కర్నూలు సర్వజనాసుపత్రిలో రోగుల సహాయకుల కోసం విశ్రాంతి భవనం
కర్నూలు సర్వజనాసుపత్రిలో రోగుల సహాయకుల కోసం విశ్రాంతి భవనం
రూ.14 కోట్ల ఖర్చుతో నిర్మాణం
నిర్మాణానికి ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థకు మంత్రి అభినందనలు
కర్నూలు సర్వజనాసుపత్రిలో(జిజిహెచ్) ప్రతిరోజూ అధిక స్థాయిలో చికిత్సల కోసం ఇన్‌పేషెంట్లుగా చేరే రోగుల సహాయకుల అవసరాల నిమిత్తం రూ.14.15 కోట్ల ఖర్చుతో అన్ని సౌకర్యాలతో కూడిన విశ్రాంతి భవనాన్ని నిర్మించనున్నారు. ఈ వ్యయం మొత్తాన్ని భరించడానికి సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేసే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(పిజిసిఐ) ముందుకొచ్చింది. ఈ మేరకు వచ్చిన ప్రతిపాదనను సమగ్ర పరిశీలనానంతరం వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదించారు.
'విశ్రామ్ సదన్' పేరుతో నిర్మితమయ్యే ఈ భవనంలో రోగుల సహాయకుల కోసం మొత్తం 150 పడకలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఆఫీసు కార్యాలయం, రిక్రియేషన్ వసతులు, పంప్ హౌస్, ఓవర్ హెడ్ నీటి ట్యాంకు, జనరేటర్, సోలార్ రూఫ్‌టాప్‌లు ఉంటాయి.
నిర్మాణం పూర్తయిన వెంటనే ఈ విశ్రాంతి భవనాన్ని నిర్వహణ నిమిత్తం పిజిసిఐ కర్నూలు సర్వజనాసుపత్రికి బదలాయిస్తుంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా వినియోగదారుల నుంచి స్వల్ప రుసుం వసూలు చేసి భవనాన్ని నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ ఎంపిక చేసిన స్వచ్ఛంద సంస్థకు అప్పగిస్తారు.
కర్నూలు సర్వజనాసుపత్రిలో రోగుల సహాయకుల కోసం సరైన వసతుల్లేని మూడు షెడ్లున్నాయి. సరైన భద్రత, పారిశుధ్యం లోపించడంతో పలు ఫిర్యాదులొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ( సియస్ ఆర్) కింద ఒక ఎకరం స్థలంలో విశ్రాంతి భవనాన్ని నిర్మించడానికి ముందుకొచ్చిన పిజిసిఐను మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు.
ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ...రోగులకు వసతి కేటాయించడానికి తగు ప్రాధాన్యతలు, లాభాపేక్ష లేకుండా రుసుం నిర్ణయం, వసతి కాలపరిమితి, ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం కాకుండా నివారించడం, రుసుం వసూలు మరియ జమ చేయడం, నిర్వహణ సంస్థ ఎంపికలకు సంబంధించి స్పష్టమైన విధివిధానాలను రూపొందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.
కర్నూలు సర్వజనాసుపత్రిలో ఇన్‌పేషెంట్ల కోసం 1700 పడకలున్నాయి. ఇందులో 150 క్యాన్సర్ పేషెంట్ల కోసం కేటాయించారు. సగటున ప్రతి రోజూ 90 శాతానికి పైగా రోగులతో నిండుతున్నాయని, ఈ నేపథ్యంలో రోగుల సహాయకుల అవసరాల కోసం అన్ని వసతులతో కూడిన విశ్రాంతి భవనం అవసరముందని సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు తాము పంపిన ప్రతిపాదనను శీఘ్రమే ఆమోదించినందుకు మంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.