భవిష్యత్తు అంతా పర్యాటకానిదే
భవిష్యత్తు అంతా పర్యాటకానిదే
•2047 నాటికి ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా ఏపీ
•ఏపీలో ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి..స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తామని ఇన్వెస్టర్లకు భరోసా
•ఏపీ చారిత్రక వైభవం, వైవిధ్యమైన సహజసిద్ధ సౌందర్యాలను ప్రపంచానికి తెలపాలన్నదే తమ ఉద్దేశం
•విజయవాడలో ఏపీ పర్యాటకాభివృద్ధి కోసం గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ టూరిజం, ఏపీటీడీసీ సంయుక్తంగా నిర్వహించిన టూరిజం కాన్ క్లేవ్ టెక్ ఏఐ 2.0లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
•టూరిజం కాన్ క్లేవ్ లో రాష్ట్ర పర్యాటక విధానాలు, నిర్దేశిత లక్ష్యాల వివరణ
విజయవాడ: ఏపీలో టూరిజం ప్రాజెక్టుల వేగవంతం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యాటకులకు ప్రపంచస్థాయి అనుభవాల కల్పన, స్థానిక భాగస్వామ్యాలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఇన్వెస్టర్ల సహకారం అవసరమని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శుక్రవారం విజయవాడ ఎంజీ రోడ్డులోని మురళీ ఫార్చూన్ హోటల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి కోసం గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ టూరిజం, ఏపీటీడీసీ సంయుక్తంగా రెండోరోజు నిర్వహించిన టూరిజం కాన్ క్లేవ్ టెక్ ఏఐ 2.0 లో సీఎం చంద్రబాబునాయుడు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. తొలి రోజు పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడే అంశాలపై చర్చ జరగగా, రెండో రోజు రాష్ట్ర పర్యాటక విధానాలు, నిర్దేశిత లక్ష్యాలపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఏపీ పర్యాటకం పెట్టుబడులకు అనుకూలమని, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఆలోచనలు పంచుకొని పెట్టుబడులతో వస్తే భరోసా కల్పించే బాధ్యత తమది అని ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. తొలిరోజు పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడే అంశాలపై జరిగిన చర్చలో ఇన్వెస్టర్ల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. 2047 నాటికి రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ పర్యాటకుల గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
ఏపీలో పర్యాటకరంగానికి సీఎం చంద్రబాబునాయుడు పారిశ్రామిక హోదా కల్పించడంతో అభివృద్ధికి ఊతం వచ్చిందని, అనంతరం పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయన్నారు. ఈ క్రమంలో పర్యాటకులకు మరింత చేరువయ్యేందుకు, ప్రాంతాల సందర్శన ద్వారా ప్రజలతో కనెక్ట్ అవ్వడం, అనుభూతి చెందడం, జీవితకాల జ్ఞాపకాలను కల్పించాలన్నది తమ ఉద్దేశమని చెప్పారు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయమని సూచించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో పర్యాటక రంగం ఏ విధమైన అభివృద్ధి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో టూరిజం రంగం నిరాదరణకు గురైందన్నారు. టూరిజంలో ఆకాశమే హద్దు..అవకాశాలను వదలవద్దు అన్న సీఎం మాటలు ఇన్వెస్టర్లకు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
పర్యాటక రంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి దుర్గేష్ వివరించారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పనతో పాటు ఇప్పటికే 2024-29కి నూతన పర్యాటక పాలసీ ప్రకటించామని తెలిపారు. సుస్థిర, సమగ్ర పర్యటకాభివృద్దికి బాటలు వేస్తున్నామని పేర్కొన్నారు. బాధ్యతాయుత పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఏపీలో ఆర్థిక అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పనే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. పర్యాటకాభివృద్ధి ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే కాలంలో ఏపీ పర్యాటకాభివృద్ధి చెందుతుందని మంత్రి దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీని అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇప్పటికే స్వదేశీ దర్శన్ 2.0, ప్రసాద్, శాస్కి, సీబీడీడీ స్కీమ్ ల ద్వారా వందలాది కోట్ల నిధులు కేంద్రం మంజూరు చేసిందని తద్వారా పర్యాటక అభివృద్ధి పట్టాలెక్కుతుందన్నారు. పీపీపీ విధానం ద్వారా పర్యటకాభివృద్ధి చేస్తున్నామన్నారు. జూన్ 26న రూ.94.44 కోట్లతో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. ఏపీలోని 974కి.మీల సుదీర్ఘ సముద్రతీరం, సహజ సౌందర్యాలను,చారిత్రాత్మక కట్టడాలను ప్రపంచానికి చూపించాలన్నదే తమ లక్ష్యమని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఏపీలో వెల్ నెస్ సెంటర్లను వృద్ధి చేస్తే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తామని యూరోపియన్లు తన జర్మనీ పర్యటనలో వెల్లడించారని మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. ఏపీ నాయకత్వంపై కేంద్రానికి స్పష్టమైన నమ్మకం ఉందని, త్వరలో పర్యాటకం మరింత పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల చొరవతో ఎకో టూరిజం పాలసీ తెస్తున్నామని తద్వారా జీవ వైవిద్య పరిరక్షణ, ప్రకృతి సంరక్షణ చేపడతామన్నారు. అడ్వెంచర్, ఎకో టూరిజంలో పెట్టుబడుల ఆకర్షణ, పర్యాటకులకు మెరుగైన అనుభవాల కల్పిస్తామన్నారు.
బ్రాండింగ్, మార్కెటింగ్, ఉత్పత్తి, ప్రాజెక్టులు, పెట్టబడులు, భాగస్వామ్యం, టెక్ ఎనేబుల్ మెంట్, క్రియేటివ్ ఎకానమీ,కెపాసిటీ బిల్డింగ్ తదితర 6 అంశాలపై ఏపీ పర్యాటక రంగం ముందుకు తీసుకువెళ్తున్నామని మంత్రి దుర్గేష్ వివరించారు. పర్యాటక ప్రాజెక్టులకు సింగిల్ విండో ద్వారా అనుమతులు జారీ చేస్తున్నామన్నారు. దేశంలో టెక్నాలజీకి ఆద్యులు సీఎం చంద్రబాబు అని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీనే చెప్పారని గుర్తుచేశారు. డీప్ టెక్, క్వాంటం కంప్యూటింగ్, ఏఐ తదితర టెక్నాలజీలపై తొలిసారి మాట్లాడిన వ్యక్తి సీఎం చంద్రబాబునాయుడు అని మంత్రి అన్నారు. ఏపీలో సృజనాత్మకతకు పెద్ద పీట వేసి తద్వారా ఆదాయాభివృద్ధి, అవకాశాలు కల్పిస్తామన్నారు. ఏపీని స్వర్ణాంధ్ర- 2047 దిశగా తీసుకెళ్తామన్నారు. దీర్ఘకాలిక పర్యాటకానికి రాచబటలు వేస్తున్నామని, పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని చెబుతూ గత ప్రభుత్వ విషాదఛాయలు మర్చిపోవాలని ఇన్వెస్టర్లకు సూచించారు. ఏపీలో ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి..స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తామని ఇన్వెస్టర్లకు భరోసానిచ్చారు.
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక అభివృద్ధితో పాటు ప్రపంచస్థాయి ఆకర్షణగా రాష్ట్ర పర్యాటకాన్ని శక్తివంతమైన సాధనంగా చేయాలన్నదే తమ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం, చారిత్రక వైభవం, వైవిధ్యమైన సహజసిద్ధ సౌందర్యాలను ప్రపంచానికి తెలపాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఈ క్రమంలో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.