కొత్త స్టాంప్ విధానం రూపకల్పనకు కసరత్తు
కొత్త స్టాంప్ విధానం రూపకల్పనకు కసరత్తు
- వచ్చే శాసనసభ సమావేశాల్లో బిల్లు
- మహిళలకు స్టాంప్ డ్యూటి తగ్గించే ఆలోచన
- పాత అపార్ట్ మెంట్‌లకు స్టాంప్ డ్యూటి వెసులుబాటు
- ముఖ్యమంత్రి తో చర్చించి తుది నిర్ణయం
హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-
ముఖ్యమంత్రి Anumula Revanth Reddy నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా సాధారణ ప్రజలకు నష్టం కలిగించకుండా వ్యాపార ఒప్పందాలపై పారదర్శకత ఉండేలా స్టాంప్ విధానాన్ని భారతీయ స్టాంపు చట్టం 1899ను అనుసరించి తెలంగాణ సవరణ బిల్లు-2025ను తీసుకురావాలని నిర్ణయించినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును తీసుకువచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఈ సవరణ బిల్లుపై శనివారం నాడు డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి వి. శేషాద్రి, రెవెన్యూ శాఖ కార్యదర్శి డి. ఎస్. లోకేష్ కుమార్, న్యాయవ్యవహారాల కార్యదర్శి రెండ్ల తిరుపతి, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు, ముఖ్యమంత్రి కార్యాలయ ఒఎస్డి వేముల శ్రీనివాస్ తదితరులతో సమావేశం నిర్వహించారు.
భారతీయ స్టాంపు చట్టం 1899 ప్రకారం, తెలంగాణ పరిధిలో నాలుగు సెక్షన్లను మరియు 26 ఆర్టికల్స్ ను సవరించుట కొరకు 2021 సంవత్సరంలో శాసనసభలో సవరణ బిల్లును ఆమోదించి భారత ప్రభుత్వం ఆమోదం కొరకు పంపడం జరిగిందని అయితే ఈ బిల్లుపై భారత ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలకు సమాధానం ఇచ్చినప్పటికీ 2023 జనవరిలో భారత ప్రభుత్వం ఈ సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపించడం జరిగిందని ఈ సందర్బంగా అధికారులు మంత్రిగారి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
2021లో ప్రవేశపెట్టిన సవరణ బిల్లును ఉపసంహరించుకొని ప్రస్తుత కాలానికి అనుగుణంగా 2025 సవరణ బిల్లును తీసుకురావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని, నిబంధనలు కట్టుదిట్టమైన రూపంలోకి తీసుకురావడం కొత్త ఒప్పందాలకు చట్టబద్దత కల్పించడం లక్ష్యంగా బిల్లును రూపొందించాలని అలాగే పాత చట్టంలో లేనివాటిని కొత్త చట్టం పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని సూచించారు. సామాన్య మధ్యతరగతి ప్రజానీకంపై ఎలాంటి భారం పడకుండా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్దం చేయాలని అధికారులకు సూచించారు.
ఎలాంటి విమర్శలకు తావులేకుండా శాస్త్రీయ పద్దతిలో భూముల ధరల సవరణ జరగాలన్నారు. ఏఏ ప్రాంతాల్లో ఎక్కువ వ్యత్యాసం ఉంది అక్కడ హేతబద్దంగా ఎంత శాతం పెంచేందుకు అవకాశం ఉంది తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళాభ్యదయం కోసం ఎన్నో చర్యలు చేపడుతోందని దీనిలో భాగంగా మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించాలన్న ఆలోచన చేస్తున్నామని అలాగే కొత్త, పాత అపార్ట్‌మెంట్ లకు స్టాంప్ డ్యూటీ ఒకే విధంగా ఉందని పాత అపార్ట్ మెంట్‌లకు రిజిస్ట్రేషన్ తేదీలను పరిగణనలోకి తీసుకొని స్టాంప్ డ్యూటీ తగ్గించాలన్న ఆలోచన చేస్తున్నామని ఈ రెండు అంశాలపై గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారితో చర్చించి విధివిధానాలపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.