యువత నూతన ఆవిష్కరణల వైపు మళ్లితేనే దేశాభివృద్ధి సాధ్యం
యువత నూతన ఆవిష్కరణల వైపు మళ్లితేనే దేశాభివృద్ధి సాధ్యం
• శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు సైన్స్ పార్క్ నాంది
• విద్యార్ధుల్లో నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెంచుతాం
• సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు ప్రోత్సహిస్తాం
• రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్
• రాజమండ్రిలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గారితో కలసి సైన్స్ పార్క్ ప్రారంభోత్సవం
శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం, విద్యార్ధుల్లో ఆసక్తి పెంపొందించడంతోపాటు సరికొత్త ఆవిష్కరణలను ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ముందుకు వెళ్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ, సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విద్యార్ధులు కాలానుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగంలో పురోగతి సాధించాలని పిలుపునిచ్చారు. యువత నూతన ఆవిష్కరణల వైపు మళ్లడం దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అంశమని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా మన దేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మలిచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. గురువారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలోని బొమ్మూరులోని రీజనల్ సైన్స్ సెంటర్ ప్రాంగణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించిన సైన్స్ పార్క్ ను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారితో కలసి ప్రారంభించారు. ఐదు ఎకరాల ప్రాంగణంలో రూ. 15.20 కోట్ల వ్యయంతో ఈ సైన్స్ పార్క్ ని నిర్మించారు.
అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ "కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించిన సైన్స్ పార్క్ ను కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గారితో కలసి ప్రారంభించాం. బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ మరియు టెక్నాలజీ మ్యూజియం సహకారంతో ఈ సైన్స్ పార్క్ నిర్మించాం. శాస్త్ర విజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ సంస్థ పని చేస్తుంది. విద్యార్ధుల్లో విద్యతోపాటు విజ్ఞానం, కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే క్రమంలో సైన్స్ పార్క్ సరికొత్త మైలు రాయిగా నిలవనుంది. ఈ సైన్స్ పార్క్ ద్వారా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంతోపాటు, యువత, విద్యార్ధుల్లో విజ్ఞానాన్ని పెంపొందించే ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్తాం" అన్నారు.
సైన్స్ పార్క్ యువతను నూతన ఆవిష్కరణల వైపు మళ్లిస్తుంది : గజేంద్రసింగ్ షెకావత్ , కేంద్ర మంత్రి
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ "ఇది శాస్త్రీయ యుగం. విద్యార్ధులు, యువత శాస్త్రీయ దృక్పదథాన్ని పెంపొందించుకోవడంతోపాటు నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలి. యువతలో శాస్త్ర సాంకేతికత పట్ల ఉత్సుకత పెంచేందుకు రాజమండ్రిలో ఏర్పాటు చేసిన సైన్స్ మ్యూజియం ఉపయోగపడుతుంది. విద్యార్ధుల్లో వినూత్న ఆలోచనలు పెంపొందించేందుకు సహకరిస్తుంది" అన్నారు.
• ఆకట్టుకున్న ఫన్ సైన్స్ గ్యాలరీ విద్యార్ధుల నూతన ఆవిష్కరణలు
విద్యార్ధులు, యువతకు సరికొత్త ఆవిష్కరణల వైపు ఆసక్తి పెంచేలా ఈ సైన్స్ పార్క్ కు రూపకల్పన చేశారు. ప్రారంభోత్సవం అనంతరం రెండు అంతస్తుల్లో నిర్మితమైన సైన్స్ పార్కును రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ , కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. వాటర్ వరీస్ గ్యాలరీ పవన్ కళ్యాణ్ ని విపరీతంగా ఆకట్టుకుంది. నీటి వనరుల సమీకరణలో సమస్యలు, సంరక్షణ, పునర్వినియోగం తదితర అంశాలపై ఏర్పాటు చేసిన సైన్స్ గ్యాలరీలు ఆకట్టుకున్నాయి. అనంతరం సైన్స్ బేసిక్స్ పై విద్యార్ధులకు అవగాహన పెంచడంతోపాటు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీని తిలకించారు. ఖగోళ విజ్ఞానాన్ని వివరిస్తూ రూపొందించిన ప్లానిటోరియం, స్వతంత్ర్య భారత దేశంలో మన ఆవిష్కరణలతో కూడిన ప్రదర్శన, వర్క్ షాపులు, డెమోల కోసం ఏర్పాటు చేసిన యాక్టివిటీ హాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇన్నోవేషన్ హబ్ లో కోరుకొండకు చెందిన విద్యార్ధులు రూపొందించిన నూతన ఆవిష్కరణలు పవన్ కళ్యాణ్ తో పాటు కేంద్ర మంత్రివర్యులను ఆకట్టుకున్నాయి. సోలార్ టెక్నాలజీతో నడిచే పురుగు మందుల స్ప్రే, నైట్ డ్రైవింగ్ సేఫ్టీ సిస్టం, స్మార్ట్ హెల్మెట్, స్మార్ట్ వెహికెల్ పార్కింగ్ తదితర నమూనాలను ఆసక్తిగా తిలకించారు. విద్యార్ధులను అడిగి ఆవిష్కరణల వివరాలు తెలసుకున్నారు.
• పవన్ కళ్యాణ్ ని కలసిన యువ వ్యోమగామి జాహ్నవి దంగేటి
ఇటీవల నాసా అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగాంను విజయవంతంగా పూర్తి చేసిన యువ వ్యోమగామి, తెలుగమ్మాయి జాహ్నవి దంగేటి సైన్స్ పార్క్ వద్ద ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. జాహ్నవి అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధనా సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ లో చేపట్టనున్న టైటాన్ స్పేస్ మిషన్ లో వ్యోమగామిగా ఎంపికయ్యారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే జి. బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెంబర్ సెక్రటరీ, సీఈవో, ప్రొ. కె.శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.