Liquor: మందు బాబులకు సర్కార్ మరో గుడ్ న్యూస్.. అది ఏమిటంటే..?
Liquor: మందు బాబులకు సర్కార్ మరో గుడ్ న్యూస్.. అది ఏమిటంటే..?
- మద్యం షాపుల వద్దే పర్మిట్ రూమ్‌లకు అనుమతి..
- రూ.200 కోట్ల ఆదాయం లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ కసరత్తు..
- మున్సిపాలిటీ పరిధిలో మద్యం షాపు పర్మిట్ రూమ్‌కు రూ.7.50 లక్షలు..
- ఇతర ప్రాంతాల్లోని షాపులకు రూ.5లక్షలు చొప్పున ఫీజు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మద్యం ప్రియులకు మరో శుభవార్తను అందించనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాత మద్యం విధానాన్ని పునఃప్రవేశపెట్టింది. వైకాపా ప్రభుత్వ హయాంలో అందుబాటులో లేని ప్రముఖ బ్రాండ్ల మద్యంను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు రూ.99లకే క్వార్టర్ మద్యం బాటిళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనితో పేద వర్గాల మద్యం ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మద్యం ప్రియులకు మరో శుభవార్తను అందించడానికి సిద్ధమవుతోంది. ఇకపై మద్యం దుకాణాల వద్దే పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆదాయాన్ని పెంచుకునే మార్గంలో భాగంగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్న పర్మిట్ రూమ్‌ల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టేందుకు ఎక్సైజ్ శాఖ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
సెప్టెంబర్ నుంచి మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని భావిస్తున్నారు. గతంలో అన్ని దుకాణాలకు ఏడాదికి రూ.5 లక్షలు పర్మిట్ రూమ్ ఫీజుగా ఉండేది. ఇప్పుడు దానిని రెండు కేటగిరీలుగా మార్పు చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలోని దుకాణాలకు రూ.7.50 లక్షలు, మిగిలిన దుకాణాలకు రూ.5 లక్షల చొప్పున ఫీజులుగా ప్రతిపాదించారు.
రాష్ట్రంలో 3,736 మద్యం దుకాణాలు ఉండగా, వీటికి రూ.5 లక్షల చొప్పున పర్మిట్ రూమ్‌ల ఫీజుల రూపంలో వసూలు చేస్తే రూ.186 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కార్పొరేషన్ల పరిధిలోని దుకాణాలకు అదనంగా రూ.2.5 లక్షలు వసూలు చేయడం ద్వారా పర్మిట్ రూమ్‌ల ద్వారా వచ్చే ఆదాయం రూ.200 కోట్లు దాటుతుందని భావిస్తున్నారు.