రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఒక్క గంజాయి మొక్క మొలవొద్దు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

 ఒక్క గంజాయి మొక్క మొలవొద్దు

ఒకనాటి ఉద్యమాల గడ్డ తెలంగాణ మాదక ద్రవ్యాల మహమ్మారికి అడ్డాగా మారకూడదన్న లక్ష్యంతో ఇకనుంచి రాష్ట్రంలో ఒక మొక్క గంజాయి మెలిచినా ఇట్టే కనిపెట్టే “Elite Action Group For Drug Law Enforcement” (Eagle) ను ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచంతో పోటీ పడే ఒక ఆరోగ్యకరమైన, మాదక ద్రవ్య రహిత తెలంగాణను నిర్మించుకోవడంలో ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం” పురస్కరించుకుని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో (TG ANB), తెలంగాణ వికలాంగులు, సీనియర్ సిటిజన్లు మరియు లింగమార్పిడి వ్యక్తుల సాధికారత శాఖ సంయుక్తంగా శిల్పకళా వేదిక ప్రాంగణంలో డ్రగ్స్ నియంత్రణపై కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..

"తెలంగాణలో ఒకనాడు ఉద్యమాలకు వేదికలైన కాలేజీలు, యూనివర్సిటీలు గంజాయి, మాదక ద్రవ్యాలకు వేదిక అయితే అది అందరికీ అవమానం. యువకులు డ్రగ్స్ బారిన పడి బలవుతున్నారు. డ్రగ్స్ నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. పాఠశాల, కాలేజీల్లో ఎక్కడైనా సరే దీనికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే తెలియజేయండి.

తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో విద్యార్థులను స్కూళ్లు, కాలేజీల్లో చేర్పిస్తుంటే, కేవలం చదువు చెబితే చాలన్నట్టు యాజమాన్యాలు, అధ్యాపకులు భావించడం సరికాదు. వాటిని నియంత్రించడంలో యాజమాన్యాలకు కూడా బాధ్యత ఉంటుంది. 

కాలేజీల్లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికితే ఇక నుంచి వాటి యాజమాన్యాలపైన కూడా కేసులు నమోదు చేయండి. యాజమాన్యాలు, అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థుల నడవడికను కూడా గమనించాల్సి ఉంటుంది. డ్రగ్స్ నియంత్రణపై పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలతో నార్కోటిక్స్ బ్యూరో ఒక సమావేశం నిర్వహించాలి.

140 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో 68 శాతం యువత ఉంది. ఐటీతో సహా అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళుతుంటే దెబ్బతీయడానికి, దేశాన్ని నిర్వీర్యం చేయడానికి ఇలాంటి డ్రగ్స్ మహమ్మారితో యువతను బలిగొనే కుట్రలు జరుగుతున్నాయి. దేశ రక్షణలో ముందు వరుసలో నిలుచున్న పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ భారిన పడి యువత నిర్వీర్యమైపోతోంది.

డ్రగ్స్‌తో ఎవరైనా తెలంగాణ కాలు పెట్టాలంటే వందసార్లు ఆలోచించాలి. ఒక గడ్డి పరకైనా రాష్ట్రంలో అడుగుపెట్టినా వెన్ను విరుస్తాం. ఐటీ హబ్‌గా, ఫార్మా హబ్‌గా ఉన్న తెలంగాణ గంజాయికో, డ్రగ్స్‌ హబ్‌గా మారితే మనమంతా విఫలమైనట్టే. యువతను సరైన దిశగా నడిపించాల్సిన అవసరం ఉంది.

యువతను సరైన దిశలో నడిపించాలన్న ఉద్దేశంతోనే క్రీడా పాలసీని తెచ్చాం. నైపుణ్యాలను మెరుగుపరచడానికి స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. రేపటి రోజున ఎవరైనా క్రీడల్లో శిక్షణ తీసుకోవాలంటే తెలంగాణ వెళ్లాలన్న పరిస్థితి రావాలి. తెలంగాణను ఒక స్పోర్ట్స్ హబ్‌గా మార్చడానికి దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోని యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకున్నాం.

ప్రపంచంతో పోటీ పడే శక్తి, యుక్తి దేశంలో ఉంది. తెలంగాణలోని 1కోటి 50 లక్షల ఎకరాల్లో ఒక్క గంజాయి మొక్క మొలవొద్దు. ఒక్క గంజాయి మొక్క మొలిచినా ఈ #Eagle (గద్ద) ఇట్టే పట్టేస్తుంది. ఈ గద్ద ఈరోజు నుంచే పనిచేస్తుంది” అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వరరెడ్డి, సినీనటులు రాంచరణ్, విజయ్ దేవరకొండ, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, హోం సెక్రెటరీ రవి గుప్తా, డీజీపీ జితేందర్, టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా తో పాటు అధికారులు, యువతీ యువకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తో సహా కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ మాదక ద్రవ్యాల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములం అవుతామని ప్రతిజ్ఞ చేశారు.

Comments

-Advertisement-