అప్రమత్తతోనే అందరికీ ఆరోగ్యం
అప్రమత్తతోనే అందరికీ ఆరోగ్యం
- ముందు జాగ్రత్త చర్యలతో వ్యాధుల నియంత్రణ
- ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గాలంటే ఆరోగ్య పరిరక్షణ అవగాహన పెరగాలి
- యోగాతో అద్భుత ఫలితాలు..యోగాధ్యయన పరిషత్ పునరుద్దరణ
- అవసరం లేకున్నా సిజేరియన్లు సరికాదు....సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
- ఐపీఎంలో 150 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
- వైద్యారోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, జూలై 23 : మెరుగైన వైద్య సేవలందించడమే కాదు... ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ మేరకు ప్రజల ఆహారపు అలవాట్లు మొదలుకుని... ఆర్గానిక్ ఉత్పత్తులు వినియోగించడం వరకు కార్యాచరణ అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. బుధవారం సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్య శాఖ పనితీరు.. టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలు, మెడికల్ కాలేజీల నిర్మాణం వంటి అంశాలపై సమీక్షలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ‘భవిష్యత్తులో వైద్య ఖర్చులనేవి ప్రజలకు భరించలేని ఆర్థిక భారంగా మారే ప్రమాదం ఉందని... ఈ భారం తగ్గేలా చేయాలంటే ఆరోగ్యం మీద ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడంతో పాటు.. ఆహారపు అలవాట్లల్లో తీసుకురావాల్సిన మార్పుల పైనా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న ఆహరపు అలవాట్లను కొనసాగిస్తే.. క్యాన్సర్ వంటి ప్రాణాంతక జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. పురుగు మందులు వినియోగించని ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవాలి. ఈ దిశగా రైతులు, ప్రజలను చైతన్యం చేయాలి. ఈ మేరకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేయాలి.’ అని అన్నారు. అప్రమత్తత, ముందు జాగ్రత్త చర్యలతో అందరికీ ఆరోగ్యం అని సిఎం చంద్రబాబు అన్నారు. తగు జాగ్రత్తలతో వ్యాధుల నియంత్రణ చేపట్టాలని అన్నారు. ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గాలంటే ఆరోగ్య పరిరక్షణ అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని సిఎం అన్నారు.
విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహించాలి
‘టాటా ట్రస్ట్-గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో చేపడుతున్న డిజిటల్ నెర్వ్ సెంటర్లు ప్రజారోగ్యంపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తాయి. ఇప్పటికే కుప్పంలో పైలెట్ ప్రాజెక్టుగా టాటా డిజిటల్ నెర్వ్ సెంటరును ప్రారంభించాం. వచ్చే ఏడాది జనవరిలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్లను ప్రారంభించబోతున్నాం.. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది చివరికి ప్రారంభించబోతున్నాం. దీని కోసం జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలి. ఈ సెంటర్లను సమర్థవంతంగా నడపగలిగితే.. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు. తక్కువ ఖర్చులో ఎక్కువ వైద్య సేవలు అందించే లక్ష్యంతో డిజిటల్ నెర్వ్ సెంటర్లు పని చేస్తున్నాయి. టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు ఎలా అందించవ్చనే అంశాలపై అధ్యయనం చేయండి.. హ్యాకథాన్లు నిర్వహించండి. వీలైనన్ని వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా ఉన్న రోగాలను ముందుగానే గుర్తించవచ్చు. ప్రతి మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తే ప్రజల అనారోగ్యం బారిన పడకుండా చర్యలు తీసుకోవచ్చు. తిరుపతి, విజయవాడ, విశాఖ వంటి నగరాల్లోని సిటీ డయాగ్నస్టిక్ సెంటర్లల్లో సేవలు పేదలకు అందుబాటులోకి తీసుకురావాలి. సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కానింగ్ వంటి వాటికి ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లల్లో భారీగా వసూళ్లు చేస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే సిటీ డయాగ్నస్టిక్ సెంటర్ల ద్వారా పేదలకు వివిధ వైద్య పరీక్షలను అందుబాటులోకి తేవాలి. పేదలతో పాటు.. ఇతరులకు కూడా తక్కువ వ్యయంతో డయాగ్నోస్టిక్ సేవలు అందించేలా చూడాలి.” అని చంద్రబాబు సూచించారు.
‘యోగాధ్యాయన పరిషత్’ పునరుద్దరణ
‘గతంలో ఉన్న యోగధ్యాయన పరిషత్తును పునరుద్దరించండి. దీని కోసం ఓ సొసైటీని ఏర్పాటు చేయాలి. యోగాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. నేచురోపతి, హోమియో, ఆయుర్వేదం, యూనాని వంటి సంప్రదాయ వైద్య పద్దతులను యాక్టివేట్ చేయాలి. యోగధ్యాయన పరిషత్ కోసం అవసరమైన సిబ్బందిని మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియమించుకోవాలి. యోగాధ్యాయన పరిషత్ ఏర్పాటు చేయడమే కాకుండా.. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు చర్యలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో అవసరం ఉన్నా.. లేకున్నా.. సిజేరియన్ల ద్వారా కాన్పులు చేస్తున్నారు. యోగా చేస్తే ఎలాంటి ఆపరేషన్లు లేకుండానే సాధారణ ప్రసవాలకు అవకాశం ఉంటుంది. ఆఫ్ లైన్, ఆన్ లైన్ల ద్వారా యోగా శిక్షణ ఇచ్చేలా చూడాలి. యోగా ధ్యానం వంటివి ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యేలా చూడాలి. యోగా డే రోజున డిక్లరేషన్ ప్రకటించాం. ప్రకటనలతో సరిపెట్టకుండా.. ఆచరణలో పెట్టాలి.’ అని సీఎం చెప్పారు.
పిల్లల్లో పోషకాహార లోపాలు గుర్తించాలి
‘చిన్న పిల్లల్లో పోషకాహర లోపాలను ముందుగానే గుర్తించేలా చూడాలి. దీని కోసం కేర్ అండ్ గ్రో పాలసీని సమర్థవంతంగా అమలు చేయాలి. చిన్నప్పుడే పిల్లల్లో లోపాలను గుర్తిస్తే వారు పెరిగి పెద్దవాళ్లయ్యాక ఇబ్బందులు ఉండవు. వైద్య రంగంలో టెక్నాలజీ వినియోగంపై ఇప్పటికే గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో పని చేస్తున్నాం. దీంతో పాటు.. ఐఐటీ చెన్నై వంటి వారి సేవలను కూడా ఉపయోగించుకోవాలి. ఈ మేరకు నిపుణులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ.. టెక్నాలజీ పరంగా ఆయా సంస్థలతో సమన్వయం చేసుకోవాలి. అధికారులు కానీ.. వైద్య నిపుణులు కానీ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. ప్రజల హెల్త్ డేటా అందుబాటులో ఉంటే.. వారిని ఎప్పటికప్పుడు చైతన్యవంతులను చేయవచ్చు. ఇక ప్రతి నియోజకవర్గంలో వైద్య సేవలు అందుబాటులో ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఉండాలనే ప్రభుత్వ పాలసీని పక్కాగా అమలు చేసేలా చూడాలి. ఇక గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి వైద్య సేవలు అందించే అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వాస్పత్రులను తీర్చిదిద్దాలి. ఈ మేరకు అవసరమైతే ఔట్ సోర్సింగ్ సేవలు తీసుకోవాలి. మెడికల్ కాలేజీల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో డీమ్డ్ యూనివర్శిటీల ఏర్పాటు చేసే అంశంపై దృష్టి సారించాలి.” అని చంద్రబాబు చెప్పారు.
150 పోస్టులకు గ్రీన్ సిగ్నల్
‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్’ డైరెక్టరేట్లో పోస్టులను భర్తీ చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సీఎంను కోరారు. 723 పోస్టులకు గానూ.. కేవలం 143 మంది మాత్రమే ఉన్నారని మంత్రి చెప్పడంతో ముందుగా 150 పోస్టులను భర్తీ చేసేలా ప్రక్రియను చేపట్టాలని సీఎం ఆదేశించారు. అలాగే విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులకు రిజిస్ట్రేషన్లు చేసే అంశంపై ఉన్న సమస్యను పరిష్కరించాలని మంత్రి సత్యకుమార్ కు సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వైద్య విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమీక్షలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, టాటా ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు