డిజిటల్ అరెస్ట్ లేదు... సైబర్ నేరగాళ్ళ బారిన పడవద్దు
డిజిటల్ అరెస్ట్ లేదు... సైబర్ నేరగాళ్ళ బారిన పడవద్దు
శాంతిభద్రతల పరిరక్షణలో ఇతర శాఖలతో సమన్వయం తో విధులు
డిజిటల్ అరెస్ట్ లేదు...సైబర్ నేరగాళ్ళ బారిన పడవద్దు .. సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
కర్నూలు రేంజ్ డి.ఐ.జి డా. కోయ ప్రవీణ్
అర్ధ వార్షిక నేర సమీక్షా సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ, డిఎఫ్ఓ, సెవెంత్ ఏడిజె, ప్రాసిక్యూషన్స్ డిడి, ఫారెన్సీక్ ఐటి నిపుణులు హాజరు.
యాంటీ డ్రగ్స్ పై కరపత్రాల విడుదల
కడప, జూలై 26 : శాంతి భద్రతల పరిరక్షణలో, నేర నియంత్రణలో ఇతర శాఖల అధికారులతో పోలీస్ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కర్నూలు రేంజ్ డి.ఐ.జి డా.కోయ ప్రవీణ్ పేర్కొన్నారు. శనివారం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశపు హాలులో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్ధ వార్షిక నేర సమీక్ష సమావేశానికి కర్నూలు రేంజ్ డిఐజి డా. కోయ ప్రవీణ్ తో పాటు జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ ఇ.జి అశోక్ కుమార్, జిల్లా ఫారెస్ట్ అధికారి వినీత్ కుమార్, సెవెంత్ ఏడిజె జిఎస్ రమేష్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఖదీరున్, ఫోరెన్సీక్ ఐ.టి నిపుణులు సురేంద్ర కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా కర్నూలు రేంజ్ డిఐజి డా. కోయ ప్రవీణ్ మాట్లాడుతూ... రాష్ట్ర గౌ. డి.జి.పి గారి ఆదేశాల మేరకు అర్ధ వార్షిక నేర సమీక్షా సమావేశాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు సమావేశం దోహదపడుతుందన్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది లేదని, పలువురు చదువుకున్న విద్యావంతులు, ప్రొఫెషనల్స్ ఇలాంటి సైబర్ నేరాల బారిన పడుతున్నారని, వీరి మానసిక స్థితిగతులను క్లినికల్ సైకాలజిస్ట్ ద్వారా అధ్యయనం చేసేందుకు తగిన చర్యలు తీసుకుని ఇతరులు బాధితులు కాకుండా చూడవచ్చన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమైనదని, పోలీసు, జ్యూడిషియల్ శాఖల అమలులో నిక్కచ్చిగా వ్యవహరిస్తేనే నేరాలను అరికట్టగలమని.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు.
ఈ సమీక్షలో జిల్లాలోని డిఎస్పీలు, సీఐలు, ఎస్ఐ లు, ఆటవీశాఖ, ఫైర్, జైల్, జ్యూడిషియల్ శాఖల అధికారులతో... గడచిన ఆరు నెలల కాలంలో నమోదైన గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు, హత్య కేసులు, POCSO& రేప్ కేసులు, డెకాయిటి, రాబరీ, ప్రాపర్టీ, వాహనాలు దొంగతనం, మిస్సింగ్, చీటింగ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 Cr.P.C కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్క్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్, డీఐజీ, ఎస్పీలు సమీక్ష నిర్వహించారు.
అందులో భాగంగా పెండింగ్‌లో ఉన్న NBWs, డిపిఓ రిప్లై ఫైల్స్, కేసుల దర్యాప్తు పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం, పోలీసులు తీసుకున్న చర్యలపై ఆరా తీసి, పోలీస్ అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ... నేత్రా నిఘా వాహనం ద్వారా నగరంలో జరుగుతున్న నేరాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. సిఎస్ఆర్ నిధుల ద్వారా ఏర్పాటు చేసిన ఈ నేత్రా వాహనం ద్వారా నగరంలో నేరాలను నియంత్రించ గలుగుతున్నామన్నారు. శక్తి యాప్ ద్వారా లొకేషన్ ట్రేస్ వంటి సదుపాయాల ద్వారా నేరాలకు పాల్పడే వారిని వెంటనే గుర్తించగలిగే భద్రతా సాంకేతికతను అభివృద్ధి చేయాలన్నారు.
సైబర్ నేరాలకు సంబంధించి ప్రస్తుతం జనాన్ని భయపెడుతున్న "డిజిటల్ అరెస్టు" అనే కొత్త నేర పంథా నుండి ప్రజలను సేవ్ చేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టాలన్నారు. ఎవరికీ కనిపించకుండా, వారి ఉనికి తెలియకుండా నేరాలకు పాల్పడుతూ సమాజానికి పెనుముప్పుగా మారారన్నారు. భౌతిక నేరాల కన్నా సైబర్ నేరాలు పెరగడం, అందులో విద్యావంతులు ఎక్కువగా బాధితులు కావడం జరుగుతోందన్నారు. జిల్లాలో ప్రధానంగా పిడీఎస్, మట్కా, గంజాయి, రెడ్ శాండిల్ మొదలైన అక్రమ రవాణా కేసులు నమోదవుతున్నాయని ఆయా విభాగాల్లో నేర శాతాన్ని తగ్గించాలన్నారు.
సోషల్ మీడియాలో కొందరు ఒకరిని లక్ష్యం గా చేసుకుని పెట్టే విద్వేషపూరిత పోస్టుల వల్ల సమాజంలో అశాంతికి దారితీస్తుందని, ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లా ఎస్.పి గారు జిల్లా వ్యాప్తంగా సి.సి కెమెరాలు ఏర్పాటు చేయడంలో చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలో పోలీసు యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా అన్ని పోలీస్ స్టేషన్లలో మౌలిక, సాంకేతిక సదుపాయాలను మెరుగు పరుస్తామన్నారు. ఫోరెన్సిక్ నిపుణుల సాంకేతిక వనరులను సద్వినియోగం చేసుకుంటూ.. సుహృద్భావ హృదయంతో ప్రజలకు మెరుగైన శాంతిరక్షణ సేవలు అందించాలన్నారు. ఈ సందర్భంగా డీఐజీ నాన్ మెడికల్ సైకియాట్రిక్ స్పెషలిస్టు ద్వారా సైబర్ నేరాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.
జిల్లా ఎస్పీ ఇ.జి అశోక్ కుమార్ మాట్లాడుతూ... ప్రతి ఆరు నెలలకోసారి అర్ధ వార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు, శాంతిభద్రతల పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. గత ఆరు నెలల్లో నేరాలు, వాటి తీరు, మున్ముందు వాటిని ఎలా తగ్గించగలమో సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు. సమీక్షా కాలంలో కొన్ని రకాల నేరాలు తగ్గగా, సైబర్ క్రైమ్ తీవ్రత పెరిగిందన్నారు. ప్రజలను సైబర్ నేరాల బారిన పడకుండా చైతన్యపరిచేందుకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. జిల్లాలో 42 బ్లాక్ స్పాట్స్ ను గుర్తించడం జరిగిందని, సంబంధిత అధికారులతో ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సి.సి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో గంజాయి సేవించే ప్రాంతాలను గుర్తించి డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెంచడం జరిగిందన్నారు. గ్రామాల్లో ప్రజలకు పోలీసింగ్ ను మరింత చేరువ చేసేందుకు 'పల్లె నిద్ర'`కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందన్నారు. గ్రామస్థుల సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేయడం ద్వారా భవిష్యత్తులో జరగబోయే నేరాలను జరగకుండా చూడవచ్చన్నారు.
సైబర్, ఇతర రక్షణకు సంబంధించి తక్షణ సహాయం కోసం.. 1930 Cyber Helpline, 112 Emergency response, 1098 Child Helpline, 1972 NDPS & Drugs మొదలైన హెల్ప్ లైన్ నెంబర్ల ద్వారా సమాచారాన్ని అందించవచ్చని, ఈ నెంబర్ల ద్వారా ప్రజలు వారికి అవసరమైన భద్రతా పరమైన సేవలను పొందేలా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. 'శక్తి' యాప్ ను జిల్లాలో 10 వేలకు పైగా యాక్టీవ్ గా వినియోగిస్తున్నారని, 'శక్తి' టీం ల ద్వారా కళాశాలలు, పాఠశాలల వద్ద మఫ్టీ లో నిఘా ఉంచుతూ ఈవ్ టీజింగ్ జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, శక్తి టీం లు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై పాఠశాలల్లో బాలికలకు అవగాహన కల్పించడం జరుగుతోదన్నారు. డ్రోన్ల ద్వారా కళాశాలలు, పాఠశాలల వద్ద నిఘా ఉంచడం జరుగుతోందన్నారు. పోలీస్ కళాజాత బృందం ద్వారా సైబర్ నేరాలు, ఓ.టి.పి సంబంధిత నేరాలు, ఫ్యాక్షన్, ఎర్ర చందనం అక్రమ రవాణా వల్ల కలిగే అనర్ధాలను, గంజాయి, డ్రగ్స్ మహమ్మారి వల్ల జరిగే అనర్ధాలను ప్రజలకు విస్తృతంగా తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని జిల్లా ఎస్.పి గారు తెలిపారు.
జిల్లాలో గత ఆరు నెలలుగా చోటు చేసుకున్న నేరాల విశ్లేషణ, దర్యాప్తు పురోగతి, నేరాల నివారణకు తీసుకున్న చర్యలపై సమగ్ర సమీక్ష చేపట్టారు. గత 6 నెలల కాలంలో నమోదైన క్రైమ్ గణాంకాల విశ్లేషణ జరిపారు.
ఈగల్ టీం ఆధ్వర్యంలో గంజాయికి, డ్రగ్స్ కి గుడ్ బై చెబుదాం, డ్రగ్స్ వద్దు బ్రో, మాదకద్రవ్యాల వినియోగాన్ని కట్టడి చేయాలనే కరపత్రాలను కర్నూల్ రేంజ్ డీఐజీ, జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ అర్ధ వార్షిక నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్.పి (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, అదనపు ఎస్.పి (ఏ.ఆర్) బి.రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి ఎన్.సుధాకర్, కడప డి.ఎస్.పి ఎ.వెంకటేశ్వర్లు, జిల్లాలోని డి.ఎస్.పి లు, సి.ఐ.లు, ఎస్.ఐ.లు, రైల్వే, న్యాయ, రెవిన్యూ, ఫారెస్ట్, రవాణా, ఎక్సయిజ్ వైద్య, ఫైర్, జైళ్ల శాఖ, తదితర అధికారులు, ఈగల్ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.