ప్రతి రెవెన్యూ గ్రామానికి గ్రామ పాలన అధికారి
ప్రతి రెవెన్యూ గ్రామానికి గ్రామ పాలన అధికారి
వీఆర్వో, వీఆర్ఏలకు మరో అవకాశం
రెవెన్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు నిర్ణయం
హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-
గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్ధను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పాలన అధికారి ( జీపీవో) ను నియమిస్తున్నాం. ఇందుకోసం గతంలో విఆర్వో, వీఆర్ఏ గా పనిచేసిన వారికి జీపీవోలుగా అవకాశం కల్పించడానికి ప్రత్యేక పరీక్ష నిర్వహించడం జరిగింది. ఇందులో 3,454 మంది అర్హత సాధించగా, రెవెన్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు విఆర్వో, వీఆర్ఏలకు మరో అవకాశం కల్పించి ఇందుకు సంబంధించి అర్హత పరీక్ష త్వరలో నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. సోమవారం నాడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ కార్యదర్శి డి ఎస్ లోకేష్ కుమార్తో కలిసి రెవెన్యూ సంఘాల ప్రతినిధులతో సమావేశమై ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారిని నియమించడంపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్ధను చిన్నాభిన్నం చేసింది, వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్ధను రద్దు చేసి సామాన్యులకు రెవెన్యూ సేవలను దూరం చేసింది. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం లక్ష్యంగా భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది, అదేవిధంగా సామాన్య ప్రజలకు రెవెన్యూ సేవలను చేరువ చేయడానికి ప్రజా కోణంలో నిర్ణయాలు తీసుకొని గ్రామ పాలనా అధికారుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. మీ అందరి సహకారంతో రెవెన్యూ సదస్సులు విజయవంతమయ్యాయి. భూ భారతి ఫలితాలు ప్రతి పేదవాడికి చేరేలా చట్టం అమలుకు క్షేత్రస్ధాయిలో రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలి. పదవులు శాశ్వతం కాదు, పదవిలో ఉన్నప్పుడు తీసుకున్న సంస్కరణలు విధాన పరమైన నిర్ణయాలు పదిమందికి మేలు జరిగేలా ఉండాలి.