బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం
బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం
మత్తు పదార్థాల వల్ల భవిష్యత్తు అంధకారం ... యువతపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలి
దేశ భవిష్యత్తును కృంగదీసే మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలిద్దాం...రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాలలో యాంటి డ్రగ్స్ అవేర్ నెస్ కార్యక్రమంలో వక్తల పిలుపు
యువత మత్తుకు అలవాటు పడి భవిష్యత్తును విచ్చిన్నం చేసుకోవద్దని, ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా 'ఈగల్' టీం ఆధ్వర్యంలో కడప నగరంలోని రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాలలో మంగళవారం యాంటి డ్రగ్స్ అవేర్ నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా వక్తలు ఏ.డి డిసబిలిటీ కృష్ణ కిషోర్, రిమ్స్ వైస్ ప్రిన్సిపాల్ డా.విజయ్ భాస్కర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.వంశి కృష్ణ లు మాట్లాడుతూ సమాజంలో యువత మత్తుకు అలవాటు పడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని, అంతేగాక చిన్నచిన్న పరిశ్రమలలో పనిచేసే కార్మికులు, కూలీలు వీటికి అలవాటు పడి కుటుంబాలు కూడా చిన్నాభిన్నం అయ్యే పరిస్థితులు దాపరిస్తున్నాయన్నారు.
తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా తమ పిల్లలు ఉన్నతమైన స్థాయిలో ఉంటారని కలలుగన్న వారి కలలను కల్లలుగా చేస్తున్నారని, మత్తు పదార్థాల సేవనం వల్ల మైండ్ తో పాటు, విచక్షణా శక్తిని కోల్పోతున్నారని, సామాజిక ,మానసిక, శారీరక, అనారోగ్యాలు, ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతూ సమాజం నుండి దూరమవుతున్నారన్నారు.
పలువురు మత్తు పదార్థాలకు అలవాటు పడి, డబ్బుల కోసం నేరాలు హత్యలకు సైతం పాల్పడుతూ, మంచి భవిష్యత్తును కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశం అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా యువత కీలకమని, ఎవరూ మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , హోం మంత్రి గారు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలన్న సంకల్పంతో ఉన్నారని, మనమందరం సమష్టిగా మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా ముందుకెళ్లాలన్నారు.
కళాశాల సమీప ప్రాంతాలలో కానీ చుట్టుపక్కల ప్రాంతాలలో కానీ ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
పోలీసు యంత్రాంగం గంజాయి ఏ మూల విక్రయించినా దాడులు నిర్వహిస్తు, రూపుమాపేందుకు కఠిన చర్యలు చేపడుతున్నారని, గంజాయి ఎక్కడెక్కడ ఉందో వాటి మూలాలకు వెళ్లి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
సమాజాన్ని కాపాడాల్సిన యువత బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. ప్రాణాంతకమైన మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు 'నో' చెప్పి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకొని తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేస్తూ ఉన్నతంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ వైద్య అధ్యాపకులు, వైద్య విద్యార్థులు, ఈగల్ సిబ్బంది పాల్గొన్నారు.