికి రూపకల్పన చేశాం. రాజకీయాల్లో మనం చేసిన మంచి పనులతో ప్రజలకు ఫలితాలు వచ్చినప్పుడు దానికి మించిన ఆనందం ఉండదు. భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రధాని మోదీ తీసుకున్నారు. తెలుగుజాతిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన “ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు అతిథిగా హాజరయ్యారు. భవిష్యత్ తరాలకు స్పూర్తినిచ్చేలా పుస్తకం ఉందని సీఎం కొనియాడారు. 

అజాత శత్రువు దత్తన్న

‘జెంటిల్ మేన్‌ ప్రతిరూపం దత్తాత్రేయ, ఆయనకు విరోధులు అంటూ ఉండరు. తెలుగురాష్ట్రాల్లో అజాతశత్రువు అంటే దత్తన్నే. సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నేతగా దత్తాత్రేయ ఎదిగిన తీరు ఆదర్శనీయం. ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రావడం నాకు సంతోషంగా ఉంది. మీ అందర్నీ చూడగానే నాకు ఎక్కడలేని సంతోషం వచ్చింది. 40 ఏళ్ల నాటి పాతరోజులు నాకు గుర్తొచ్చాయి. ఎమర్జెన్సీ రోజుల నుంచి దివిసీమ ఉప్పెన వరకూ దత్తాత్రేయ సేవలు అందించారు. సాధారణ స్వయం సేవక్ నుంచి ఉన్నతస్థాయికి ఎదిగారు. ఆయన జీవితంలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, సంఘర్షణలున్నాయి. దత్తాత్రేయ పేరుకే హిందుత్వం, ఆయన మతం భారతీయం, కోరుకున్నది జనహితం, అనుసరించేది లౌకికవాదం, పాటించేది మత సామరస్యం.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.  

అలయ్ బలయ్‌తో ఐకమత్యం

దత్తాత్రేయ ప్రతి ఏడాది అలయ్ బలయ్ కార్యక్రమంతో అన్ని రాజకీయ పార్టీల నేతలను ఒక్క తాటిపైకి తీసుకొస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ఐక్యమత్యానికి వేదికగా చేశారు. దత్తాత్రేయకు విరోధులు ఉండరు. తెలుగురాష్ట్రాల్లో అజాతశత్రువు , ఆదర్శ రాజకీయ జీవితం అంటే బండారు దత్తాత్రేయ గుర్తొస్తారు. “ఒక్క రాత్రిలో ప్రకృతి విలయతాండవం చేసి లక్షలాదిమందిని తుడిచిపెట్టేసిన దృశ్యాలు చూస్తానని కానీ, అక్కడ శవాలను ఏరుతూ, బతికున్న వారి దాహార్తి తీరుస్తూ కొన్ని వారాలపాటు సేవ చేయాల్సి వస్తుందని అంతకుముందెప్పుడూ ఊహించలేదు’ అని ఆయన ఆత్మకథలో రాశారు. ఆ మాటలు ఆయన జీవితంలో చేసిన సేవలను తెలియజేస్తాయి.

లేఖలు రాయడంలో బ్రాండ్ అంబాసిడర్

దత్తాత్రేయ బీజేపీ కార్యకర్తగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా, హిమాచల్ ప్రదేశ్, హర్యానా గవర్నర్‌గా సేవలందించారు. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేసే నిబద్ధత ఆయన సొంతం. అన్ని పార్టీల నేతలను కలుపుకునే హుందాతనం ఆయనది. అందుకే ఉన్నతస్థానంలో ఉన్నా ఎప్పుడూ సాధారణ కార్యకర్తగానే పనిచేస్తారు. ఎమర్జెన్సీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జైలు జీవితం కూడా అనుభవించారు. ప్రధాని మోదీ పుస్తక సందేశంలో.... ఎమర్జెన్సీ రోజుల్లో దత్తాత్రేయ పోరాటాన్ని ప్రశంసించారు. బండారు జీవితంలో 65 ఏళ్లు ప్రజాసేవలోనే ఉన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రులకు లేఖలు రాసేవారు. లేఖలు రాయడంలో ఆయన బ్రాండ్ అంబాసిడర్. నేను సీఎంగా ఉన్నప్పుడు దత్తాత్రేయ ఎన్ని లేఖలు రాశారో నాకే గుర్తులేదు.’ అని చంద్రబాబు అన్నారు.  

పదవులకే వన్నె తెచ్చిన దత్తాత్రేయ

1991లో దత్తాత్రేయ మొదటిసారి ఎంపీ అయ్యారు. 1996లో ఏపీ బీజేపీ అధ్యక్షుడయ్యారు. 1999, 2002, 2003, 2014లో అధ్యక్షుడిగా సేవలు అందించారు. బండారు దత్తాత్రేయ 2004లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా, 2013లో జాతీయ ఉపాధ్యక్షుడిగా అలాగే రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, ఓబీసీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశారు. 2021 నుంచి హర్యానా గవర్నర్ గా పనిచేస్తున్నారు. ఆయన జీవితం, దృక్పధం భవిష్యత్ తరాలకు స్పూర్తినిచ్చేలా పుస్తకం ఉంది. ఏదైనా మాట్లాడాలంటే వ్యక్తిత్వం ఉండాలి. ధైర్యంగా సందేశం ఇవ్వాలంటే ఒక చరిత్ర ఉండాలి. ఈ రెండూ దత్తాత్రేయకు ఉన్నాయి. ఉత్తర, దక్షణ భారతదేశంలో పనిచేసి ప్రజలతో మమేకం అయ్యారు. 

Comments

-Advertisement-