వేరుశెనగ విత్తన పంపిణీ ప్రారంభం
By
Mounikadesk
వేరుశెనగ విత్తన పంపిణీ ప్రారంభం
- వేరుశెనగ విత్తనాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి
- ప్రాసెసింగ్ కేంద్రాల్లో వేరుశెనగ విత్తన శుద్ధిని ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలి
- పంటల సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలను వ్యవసాయ అధికారులు అందజేయాలి
- జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
- విత్తనాలను నాణ్యత చూసి తీసుకోవాలి
- జిల్లాకు ఎక్కువ వేరుశెనగ విత్తనం వచ్చేలా చర్యలు తీసుకోవాలి
- రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
- ఆత్మకూరు మండలంలోని పంపనూరులో రైతులకు వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం, జూన్ 05 :
- ప్రభుత్వ సబ్సిడీతో అందజేస్తున్న వేరుశెనగ విత్తనాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఆత్మకూరు మండలంలోని పంపనూరు గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రం వద్ద గురువారం నిర్వహించిన వేరుశెనగ విత్తన పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, తదితరులు పాల్గొన్నారు.
- ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వేరుశెనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని పంపనూరులో ఏర్పాటు చేసుకోవడం హర్షదాయకమన్నారు. జిల్లాకు ఈ సీజన్ కు సంబంధించి 50,592 క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాన్ని కేటాయించడం జరిగిందన్నారు. గతేడాది 40 శాతం ఎక్కువగా వర్షం జిల్లాలో వచ్చిందని, సకాలంలో రాకపోయినా కురిసిన వర్షం వల్ల భూగర్భజలం పెరిగిందని, ఈ ఏడాది కూడా 40 శాతం ఎక్కువ వర్షం వస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారని, సకాలంలో వర్షం రావాలని కోరుకుంటున్నామన్నారు. వ్యవసాయ శాఖ గురించి చాలా విలువైన సలహాలను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఇస్తూ ఉంటారని, ఎమ్మెల్యే స్వతహాగా రైతు అని, పంటలు సాగు చేస్తూ ఉంటారని, వ్యవసాయంకు సంబంధించి వారు చాలా విలువైన సలహాలు, సూచనలు, మార్గదర్శనం ఇస్తూ ఉంటారని, వాటిని జిల్లా మొత్తం అమలు చేస్తామని, ఇందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. వేరుశెనగ లోడ్ గ్రామ స్థాయికి వచ్చినప్పుడు వ్యవసాయ అధికారులు తనిఖీ చేయాలన్నారు. జిల్లాలో 14 ప్రాసెసింగ్ కేంద్రాలు ఉండగా, వాటికి ప్రత్యేక అధికారులను నియమించాలని, విత్తన ప్రాసెసింగ్ ను ర్యాండంగా ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలన్నారు. గ్రామస్థాయిలో కూడా విత్తనాలను తనిఖీ చేయాలని, క్షేత్రస్థాయిలో విత్తన పంపిణీని అధికారులు పరిశీలించాలన్నారు. జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలలో కూడా పరిశీలన చేయడం జరుగుతుందని, వ్యవసాయ అధికారులు పంటల సాగు చేసుకోవడంలో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేయాలన్నారు. వేరుశనగ విత్తనం 30 కేజీల బ్యాగును 0-0.5 ఎకరాల వరకు ఒకటి, 0.5-1 ఎకరం వరకు రెండు, 1.01 నుంచి ఆపైన ఉన్న ఎకరాలకు సంబంధించి మూడు బ్యాగులను ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం జిల్లాలో రాబోయే ఖరీఫ్-2025 సీజన్‌లో 40 శాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతోందని, విస్తీర్ణం ఆధారంగా గరిష్టంగా మూడు సంచులను పంపిణీ చేయాలని ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. 30 కేజీల ఒక బ్యాగ్ పూర్తి ధర 2,790 రూపాయలు కాగా, అందులో 1,116 రూపాయల సబ్సిడీ పోను రైతు 1,674 రూపాయల చెల్లించాల్సి ఉంటుందన్నారు. 30 కేజీల 2 బ్యాగ్ ల పూర్తి ధర 5,580 రూపాయలు కాగా, అందులో 2,232 రూపాయల సబ్సిడీ పోను రైతు 3,348 రూపాయల చెల్లించాల్సి ఉంటుందని, అలాగే 30 కేజీల 3 బ్యాగ్ ల పూర్తి ధర 8,370 రూపాయలు కాగా, అందులో 3,348 రూపాయల సబ్సిడీ పోను రైతు 5,022 రూపాయల చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సబ్సిడీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
- ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ఖరీఫ్ లో వర్షం వస్తే పంటలు వేయాలని రైతన్నలు వేయికన్నులతో ఎదురుచూస్తున్నారని, వేరుశనగ విత్తనాలను రైతులు బాగున్నాయా లేదా అని నాణ్యత చూసి తీసుకోవాలన్నారు. నాణ్యత బాగుంటే తీసుకోవాలని లేకపోతే వెనక్కి ఇవ్వాలన్నారు. జిల్లాకు 50,592 క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాన్ని కేటాయించడం జరగగా, విత్తన కేటాయింపు తక్కువగా వచ్చిందని, ఇంకా విత్తనం కూడా అవసరం అవుతుందని, రైతులు కూడా విత్తనాలు అడుగుతున్నారని, ఎక్కువ కూడా విత్తనం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతేడాది కూడా జిల్లాకు విత్తనం తక్కువగా వచ్చిందని, ఇంకా ఎక్కువ విత్తనం కావాలని సంబంధిత మంత్రి గారిని కూడా అడగడం జరిగిందని, జిల్లా కలెక్టర్ కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లి అవసరమైన ఎక్కువ విత్తనం వచ్చేలా చూడాలని కోరారు. లోటు లేకుండా రైతులకు అవసరమైన విత్తనాన్ని పంపిణీ చేయాలన్నారు. విత్తనాలు పక్కదారి పట్టకుండా చూడాలని, ఎవరికైతే ఉపయోగపడుతుంతో ఆ రైతులు మాత్రమే వేరుశెనగను తీసుకోవాలన్నారు. అవసరం లేకుండా విత్తనం తీసుకొని పక్కన అమ్ముకునేలా చేసుకోరాదని సూచించారు. అనంతరం రైతులకు వేరుశనగ విత్తనాలను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
- ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కేశవనాయుడు, ఎస్డీసి రామ్మోహన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, ఏడీఏ రవి, ప్రత్యేక అధికారి శ్రీనివాసులు, ఎంపిడిఓ విజయలక్ష్మి, ఆయా శాఖల అధికారులు, ఏవోలు సోమశేఖర్, శ్రీవాణి, రాకేష్, శశికళ పాల్గొన్నారు.
Comments