సాస్కి కింద రాష్ట్రానికి రూ.10,000 కోట్లు ఇవ్వండి
సాస్కి కింద రాష్ట్రానికి రూ.10,000 కోట్లు ఇవ్వండి
రెవెన్యూ లోటు భర్తీ చేయండి
కేంద్ర ఆర్ధిక మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి
ఢిల్లీ, జూలై 16 : రాష్ట్రాల మూలధన పెట్టుబడులకు అందించే ఆర్ధిక సాయం పథకం సాస్కి(SASCI) కింద 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా రూ. 10,000 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. బుధవారం రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సహాయం కోరుతూ వినతిపత్రం అందించారు. 16వ ఆర్థిక సంఘానికి రెవెన్యూ లోటును భర్తీ చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వినతిని అంగీకరించాలని
ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. విభజన కారణంగా రాష్ట్రం ఇప్పటికీ ఆర్ధిక వనరుల లోటును ఎదుర్కొంటోందని ముఖ్యమంత్రి వివరించారు.
గ్రాంటుగా అమరావతికి రెండో విడత సాయం
అమరావతి నిర్మాణానికి మొత్తం రూ.79,280 కోట్ల నిధులు అవసరం కాగా, ప్రస్తుతం రూ.44,351 కోట్ల విలువైన పనులు ప్రారంభించామని నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి తెలిపారు. వీటికి సంబంధించి ఇప్పటికే రూ.26,000 కోట్ల నిధులు సమీకరించనట్టు వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి ఇంకా నిధుల అవసరం ఉందని కేంద్ర ఆర్ధిక మంత్రికి వివరించారు. అమరావతికి రెండో విడతగా ఇచ్చే నిధులను గ్రాంటు రూపంలో ఇవ్వాలని కోరారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తున్న కేంద్రానికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.