పీఎం సూర్య ఘర్ యోజనలో 20 లక్షల ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థలు 2030 నాటికి 550 GW పునరుత్పాదక లక్ష్యం..
పీఎం సూర్య ఘర్ యోజనలో 20 లక్షల ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థలు
2030 నాటికి 550 GW పునరుత్పాదక లక్ష్యం..
కేంద్ర కొత్త, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇటీవల చేసిన ప్రకటన ప్రకారం, 'పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిబ్లీ యోజన' కింద దేశంలో ఇప్పటికే 20 లక్షల ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ లక్ష్యం ఈ పథకాన్ని మరో 30 లక్షల ఇళ్లకు విస్తరించి, మొత్తం 50 లక్షల నివాసాలకు ఈ సౌకర్యం కల్పించడం. దీర్ఘకాలికంగా, దేశవ్యాప్తంగా కోటి ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు అమర్చడం ప్రధాన లక్ష్యం.
భారతదేశం 2030 నాటికి 550 గిగావాట్ల (GW) పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తంది. ప్రస్తుతం దేశంలో 251.5 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. రాబోయే ఐదేళ్లలో మరో 248 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు.
పీఎం సూర్య ఘర్ ముఫ్ బిబ్లీ యోజన:
1.పథకం యొక్క ఉద్దేశ్యం మరియు నిర్మాణం:
ప్రారంభం: 2024 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు.
ప్రధాన లక్ష్యం: గృహ వినియోగదారులకు సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించి, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడం. ఈ పథకం కింద, కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం లక్ష్యం.
సబ్సిడీ విధానం: ఈ పథకంలో సబ్సిడీ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి బదిలీ అవుతుంది. ఇది మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించి, పారదర్శకతను పెంచుతుంది
2.పునరుత్పాదక ఇంధనం & సుస్థిర అభివృద్ధి:
సహజ వనరుల నుండి నిరంతరంగా లభించే ఇంధనాన్ని పునరుత్పాదక ఇంధనం అంటారు. సౌరశక్తి, పవనశక్తి, జల విద్యుత్తు, బయోమాస్ మరియు భూతాప శక్తి దీనికి ఉదాహరణలు.
సౌరశక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడం ద్వారా, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. ఇది కార్బన్ ఉద్గారాలను తగ్గించి, వాతావరణ మార్పుల నియంత్రణకు తోడ్పడుతుంది.
గృహ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం వల్ల దేశం యొక్క విద్యుత్ గ్రిడ్ పై భారం తగ్గుతుంది. అంతేకాకుండా, వినియోగదారులు తమ మిగులు విద్యుత్ను గ్రిడ్కు విక్రయించి ఆదాయాన్ని కూడా పొందవచ్చు (నెట్ మీటరింగ్).
స్థానికంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది, తద్వారా దేశ ఇంధన భద్రత పెరుగుతుంది.
1.అంతర్జాతీయ నిబద్ధత:
COP26 సదస్సు: 2021 COP26 (CONFERENCE OF THE PARTIES) వాతావరణ సదస్సులో భారత ప్రధాని 'పంచామృత్' అనే ఐదు ప్రతిజ్ఞలను ప్రకటించారు. పీఎం సూర్య ఘర్ వంటి పథకాలు ఈ లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి
పంచామృత్' లోని ఐదు అంశాలు:
1.2030 నాటికి 500 GW శిలాజ ఇంధనేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించడం.
2. 2030 నాటికి తన ఇంధన అవసరాలలో 50% పునరుత్పాదక ఇంధనం నుండి పొందడం.
3. 2030 నాటికి మొత్తం కార్బన్ ఉద్గారాలను 1 బిలియన్ టన్నులు తగ్గించడం.
4. 2030 నాటికి ఆర్థిక వ్యవస్థ యొక్క కార్బన్ తీవ్రతను 45% తగ్గించడం.
5. 2070 నాటికి నికర-సున్నా ఉద్గారాల (NET-ZERO EMISSIONS) లక్ష్యాన్ని సాధించడం
2.భారత ఆర్థిక వ్యవస్థ & ఇంధన రంగం:
సౌరశక్తి సామర్థ్యం: భారతదేశం సంవత్సరంలో 300 సూర్యరశ్మి రోజులను కలిగి ఉండటంతో, సౌరశక్తి ఉత్పత్తికి అపారమైన అవకాశాలు ఉన్నాయి.
రూఫప్ సోలార్ ప్రాముఖ్యత: రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు తక్కువ స్థలాన్ని
ఆక్రమిస్తాయి, విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గిస్తాయి మరియు గ్రిడ్పై భారాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
ఆత్మనిర్భర్ భారత్: స్వదేశీ విద్యుత్ ఉత్పత్తిని పెంచడం ద్వారా, 'ఆత్మనిర్భర్ భారత్' (స్వయం సమృద్ధ భారతదేశం) లక్ష్యానికి ఈ పథకం తోడ్పడుతుంది.
గిగావాట్ (GW) యూనిట్: ఇది విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కొలవడానికి ఉపయోగించే ఒక యూనిట్. 1 GW = 1,000 మెగావాట్లు (MW).
నెట్ మీటరింగ్: వినియోగదారులు తమ సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి చేసిన అదనపు విద్యుత్ను గ్రిడ్కు తిరిగి ఇచ్చే ప్రక్రియ. దీనికి సంబంధించిన విధానాలు మరియు ప్రయోజనాలను అర్థం చేసుకోవడం ముఖ్యం.