పవన్ కళ్యాణ్ గారు రియల్ లైఫ్ లోనూ హీరోయే
పవన్ కళ్యాణ్ గారు రియల్ లైఫ్ లోనూ హీరోయే
- జగన్ జీరో... ఆయన వెనుక నడుస్తున్న జక్కంపూడి రాజా డబుల్ జీరో
- గ్రీన్ సిగ్నల్ ఇస్తే మొదట జనసేనలో చేరేది జక్కంపూడి కుటుంబమే
- రాజకీయ ఉనికి కోసమే పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు
- వరుసగా మూడుసార్లు ప్రజలు మొట్టికాయలు వేసినా బుద్ధి రాలేదు
- రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన నగర అధ్యక్షులు వై. శ్రీనివాస్
జక్కంపూడి కుటుంబం జనసేన పార్టీలో చేరడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సుముఖత చూపకపోవడంతో ఆ ప్రయత్నాలు విరమించుకుందని జనసేన పార్టీ రాజమహేంద్రవరం నగర అధ్యక్షులు వై.శ్రీనివాస్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే జిల్లా నుంచి మొదట పార్టీలో జాయిన్ అయ్యేది జక్కంపూడి కుటుంబమే అన్నారు. నిన్న మొన్నటి వరకు పార్టీలో చేరడానికి ప్రయత్నించి విఫలమవ్వడంతో ... ఇప్పుడు రాజకీయ ఉనికి కోసం పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించారు. మంగళవారం రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా వై. శ్రీనివాస్ మాట్లాడుతూ... “మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై జక్కంపూడి రాజా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో జక్కంపూడి కుటుంబాన్ని రాజమండ్రి రూరల్, రాజానగరం నియోజకవర్గ ప్రజలు లైఫ్ట్ అండ్ రైట్ తన్ని మూలన కూర్చొబెట్టారు. 2024లో రాజాను రాజానగరంలో ప్రజలు అదే సన్మానం చేస్తే రాజమండ్రి ఇంట్లో పడుకోబెట్టారు. వరుసగా మూడుసార్లు ప్రజలు మొట్టికాయలు వేసినా సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేస్తున్నారు.
• పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరో
ఎంతో గుండె ధైర్యం ఉన్న నేత పవన్ కళ్యాణ్ . ప్రజల మీద అపారమైన ప్రేమ, రాష్ట్రానికి మంచి చేయాలనే తపన ఉంది కనుకే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు. దశాబ్ధ కాలంపాటు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సొంత నిధులతో పార్టీని ముందుకు నడిపించారు. ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ముఖ్య భూమిక పోషించింది పవన్ కళ్యాణ్ . రాజకీయాల్లో గెలుపోటములు సహజం. దానికి ఎవరూ అతీతులు కాదు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే హీరో... రాజకీయాల్లో కాదు అని జక్కంపూడి రాజా మాట్లాడుతున్నారు... ఆయనకు మేము ఒకటే చెబుతున్నాం. పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు... రాజకీయాల్లోనూ, నిజ జీవితంలోనూ ఆయన హీరోనే. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని వేల కోట్లు ప్రజా ధనం దోచుకున్న మీ నాయకుడు ఎక్కడా..? ప్రజల కోసం సొంత నిధులు ఖర్చు చేసిన మా నాయకుడు ఎక్కడా..? నల్లధనాన్ని కాపాడుకోవడానికి పార్టీ పెట్టి, రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన మీ నాయకుడు ఎక్కడా..? నీతినిజాయతీలకు మారుపేరైన మా నాయకుడు ఎక్కడా..? రాజకీయాల్లో, వ్యక్తిగతంగా జగన్ జీరో... ఆయన నాయకత్వంలో పని చేస్తున్న మీరు డబుల్ జీరో.
• రాజకీయ సన్యాసం ఎప్పుడు... రాజా?
జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మీద ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన జక్కంపూడి రాజా... ఓడిపోయి ఏడాది అయినా ఇంకా రాజకీయ సన్యాసం ఎందుకు తీసుకోలేదో ప్రజలకు చెప్పాలి. బత్తుల కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రగల్భాలు పలికారు. బత్తుల బలరామ కృష్ణకు 30 వేలకు పైగా మెజార్టీ వచ్చింది. మీరు ఎప్పుడు రాజకీయ సన్యాసం చేస్తారో ప్రజలకు చెప్పాల"ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూపారాణి, జనసేన పార్టీ నాయకులు తేజోమూర్తుల నరసింహమూర్తి, వై.వి.డి. ప్రసాద్, దాసరి గుర్నాథరావు, గుత్తుల సత్యనారాయణ, షేక్ బాషా లిమ్రా, అక్కిరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.