హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ పథకం కింద భారత్ తొలి హైడ్రోజన్ కోచ్ విజయవంతం…
హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ పథకం కింద భారత్ తొలి హైడ్రోజన్ కోచ్ విజయవంతం…
భారతీయ రైల్వే చరిత్రలో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు కోచ్ను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో విజయవంతంగా పరీక్షించారు.
చెన్నైలోని ICF లో తయారైన ఈ హైడ్రోజన్ పవర్ కోచ్ 1,200 హార్స్ పవర్ (HP) శక్తిని కలిగి ఉంది. యూరోపియన్ హైడ్రోజన్ రైళ్ల కంటే దీని శక్తి ఎంతో ఎక్కువ అని మంత్రి పేర్కొన్నారు.
హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ పథకం కింద అభివృద్ధి:
ఈ హైడ్రోజన్ రైలును కేంద్ర ప్రభుత్వం రూ. 2,800 కోట్లతో ప్రవేశ పెట్టిన "హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్" పథకం కింద అభివృద్ధి చేశారు. కాలుష్యం తగ్గించడంలో భాగంగా దేశం ఈ అత్యాధునిక సాంకేతికత వైపు వేగంగా అడుగులు వేస్తోంది.
ఈ పథకం గురించి కొన్ని ముఖ్య విషయాలు:
డీజిల్ ఇంజిన్లకు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ ఇంధన సెల్స్ (fuel cells) ను ఉపయోగించడం ద్వారా రైల్వే పరిశ్రమలో విప్లవాత్మక మార్పు తీసుకురావడం. ఇది హానికరమైన కాలుష్య కారకాలను తగ్గించి స్థిరమైన రవాణాను ప్రోత్సహిస్తుంది.
భారతీయ రైల్వేలు "హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్" చొరవ కింద 35 హైడ్రోజన్ రైళ్లను నడపాలని యోచిస్తోంది.
ప్రతి హైడ్రోజన్ రైలుకు సుమారు 780 కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీనికి అదనంగా గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రతి మార్గానికి ₹70 కోట్లు ఖర్చవుతుంది.
ఈ రైళ్లు ప్రధానంగా 8 హెరిటేజ్ మార్గాల్లో నడుస్తాయి
వాటిలో కొన్ని:
1. మాథేరాన్ హిల్ రైల్వే
2. డార్జిలింగ్ హిమాలయ రైల్వే
3.కాల్కా సిమ్లా రైల్వే
4. కాంగ్రా వ్యాలీ
5. నీలగిరి మౌంటెన్ రైల్వే
6. జింద్-సోనిపట్ (పైలట్ ప్రాజెక్ట్)
ఇప్పటికే ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU) రైళ్లను హైడ్రోజన్ ఇంధన సెల్స్ తో నడిచేలా మార్చడం (retrofitment) ద్వారా ఈ రైళ్లను అభివృద్ధి చేస్తున్నారు