పది కుటుంబాలకు మార్గదర్శిగా మంత్రి సంధ్యారాణి
పది కుటుంబాలకు మార్గదర్శిగా మంత్రి సంధ్యారాణి
సాలూరు, జూలై 5 : రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యా రాణి నేను సైతం అంటూ ముందుకు వచ్చి ప్రభుత్వం ప్రకటించిన పి 4 - బంగారు కుటుంబం - మార్గదర్శిలో భాగంగా పది కుటుంబాలకు మార్గదర్శిగా నిలుస్తున్నట్లు ప్రకటించి జిల్లాలోనే మొట్టమొదటి వ్యక్తిగా
స్పూర్తిదాయకంగా నిలిచారు. సాలూరు మండల పరిషత్ కార్యాలయంలో నియోజక వర్గం కార్యాచరణ ప్రణాళికపై శనివారం సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి సంధ్యారాణి హాజరయ్యారు.
గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, విద్య, ఆరోగ్యం, రవాణా, నీటి సరఫరా, పౌర సేవలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ రంగాల వారీగా అధికారులతో విశ్లేషణాత్మకంగా చర్చించారు. బంగారు కుటుంబం - మార్గదర్శి కార్యక్రమాన్ని గొప్ప మనసుతో ఆలోచించి ముఖ్య మంత్రి అమలులోకి తీసుకువచ్చారని అన్నారు. ఆగస్టు నాటికి 15 లక్షల కుటుంబాలను, ఒక లక్ష మంది మార్గదర్శిగా ఉండుటకు పిలుపునిచ్చారని చెప్పారు. పేదరికం నుండి ఆయా కుటుంబాలను బయటకు తీసుకురావడం కార్యక్రమం లక్ష్యం అని మంత్రి పేర్కొన్నారు. ఆయా కుటుంబాల బాగు కోసం, ఆరోగ్య, ఆర్థిక సుస్థిరత కోసం ఇది ఎంతో దోహదం చేస్తుందని ఆమె అన్నారు. ఉన్నత ఆశయాలు ఉన్నవారు మార్గదర్శిగా ఉండుటకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మార్గదర్శిగా ఉన్నవారు ధన సహాయం మాత్రమే చేయాల్సిన అవసరం లేదని, వారికి ఉండే విజ్ఞానాన్ని అందించడం, మంచి స్ఫూర్తి కల్పించడం, మంచి అవకాశాలు తెలియజేయడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి వారి ఉన్నతికి తోడ్పాటు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ఒక ప్రకటన చేస్తూ నియోజకవర్గంలోని 10 కుటుంబాలకు స్వయంగా మార్గదర్శిగా ఉంటామని, వారి ఆర్థిక, మానసిక, సామాజిక అభివృద్ధికి పూర్తిగా కృషి చేస్తామని అన్నారు. నియోజక వర్గంలో ప్రతి మండలం నుండి రెండు కుటుంబాలు, సాలూరు మున్సిపాలిటీ నుండి రెండు కుటుంబాలకు మార్గదర్శిగా ఉంటామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు, ఇతర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.