APSDMA: ఏపీలో భారీ వర్షాలు... అప్రమత్తంగా ఉండాలన్న ఏపీఎస్డీఎంఏ
APSDMA: ఏపీలో భారీ వర్షాలు... అప్రమత్తంగా ఉండాలన్న ఏపీఎస్డీఎంఏ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..
- ఏపీల మరో నాలుగు రోజుల పాటు వర్షాలు...
- ఈ నెల 24న బంగాళాఖాతంలో అల్పపీడనం...
ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు రోజుల పాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆయన సూచించారు.
రేపు (జులై 22) ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
వర్షాలు, పిడుగుల నేపథ్యంలో ప్రజలు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్డీఎంఏ సూచించింది. చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల దగ్గర నిలబడరాదు. విద్యుత్ స్తంభాలకు, వైర్లకు దూరంగా ఉండాలి. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. ఇళ్లల్లో ఉన్నవారు కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. పిడుగులు పడే సమయంలో విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించరాదు. ప్రజలు ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.
కాగా, పశ్చిమ మధ్య, వాయవ్య బంగళాఖాతం, దక్షిణ ఒడిశా, ఏపీ ఉత్తర కోస్తా వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది. అంతేగాకుండా, ఈ నెల 24న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.