మర్యాద కలిగిన నాయకుడిగా అందరూ ఆయనను గౌరవిస్తారు
మర్యాద కలిగిన నాయకుడిగా అందరూ ఆయనను గౌరవిస్తారు
కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించే వారు ప్రముఖ నాయకుడు బండారు దత్తాత్రేయ జీవనశైలిని చూసి ఎంతో నేర్చుకోవలసి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చిందని గుర్తుచేశారు.
హైదరాబాద్ శిల్పకళా వేదికలో అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ “ప్రజలకథే నా ఆత్మకథ” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.
“హైదరాబాద్ గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్ వరకు సుదీర్ఘమైన ప్రయాణంలో దత్తాత్రేయ గారు ఎన్నో ఒడిదుడుకులను అనుభవించారు. వారు ప్రజలతో సంబంధాలను ఏనాడూ కోల్పోలేదు.
నాకు వారితో 40 సంవత్సరాల అనుబంధం ఉంది. దత్తాత్రేయ గారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దత్తాత్రేయ గారిని గౌరవించని నాయకులు తెలంగాణలో ఎవరూ లేరు. దత్తాత్రేయ గారి స్ఫూర్తి మా ప్రభుత్వ నిర్ణయాల్లో ఉంటుంది.
రాజకీయంగా భిన్న మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పటికీ వ్యక్తిగత సంబంధాల విషయంలో దాచిపెట్టాలన్న ప్రయత్నం చేయడం లేదు. దత్తాత్రేయ గారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. ప్రజలతో సంబంధాలు కలిగి ఉండటంలో దత్తాత్రేయగారు అజాతశత్రువు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి జాతీయ రాజకీయాల్లో పదవుల్లో ఉన్నా లేకున్నా వారి గౌరవం ఎప్పుడూ తగ్గలేదు. అలాగే దత్తాత్రేయ గారిని కూడా అదే తీరుగా గౌరవిస్తారు.
బీజేపీ నాయకుడిగా కన్నా దత్తాత్రేయ గారిని ఒక మర్యాద కలిగిన నాయకుడిగా అందరూ ఆయనను గౌరవిస్తారు. జంట నగరాల ప్రజలకు ఏ బాధ ఉన్న వినడానికి ఇద్దరు నాయకుల పేర్లు వినిపిస్తాయి. ఖైరతాబాద్ పి. జనార్ధన్ రెడ్డి , బండారు దత్తాత్రేయ . జంట నగరాల నాయకులు ఈ నేతలను గమనించాలి.
దత్తాత్రేయ గారితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. రాజకీయాలకు అతీతంగా కిషన్ రెడ్డి గారిని అప్పుడప్పుడు ప్రశ్నిస్తూనే వారితో ఉన్న సాన్నిహిత్యంతో తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాం” అని ముఖ్యమంత్రి గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ , ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు , త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డి గారు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మరెందరో ప్రముఖులు పాల్గొన్నారు.