యూడైస్ ఎన్ రోల్ మెంట్ ను సమర్థవంతంగా చేపట్టాలి
యూడైస్ ఎన్ రోల్ మెంట్ ను సమర్థవంతంగా చేపట్టాలి
- పదో తరగతి తర్వాత ఇంటర్ లేదా ఓకేషనల్ కోర్సుల్లో విద్యార్థులు తప్పనిసరిగా ప్రవేశం పొందేలే చూడాలి
- ఆగష్టు 7 నుంచి అక్షర ఆంధ్ర కార్యక్రమం (ప్రాజెక్ట్ అఆ) ప్రారంభం
- ఇంటర్ విద్యపై సమీక్షలో మంత్రి నారా లోకేష్
ఉండవల్లిః ఇంటర్ విద్యలో యూడైస్(యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేష్) ఎన్ రోల్ మెంట్ ను సమర్థవంతంగా చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ విద్యపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో 5,00,965 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. పదో తరగతి పూర్తైన విద్యార్థులు ఇంటర్ లేదా వృత్తి విద్యా కోర్సుల్లో తప్పనిసరిగా ప్రవేశం పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ విద్యార్థి ఇంట్లో ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి ఎక్కడ ప్రవేశం పొందారో ట్రాక్ చేయాలని, పాఠశాల విద్యతోనూ సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో నిరక్షరాస్యులకు అక్షర ఆంధ్ర(ప్రాజెక్ట్ అఆ) కార్యక్రమం ఆగష్టు 7వ తేదీ నుంచి ప్రారంభించనన్నట్లు అధికారులు వివరించారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రతి ఏడాది ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఇబ్బందులు తలెత్తకుండా లాంగ్వేజ్ సబ్జెక్ట్ మార్కులను మిగతా సబ్జెక్టుల మార్కుల సగటుగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ వి.విజయరామరాజు, సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు.