పేదల సంక్షేమాభివృద్ధికి పి–4 కార్యక్రమం..
పేదల సంక్షేమాభివృద్ధికి పి–4 కార్యక్రమం..
పేదరికాన్ని రూపుమాపడంలో కలిసికట్టుగా పని చేయాలి..
- మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం: జూలై 08, 2025
స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంలో భాగంగా పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్నర్షిప్ (పి 4) విధానం ద్వారా పేదల సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం ఆయన నగరంలోని జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి పి–4 కార్యక్రమం అమలుపై పట్టణ, గ్రామ సచివాలయ సిబ్బంది, అధికారులు, పార్టీ నాయకులు తదితరులతో సమావేశమై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి–4 కార్యక్రమ ఉద్దేశాన్ని వారు వివరించి, సలహాలు, సూచనలు కోరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పి 4 ప్రపంచంలోనే ఒక గొప్ప కార్యక్రమం అని పేర్కొంటూ, మెరుగైన సమాజ నిర్మాణం కోసం రూపకల్పన చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. జీవితంలో ఉన్నతంగా స్థిరపడిన వ్యక్తుల సహకారంతో దిగువ కుటుంబాలను పైకి తీసుకురావాలన్నదే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం అని, తద్వారా 2029 నాటికి సమాజంలోని పేదరికాన్ని జీరో స్థాయికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ప్రణాళిక ద్వారా పేదరిక నిర్మూలన, సమాజ అభివృద్ధికి మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం అందించేందుకు సాధ్యమవుతుందన్నారు. పి 4 పథకం సమాజంలోని అగ్రశ్రేణి 10 శాతం ధనవంతులను ప్రోత్సహించి, దిగువన ఉన్న 20 శాతం పేద ప్రజలను దత్తత తీసుకొని వారికి మద్దతు ఇచ్చేలా చేస్తుందని, ధనవంతులు మార్గదర్శిగా వ్యవహరిస్తూ దిగువన ఉన్న బంగారు కుటుంబాలకు చేయూతనందించేలా చేస్తుందన్నారు.
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో 19,17,151 బంగారు కుటుంబాలు గుర్తించగా, అందులో 1,64,546 బంగారు కుటుంబాలను 10,343 మంది మార్గదర్శిలు దత్తత తీసుకోవడం జరిగిందని తెలిపారు. కృష్ణాజిల్లాలో 68,948 బంగారు కుటుంబాలను గుర్తించగా, అందులో 2,723 బంగారు కుటుంబాలను 3,44 మంది మార్గదర్శలు దత్తత తీసుకున్నారని, మచిలీపట్నం నియోజకవర్గంలో 9,778 బంగారు కుటుంబాలు గుర్తించామని, అందులో 398 బంగారు కుటుంబాలను 106 మంది మార్గదర్శకులు దత్తత తీసుకున్నారని మంత్రి తెలిపారు. నియోజకవర్గంలో 76 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయని, డివిజన్ ఇన్చార్జిల సహకారంతో సిబ్బంది వారి పరిధిలో ఉన్న మార్గదర్శిలను గుర్తించాలని, ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వారికి వివరించి ప్రోత్సహించాలని సూచించారు. మచిలీపట్నం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు.
పేదరికాన్ని రూపుమాపే పి 4...
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని పేదరికాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ పూర్తిస్థాయిలో నిర్మూలన కాలేదని, అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సమాజంలోని పేదరికాన్ని జీరో స్థాయికి తీసుకురావాలనే లక్ష్యంతో పి 4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
జీవితంలో ఉన్నతంగా స్థిరపడిన ధనికులను గుర్తించి, పేదలను దత్తత తీసుకొని వారి అభ్యున్నతికి కృషి చేయడం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం అన్నారు. బంగారు కుటుంబాలుగా గుర్తించిన వారిలో అవసరం ఉన్నవారికి ఆర్థిక సహాయం లేదా వస్తు సేవల రూపంలో చేయూత అందించడం, పిల్లల చదువుకు ఖర్చును భరించడం, ఇళ్ళ నిర్మాణాలకు సహకారం అందించడం, యువతకు ఉపాధి కల్పించడం తదితర సేవలను మార్గదర్శిల ద్వారా అందించి పేదల స్థితిగతులను మార్చాలన్నదే ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రతి సచివాలయ పరిధిలోని దేశ విదేశాలలో స్థిరపడిన ధనికులను గుర్తించి బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే విధంగా వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జడ్పీ డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, మచిలీపట్నం నియోజకవర్గ ప్రత్యేక అధికారి మార్కెటింగ్ ఏడి ఎల్ నిత్యానంద, మండల ప్రత్యేక అధికారి పౌరసరఫరాల సంస్థ డిఎం శివరాం ప్రసాద్, నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ మున్సిపల్ కమిషనర్ గోపాలరావు, తహసిల్దార్ మధుసూదన్ రావు, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచే నాని, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపు సత్యనారాయణ, పలువురు కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జిలు, పార్టీ నాయకులు, పట్టణ గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.