రూ.1290 కోట్ల విలువైన పనులతో ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి తాగు నీటి సరఫరా
రూ.1290 కోట్ల విలువైన పనులతో ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి తాగు నీటి సరఫరా
• 10 లక్షల మందికి తాగు నీరు అందించబోతున్నాము
• ప్రకాశం జిల్లాలో అతి పెద్ద తాగు నీటి ప్రాజెక్టుకు అంకురార్పణ చేస్తున్నాం
• ఎన్డీఏలో భాగస్వామ్యం రాష్ట్రానికి వరం... కేంద్రం సహకారంతోనే జల్ జీవన్ మిషన్ పథకానికి పునరుజ్జీవం
• కూటమి నాయకుల మధ్య గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సఖ్యతతో రాష్ట్రానికి మేలు
• వైసీపీ పాలనలో జల్ జీవన్ మిషన్ కు మ్యాచింగ్ గ్రాంటు కూడా ఇవ్వలేదు
• జల్ జీవన్ మిషన్ నిధులను పైపు లైన్ల పేరుతో నిర్వీర్యం చేశారు
• మార్కాపురం నియోజకవర్గంలో తాగు నీటి సరఫరా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
‘వైసీపీ ఐదేళ్ల పాలనలో తాగు నీటికి సంబంధించిన ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా చేయలేదు. ప్రతిష్టాత్మక జల్ జీవన్ మిషన్ రూ.4 వేల కోట్లను పైప్ లైన్ల పేరుతో వృథా చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పథకాన్ని సమీక్షించి కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాలు చర్చించాము. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో తాగు నీటి అవసరాలు తీర్చేందుకు రూ.1290 కోట్ల విలువైన జల్ జీవన్ మిషన్ పనులకు శ్రీకారం చుట్టాము. 10 లక్షల మందికి పైగా ప్రజలకు తీగు నీరు అందించే అతిపెద్ద ప్రాజెక్టు ఇది’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్యూ ఎస్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజలకు తాగు నీరు కూడా ఇవ్వని వైసీపీ మాత్రం 2029లో మళ్లీ అధికారంలోకి వస్తాం... గొంతులు కోస్తాం... కుత్తుకలు కోస్తాం అంటూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. అసలు వాళ్ళు మళ్లీ అధికారంలోకి వస్తే కదా..! మేం రానిస్తే కదా... అన్నారు. వైసీసీ పాలకులు నిజంగా అద్భుతంగా పాలన అందిస్తే వైసీపీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమై ఉండేది కాదని చెప్పారు. అధికారం లేనప్పుడే వైసీపీ గూండాగిరి, రౌడీయిజాన్ని ఎదుర్కొని పోరాటం చేసిన వాళ్లం.. ఇప్పుడు వైసీపీ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు ప్రభుత్వం కాదు... తప్పులు చేసే వారిని శిక్షించే ప్రభుత్వం అన్నారు.
శుక్రవారం మార్కాపురం నియోజకవర్గం నరసింహపురంలో జల్ జీవన్ మిషన్ కింద రూ.1290 కోట్లతో చేపట్టిన అమృతధార తాగు నీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి తాగు నీరు అందించే ప్రాజెక్టు ఇది. అంతకు ముందు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి అంజలి ఘటించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు . సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొని కాల్చుకోండి అని ధైర్యంగా గుండెలు చూపించిన ధీశాలి టంగుటూరి ప్రకాశం పంతులు . ధైర్యం లేని సమాజంలో ధైర్యాన్ని నింపారు. అలాంటి మహానుభావులు పుట్టిన నేల ఇది. ఇలాంటి నేల చాలా నిర్లక్ష్యానికి గురయిందని ఇక్కడ యువతలో ఆవేదన ఉంది. దశాబ్దాలుగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదని, చుక్క తాగునీరు లేక ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయిపోయాయని, ఉపాధి కోసం లక్షలాది మంది వలసలు వెళ్లిపోవల్సి వస్తుందని యువత ఆవేదన చెందుతున్నారు. మీ ఆవేదన అర్థం చేసుకున్నాం కనుకే ప్రకాశం జిల్లాలో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అతి భారీ మంచినీటి ప్రాజెక్టు రూ. 1290 కోట్లతో జల్ జీవన్ పనులు ప్రారంభిస్తున్నాం. ఇది కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. పశు సంపదకు కూడా నీరు లేని పరిస్థితులు నెలకొన్నాయి. వాటికి కూడా పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామాల్లో నీటి తొట్టెలు నిర్మించే కార్యక్రమం చేపట్టాము.
• వైసీపీ దెబ్బకు జల్ జీవన్ మిషన్ నిలిచిపోయేది
జల్ జీవన్ మిషన్ పథకం ప్రధాని నరేంద్ర మోడీ గారి కలల ప్రాజెక్ట్. దేశంలో ప్రతి ఒక్కరి గొంతు తడపాలన్నదే ఆయన ఆకాంక్ష. ఈ పథకం కింద గత ప్రభుత్వానికి 2019- 24 మధ్య రూ. 26 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే... కేవలం రూ. 4 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కనీసం మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేదు. ఖర్చు చేసిన సొమ్ముతో ఏ ఒక్కరి దాహం తీర్చలేదు. కేవలం పైపులు వేసి చేతులు దులుపుకొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జల్ జీవన్ మిషన్ మీద పథకం మీద సమీక్షించినప్పుడు పథకం గడుపు తీరిపోతుందని, కేంద్రం కూడా పథకం అమలు తీరుపై అసంతృప్తిగా ఉందని తెలిసింది. అద్భుతమైన ఈ పథకం ఉపయోగించుకుంటే రాష్ట్రంలో తాగునీటి కొరత లేకుండా చూడవచ్చనే అభిప్రాయంతో జలజీవన్ మిషన్ పథకం గురించి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ గారితో పలుమార్లు నేను, ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిసి కూడా విన్నవించాం. జల్ జీవన్ మిషన్ పథకానికి రాష్ట్రంలో రూ. 84 వేల కోట్లు అవసరం అవుతుందని, పథకం గడువు పెంచాలని విన్నవించాం.
ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టే... ప్రజలు ఇచ్చిన ఆశీస్సుల వల్లనే మళ్లీ పథకానికి పునరుజ్జీవం తీసుకొచ్చాం. దానిలో భాగంగానే ప్రకాశం జిల్లాలో మొదట విడత పనులకు శంకుస్థాపన చేశాం. దీనివల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
• 10 లక్షల మందికి దాహం తీర్చవచ్చు
ఈ ప్రాజెక్టు దాదాపు 20 నెలల్లో పూర్తవుతుంది. ప్రాజెక్టు పూర్తయితే ఎర్రగొండపాలెం, ఒంగోలు, కనిగిరి, కొండపి, గిద్దటూరు, దర్శి, మార్కాపురం నియోజకవర్గాల పరిధిలోని 18 మండలాలు, 578కు పైగా గ్రామాల్లో తాగు నీటి సమస్యను తీర్చవచ్చు. మొదటి దశలో ఈ ప్రాజెక్టు కింద ఒక వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, 19 సంపులు, 31 ఓవర్‌హెడ్ బాలెన్సింగ్ రిజర్వాయర్లు, 334 ఓవర్‌హెడ్ ట్యాంకులు, 5 వేల కిలోమీటర్ల పైపు లైన్ల ద్వారా సుమారు 10 లక్షల మంది జనాభాకు వచ్చే 30 సంవత్సరాలపాటు తాగు నీటి సమస్య లేకుండా చూడొచ్చు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి కృష్ణా నది నీటిని రాపిడ్ శాండ్ ఫిల్టర్లతో శుద్ధి చేసి, పైప్ లైన్‌ల ద్వారా ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించవచ్చు. దీని ద్వారా పశ్చిమ ప్రకాశంలోని చాలా ప్రాంతాలకు ఫ్లోరైడ్ సమస్య లేని మంచి నీరు అందుతుంది.
• వైసీపీ శిలా ఫలకం వేసి మమ అనిపించింది
వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసినట్లు ఎన్నికల ముందు వైసీపీ స్టంట్ చేసింది. శిలా ఫలకం వేసి మమ అనిపించింది. 2024 తరువాత లక్షల కోట్ల అప్పులు మిగిల్చి దిగిపోయింది. 2024లో 21 మంది ఎంపీలను కూటమికి గెలిపించడం రాష్ట్రానికి అది వరం అయింది. కేంద్రం నుంచి అవసరమైన పనులు, పథకాలు రావడానికి ఇది కారణం. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కూడా ప్రణాళికబద్ధంగా అమలు చేస్తున్నాం. 18 నుంచి 20 నెలల్లో సక్రమంగా పనులను పూర్తి చేస్తాం. ప్రకాశం జిల్లాలో పారిశ్రామికీకరణ జరగాలి. ఉపాధి మెండుగా ఉండాలి. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల వలసలు లేని, సమృద్ధిగా నీరు లభించే ప్రకాశం జిల్లా కల సాకారం అవుతుంది. సుస్థిరమైన 15 ఏళ్లపాటు పాలించే ప్రభుత్వం వల్లనే ఇది సాధ్యమవుతుంది. నేను అందుకే ప్రతిసారి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలను 15 ఏళ్లపాటు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుతాను.
వైసీపీ ప్రభుత్వం మీద పోరాటాలు చేసిన వాళ్లం. కడుపు కాలినవాడికి, కష్టపడి పని చేద్దాము అనుకున్నవాడికి కోపం తెప్పించకూడదు. అలా మేమూ రాష్ట్రం కోసం పని చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రభుత్వంలో తప్పులు ఉంటే చెప్పాల్సిన విధంగా చెప్పండి. వాటిని సరిదిద్దుకుంటాం. లోపాలు జరిగితే మా దృష్టికి తీసుకురండి. వాటిని సరిదిద్దుతాం. అంతేకానీ ఇష్టానుసారం - రంపాలు తెస్తాం.. కుత్తుకలు కోస్తాము అంటే సహించేది లేదు. నేనూ సినిమావాడినే... సినిమాలో డైలాగులు కేవలం ప్రేక్షకుల వినోదం కోసం మాత్రమే బాగుంటాయి. వాటిని సమాజంలో సగటు మనిషిని భయభ్రాంతులకు గురి చేసేలా ఉపయోగిస్తే మాత్రం చర్యలు తప్పవు.
• దేవుడి భూముల జోలికి రావొద్దు
చారిత్రక నేపథ్యం ఉన్న మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి వారి ఆలయం భూములు అన్యాక్రాంతం అయ్యాయన్న విషయం నా దృష్టికి వచ్చింది. వైసీపీ హయాంలో భూ దోపిడి హద్దులన్నీ దాటేసింది. దేవాలయాల భూములు, అటవీ భూములు, ఖాళీ భూములు.. ఇలా ఎక్కడ ఖాళీ భూమి కనబడితే అక్కడ వైసీపీ నేతలు గద్దల్లా వాలిపోయి ఆక్రమించేశారు. దేవుడి భూములను కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. ఈ వ్యవహారం మీద ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారిస్తుంది. ఆక్రమణకు గురైన దేవాలయాల భూములు తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాం. దేవాలయాల భూములకు రక్షణ కల్పించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.
• కూటమి ప్రభుత్వం అంటే పిడికిలికి ఉన్న శక్తి
ఇంట్లో తల్లిదండ్రులు తిట్టుకొని నిద్రలేస్తే ... పిల్లలు కొట్టుకొని నిద్రలేస్తారు అంటారు. కూటమిలోని మూడు పార్టీల నాయకులు నిరంతరం సమన్వయంగా పని చేయాల్సిన అవసరం ఉంది. వైసీపీ మన మధ్య ఎల్లప్పుడు ఏదో ఒక ఘర్షణ నింపాలని చూస్తోంది. చిన్న విషయాలను పెద్దవి చేసి చూడకండి. పంచాయతీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిరంతరం ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువ ఇవ్వాలి.
ప్రధాని నరేంద్ర మోడీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నాకు ప్రభుత్వ స్థాపనకు ఎవరూ ఎలా కష్టపడ్డారో, ఇప్పుడు ఎలా కష్టపడుతున్నారో ... కూటమి ఐక్యత కోసం ఎలా పాటుపడుతున్నారో తెలుసు. ఆ విషయంలో మాకు స్పష్టత ఉంది. కూటమిలో మూడు పార్టీల్లో ఎవరూ ఎక్కువ కాదు... ఎవరూ తక్కువ కాదు. 2024కు ముందు చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీకి నైతికంగా అండగా నిలబడ్డాం. ఆ పార్టీ బలం గొప్పదని చెప్పగలిగాం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారికి అండగా నిలిచాం. మేము ఎప్పుడూ ఏ పార్టీని తగ్గించలేదు. జల్ జీవన్ మిషన్ కు ఇంతటి నిధులు వస్తున్నాయంటే బీజేపీ కారణం. రాష్ట్ర ఆర్థిక నిర్వహణను ఇంత సమర్థంగా నిర్వహించడం అనుభవం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికే సాధ్యం. ప్రజల గురించి పోరాటం చేయడం నాకు తెలిసిన పని. ఇలా అంతా కలిస్తేనే పిడికిలి అవుతుంది. ఆ పిడికిలికి ఉన్న శక్తి అపారం. కూటమిలోని నాయకుల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మాట్లాడుకొని ముందుకు వెళ్లాలి. ప్రజలందరికీ దాహం తీర్చే అవకాశం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు” అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి , ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ప్రకాశం జిల్లాకి చెందిన శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి , బి.ఎన్. విజయ్ కుమార్ , దామచర్ల జనార్ధనరావు , శ్ర ముత్తుమల అశోక్ రెడ్డి , డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి , ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ , మాల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ డా.పెదపూడి విజయ్ కుమార్ , ఏపీ అగ్రి మిషన్ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి , మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి , జనసేన పార్టీ జిల్లా ఇంఛార్జ్ షేక్ రియాజ్ , మార్కాపురం జనసేన ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ , పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ , కమిషనర్ కృష్ణతేజ , జిల్లా ఉన్నతాధికారులు, మార్కాపురం ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.