ఎర్రగుంట్ల-కడప మార్గంలో రైళ్లలో ఈగల్, రైల్వే, ఆర్.పి.ఎఫ్, పోలీసు, డాగ్ స్క్వాడ్ టీం లతో తనిఖీలు
ఎర్రగుంట్ల-కడప మార్గంలో రైళ్లలో ఈగల్, రైల్వే, ఆర్.పి.ఎఫ్, పోలీసు, డాగ్ స్క్వాడ్ టీం లతో తనిఖీలు
గంజాయి, నిషేధిత మాదక ద్రవ్యాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
కడప జులై 4: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ టీం ఐ.జి ఆకే రవికృష్ణ ఐ.పి.ఎస్ ఉత్తర్వుల మేరకు కడప జిల్లా ఎస్.పి ఇ.జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఎర్రగుంట్ల - కడప మార్గంలో ముంబై నుండి చెన్నై ఎగ్మోర్ వెళుతున్న రైలులో కడప మహిళా పి.ఎస్ డి.ఎస్.పి ఈ.బాలస్వామి రెడ్డి ఆధ్వర్యంలో ఈగల్, రైల్వే జి.ఆర్.పి, ఆర్.పి.ఎఫ్, స్పెషల్ పార్టీ, పోలీసు, డాగ్ స్క్వాడ్ టీం లతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా డి.ఎస్.పి బాలస్వామి రెడ్డి మాట్లాడుతూ జనరల్ బోగి నుండి ఏ.సి బోగీలను అన్నింటిని తనిఖీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు, అక్రమ రవాణాను అరికట్టే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
గంజాయి అక్రమ రవాణా నిర్మూలన కొరకు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఏర్పాటు చేశారని, ఈ నెంబర్ కు సమాచారం అందిస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
ఈ తనిఖీలలో కడప వన్ టౌన్ ఎస్.ఐ అమర్ నాథ్ రెడ్డి, కడప రైల్వే ఎస్.ఐ సునీల్ కుమార్ రెడ్డి, స్పెషల్ పార్టీ, ఈగల్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.