రైతులకు యూరియా, ఇతర ఎరువుల కొరత రానివ్వొద్దు
రైతులకు యూరియా, ఇతర ఎరువుల కొరత రానివ్వొద్దు
- కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు
- ఇబ్బందులకు గురిచేస్తే ఈసీ, పీడీ యాక్ట్‌ల కింద కేసుల నమోదు
- అవసరానికి మించి యూరియా వినియోగంపై అవగాహన కల్పించండి
- క్షేత్రస్థాయిలో కలెక్టర్ల తనిఖీలు తప్పనిసరి
- నీటి నిర్వహణ పక్కాగా జరిగితేనే ఫలితాలు
- కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎస్ కె.విజయానంద్ టెలీకాన్ఫరెన్స్
అమరావతి, జూలై 26 : రాష్ట్రంలో రైతులకు ఎక్కడా యూరియా, ఇతర ఎరువుల కొరత లేకుండా చూడాలని కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఆందోళనకు గురిచేస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాంప్లెక్స్ ఎరువులు తీసుకుంటేనే డీఏపీ విక్రయిస్తామని పలు ప్రాంతాల్లో వ్యాపారులు నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అటువంటి వారిపై ఈసీ, పీడీ యాక్ట్‌లు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎస్ విజయానంద్ శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో యూరియా లభ్యత, వర్షాల నేపథ్యంలో చెరువులు, కాలువ గట్లకు గండ్లు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి నిర్వహణపై కలెక్టర్లు, అధికారులకు సీఎస్ పలు సూచనలు చేశారు.
అతిగా వినియోగంపై అవగాహన కల్పించండి
రైతులు పంటల అవసరానికి మించి యూరియా అధికంగా వాడుతున్నారని, దీనివల్ల భూమి నిస్సారమవుతుందనే అవగాహనను రైతులకు కల్పించాలని సీఎస్ విజయానంద్ సూచించారు. ‘‘రసాయన ఎరువులు ఎక్కువ వినియోగించడం వల్ల భూసారం తగ్గి పంట ఉత్తత్తులపై ప్రభావం పడుతుంది. ఈ విషయాన్ని రైతులకు తెలియజేయాలి. రైతులకు అవసరమైన మేర యూరియా అందిస్తాం. భూసారం ప్రకారం శాస్త్రవేత్తలు సూచించిన మోతాదులోనే రైతులు ఎరువుల వినియోగించేలా చూడాలి. అలాగని యూరియా కొరత ఉందనే అనుమానం రైతుల్లో రేకెత్తకుండా చూడండి. రైతులకు అవసరమైన మేర ఎరువులు అందుబాటులో ఉన్నాయి. యూరియా కొరత ఉందని కొన్ని మాధ్యమాలు, సామాజిక మాద్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోంది. ఇటువంటి కథనాలు వచ్చినచోటు కలెక్టర్లు వెంటనే స్పందించి వాస్తవాలను తెలియజేయాలి. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రతిరోజూ రైతులకు ఎంత సరఫరా చేశాం, ఎంత నిల్వలు ఉన్నాయనే సమాచారాన్ని మీడియా సమావేశం ద్వారా వివరించాలి. గోడౌన్లు, ఎరువుల దుకాణాలను తరచూ కలెక్టర్లు తనిఖీలు చేయాలి. రైతులతో కలెక్టర్లు, అధికారులు మాట్లాడాలి. ప్రతీ రైతు సేవా కేంద్రానికి అవసరమైన మేర స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలి. నానో యూరియా వాడకంతో కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలి. పీజీఆర్ఎస్ పోర్టల్ నుంచి రైతుల సమస్యలను స్వీకరించాలి.’’ అని సీఎస్ విజయానంద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఉత్తమ నీటి నిర్వహణ తప్పనిసరి
ప్రస్తుతం రాష్ట్రంలో సమృద్ధిగా కురుస్తున్న వర్షాలు, ప్రాజెక్టులకు ఎగువ నుంచి వస్తున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని సీఎస్ విజయానంద్ అధికారులకు సూచించారు. ఉత్తమ నీటి నిర్వహణ విధానాలను అధికారులు తప్పకుండా అమలు చేయాలని అన్నారు. ‘‘కోస్తా ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. వచ్చిన వరదనీటిని వచ్చినట్లుగానే ముందుగా దిగువకు విడుదల చేయకుండా సాగునీటి కాల్వలకు మళ్లించాలి. సముద్రంలోకి వృధాగా పోకుండా సాధ్యమైనంత వరకు అన్ని ప్రాజెక్టుల్ని నింపాలి. అన్ని సమ్మర్ స్టోరేజ్ చెరువులను నీళ్లతో నింపుకోవాలి. ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్లు నిరంతరం సమన్వయంతో ఉండాలి. నరేగా అధికారులతో సమన్వయం చేసుకుని చెరువుగట్లు, కాల్వల గట్లకు గండ్ల పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి నిర్వహణ చేయడం ద్వారా భూగర్భ జలాలు పెంచుకునే అవకాశం ఉంది. తుంగభద్ర ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలతో పాటు, రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పరిధిలో ఉండే ముంపు ప్రాంత ప్రజలను సమస్య తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి’’ అని సీఎస్ కలెక్టర్లు, అధికారులకు సూచించారు.