రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

కృష్ణ,గోదావరి నదీ జలాల పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు సఫలం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

 కృష్ణ,గోదావరి నదీ జలాల పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు సఫలం

  • కెఆర్ఎంబి అమరావతిలో,
  • జిఆర్ఎంబి హైదరాబాదులో
  • రిజర్వాయర్ల అవుట్ ఫ్లోల కు టెలీ మీటర్లు
  • పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ సాంకేతిక అంశాలు, సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక కమిటీ
  • ఢిల్లీ లో కేంద్ర మంత్రి తో సమావేశం వివరాలు వెల్లడించిన మంత్రి నిమ్మల రామానాయుడు


కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి కేంద్ర జల శక్తి మంత్రి సి ఆర్ పాటిల్ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఫలప్రదమైనట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.

కేంద్ర జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖామంత్రులు, సి డబ్ల్యూ సి అధికారులు, ఇంజనీర్లు, అలాగే ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు పాల్గొన్న ఈ సమావేశం స్నేహపూరిత, సుహృద్భావ వాతావరణంలో జరిగిందని మంత్రి రామానాయుడు చెప్పారు. 

ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ సమావేశంలో మూడు ముఖ్యాంశాలపై నిర్ణయాలు తీసుకున్నారన్నారు. అందులో మొదటిది

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రిజర్వాయర్ల నుంచి కాలువలకు వెళ్లే అవుట్ ఫ్లో కు సంబంధించి టెలిమీటర్లు ఏర్పాటు చేయాలనే నిర్ణయంపై ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. రెండవది తెలుగు జాతి సంపద అయిన శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలు కలసి కాపాడుకోవాలి. ఈ ప్రాజెక్టు మరమ్మతుల విషయంలోనూ, ప్లంజ్ పూల్ రక్షణ విషయంలోనూ సిడబ్ల్యూసి సిఫార్సులు, నిపుణుల సూచనలు సత్వరమే పాటించి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసి అంగీకారం తెలిపాయి. 

మూడో అంశమైన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ( కె ఆర్ ఎం బి ) అమరావతి లోను, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్( జి ఆర్ ఎం బి ) హైదరాబాదులోను ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి రామానాయుడు వివరించారు.

అలాగే మరో ముఖ్యాంశమైన పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక పైన , తెలంగాణ ప్రభుత్వం చెప్పిన అభ్యంతరాల పైన సానుకూల స్పందన వ్యక్తం అయినట్లు మంత్రి రామానాయుడు తెలిపారు. 

ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనేక సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నందున..ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒక కమిటీ వేయాలని ఉభయ రాష్ట్రాలు నిర్ణయించినట్లు నిమ్మల స్పష్టం చేశారు. ఈ కమిటీలో సాంకేతిక నిపుణులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఉభయ రాష్ట్రాలకు సంబంధించి ఉంటారని ఆయన చెప్పారు. ఈ కమిటీ సిడబ్ల్యుసి ఆధ్వర్యంలో పనిచేస్తుందన్నారు. కాలయాపన లేకుండా వచ్చే సోమవారం లోపునే కమిటీ నియామకం జరుగుతుందన్నారు. 

అలాగే గోదావరి నది నుంచి ఏటా సముద్రంలో కలసిపోతున్న 3000 టీఎంసీల నీటి వృధాపై కూడా కమిటీ ఆరా తీసి తమ నివేదికలో పొందుపరుస్తుందని మంత్రి రామానాయుడు చెప్పారు. 

రాష్ట్రాలు వేరైనా, పార్టీలు వేరైనా తెలుగుజాతి ఒకటేనన్న స్నేహపూర్వక వాతావరణం లో ఢిల్లీ సమావేశం జరగటం గొప్ప శుభ పరిణామంగా జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అభివర్ణించారు.

Comments

-Advertisement-