రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఫేక్ ప్రచారంతో విష విత్తనాలు జల్లుతున్నారు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఫేక్ ప్రచారంతో విష విత్తనాలు జల్లుతున్నారు

  • ఎరువుల రవాణాను అడ్డుకుంటూ వైసీపీ డ్రామాలాడుతోంది
  • రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం
  • వైసీపీ దుష్ప్రచారంతో రైతులు ఆందోళన చెందొద్దు... వారి రాజకీయ ఉచ్చులో పడొద్దు
  • సమృద్ధిగా ఎరువుల నిల్వలున్నాయి... ఇంకా వస్తున్నాయి
  • మీడియా సమావేశంలో ఎరువుల సరఫరాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం

అమరావతి, సెప్టెంబర్ 3: అన్ని విషయాల్లోనూ ఫేక్ ప్రచారం చేస్తున్న వైసీపీ... ఎరువుల విషయంలోనూ అదే తరహా దుష్ప్రచారాన్ని చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. విషవృక్షం లాంటి వైసీపీ చేసే దుష్ప్రచారాల్లో భాగంగా... మరో ఫేక్ స్టోరీని ప్రచారం చేస్తోందని... యూరియా, ఎరువుల కొరత ఉందని దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ పార్టీ, నేరాలను నమ్ముకున్న పార్టీ, విషపు విత్తనాలను చల్లుతోందని చంద్రబాబు విమర్శించారు. ఎరువుల లభ్యత.. సరఫరాపై రాష్ట్ర సచివాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లాల వారీగా ఎరువుల సరఫరా లెక్కలను చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”ఈ ఖరీఫ్ సీజనులో ఓపెనింగ్ బ్యాలెన్సుతో కలిపి 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేశాం. బుధవారం నాటికి 94,892 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. ఇది కాకుండా గత 10 రోజుల్లో సుమారు 28 వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేశాం. వచ్చే 10 రోజుల్లో 30 వేల టన్నులు సరఫరాకు అందుబాటులోకి రానుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరో 53 వేల టన్నుల కేటాయింపులు తెచ్చుకున్నాం. సెప్టెంబర్ 12 నుంచి 30వ తేదీ లోపు మరో లక్ష టన్నులు తెచ్చుకుంటాం. అంటే సెప్టెంబర్ నెలఖరు నాటికి 2.71 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుంది. రైతులు ఆందోళన చెందవద్దు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు ఎరువులను సిద్దం చేస్తాం. వచ్చే రబీ నాటికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 9.38 లక్షల టన్నులు కేటాయింపులు ఇప్పటికే చేసుకున్నాం. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడాను. జిల్లాల్లో అన్ని రిటైల్ షాపుల్లో, ప్రస్తుత నిల్వలు, సరఫరాపై సమీక్ష చేసుకుని అవసరం ఉన్న దగ్గరకు ఎరువులు తరలించాలని చెప్పాం. డిమాండ్ ఉన్న జిల్లాలకు మార్క్ ఫెడ్ ద్వారా ఎరువులు తరలించి రైతులకు సరఫరా చేస్తాం. పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో గట్టి నిఘా పెట్టి ఎరువులు పక్కదారి పట్టకుండా చూడమని చెప్పాం.” అని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఫేక్ ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలు

సోషల్ మీడియాలో వివిధ అంశాలపై జరుగుతున్న ఫేక్ ప్రచారాలపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. “డ్రామాలు అడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దుష్ప్రచారం చేసే వారిని జైలుకు పంపుతాం. యూరియా విషయంలో కృష్ణా జిల్లాలో వైసీపీకి చెందిన ఎర్రా వాసు, రామ్మూర్తి, చిలీ వెంకటేశ్వరరావు, ఈశ్వరరావు తదితరులు కుట్రపూరితంగా వ్యవహరించారు. ఎరువుల లారీని హైజాక్ చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో కొందరు క్రిమినల్స్ ఎరువుల విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఫేక్ రాజకీయాలు చేసినా, సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయి. అన్ని జిల్లాల్లో ఎంతెంత స్టాక్ ఉందో... ఏయే దుకాణాల్లో ఎంత నిల్వలున్నాయనే వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకోం. ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్జేయడానికి ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. ప్రస్తుతం రైతులు ఎక్కడెక్కడ ఎంత యూరియాను వినియోగిస్తున్నారో లెక్కలు తీసి మీడియాకు ఇస్తాం. రైతుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు రాజకీయం చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరిస్తున్నా. నేరాలు ఘోరాలు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుప్పంలో నీరిస్తే... నీళ్లు లేవని ప్రచారం చేశారు. పులివెందులకు మేం నీరిస్తే... వైసీపీ వాళ్లు వెళ్లి... తామే ఇచ్చినట్టుగా హారతులిచ్చారు. సోషల్ మీడియా ఉంది కదా అని తప్పుడు వార్తలు రాస్తే చూస్తూ ఊరుకోం. స్టీల్ ప్లాంట్ కు రూ.12 వేల కోట్లు కేంద్రం నిధులిచ్చి ఆదుకుంటే పేటీఎం బ్యాచ్ ద్వారా కొందరు రాజకీయాలు చేస్తున్నారు. ఉద్యోగుల వయో పరిమితి విషయంలో ఫేక్ జీవో సృష్టించి ఫేక్ ప్రచారం చేశారు. పేటీఎం బ్యాచ్ తప్పుడు పోస్టులు చేసి.. ఆందోళన కలిగించి.. రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తే తాట తీస్తాం. కావాలని అలజడులు సృష్టిస్తే జైలుకు పంపుతాం. మొన్నటి వరకు మహిళల పైనా.. నిన్న రాజధాని పైనా.. ఇప్పుడు రైతులను తప్పుదోవ పట్టించేలా చేస్తున్నారు. ఇలాంటి వారిని ఖచ్చితంగా నియంత్రిస్తాం.” అని సీఎం అన్నారు.

భ్రమల్లో ఉంటారు... భ్రమలు కల్పిస్తారు

“అవాస్తవాలను కూడా వాస్తవమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. హెరిటేజ్ అవుట్ లెట్లే లేవు. అయినా హెరిటేజ్ దుకాణాలు ఉన్నాయంటూ విష ప్రచారం చేస్తూ... విచిత్రమైన వింత జీవుల్లా వ్యవహరిస్తున్నారు. ఉహాగానాల్లో బతికేస్తున్నారు. ఏం చెప్పినా... ప్రజలు నమ్మేస్తారని వైసీపీ అనుకుంటోంది. వాళ్లను చూస్తుంటే జాలి వేస్తుంది. విలువల్లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నప్పుడు... ఇలాంటి సమస్యలే వస్తాయి. వాళ్లు దుష్ప్రచారం చేస్తుంటే... మేం వాటిని సరి చేస్తూ కూర్చోవాలా..? అసెంబ్లీకి వచ్చి సమస్యలపై చర్చించమంటే... ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అంటున్నారు. వీరికి అసలు బుద్దుందా..? ప్రజలిచ్చిన సీట్లతోనే ప్రతిపక్ష హోదా వస్తుంది. ఆ హోదాకు కూడా తగరనే వైసీపీకి 11 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్షం కావాలంటే అసెంబ్లీలో 18 సీట్ల సంఖ్యాబలం ఉండాలని తెలియదా..? ఓట్లేయలేదని ప్రజలపై కక్ష పెట్టుకున్నట్టు వ్యవహరిస్తున్నారు. కోడి కత్తి, గొడ్డలివేటు, గుండెపోటు, గులకరాయి డ్రామాలతో పాటు... ఎరువులిస్తున్నా ఇవ్వడం లేదని ఫేక్ డ్రామాలు ఆడుతున్నారు.” అని చంద్రబాబు విమర్శించారు.

త్వరలో రైతులతో సమావేశం

“దుష్ప్రచారంతో రెచ్చగొడుతూ... రైతులను రోడ్డున పడేస్తున్నారు. వీరి రాజకీయ ఉచ్చులో రైతులు పడొద్దు. త్వరలోనే రైతులతో సమావేశం నిర్వహిస్తాం... వాస్తవాలు వివరిస్తాం. గత ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలు జరిగేవి. నీళ్లు లేక, పెట్టుబడి సాయం అందక, ఆదుకునే వారు లేక.. నిస్పృహతో రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు. కూటమి అధికారంలోకి వచ్చాక... రైతుల మీద ఒత్తిడి తగ్గింది. అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం అందిస్తున్నాం. వ్యవసాయానికి కావాల్సిన నీళ్లను సమృద్ధిగా సరఫరా చేస్తున్నాం. పంటలు పండేందుకు కావాల్సిన అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాం. అందుకే రైతుల ఆత్మహత్యలు ఇప్పుడు లేవు. రైతులకు మంచి చేస్తుంటే... వైసీపీ ఓర్వలేకపోతోంది. ఏ కారణాల వల్లనైనా పంటలకు సరైన ధర లేకపోతే ప్రభుత్వం తరపున ఆదుకుంటున్నాం. అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తున్నాం. వాణిజ్య పంటలకు మార్కెటింగులో ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం. తాజాగా కాఫీ పంటకు బెర్రి బోరర్ తెగులు వచ్చింది. ఇది మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టాం. తెగులు సోకిన పంటను ధ్వంసం చేసి రైతులకు తగినంత పరిహారం ఇస్తున్నాం. ఈ సందర్భంగా రైతులకు ఓ విజ్ఞప్తి. తెలియక ఎక్కువ పురుగు మందులు వినియోగిస్తున్నారు. పురుగు మందుల వినియోగం ఎక్కువగా జరిగితే... మన పంటలు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. తిండి, వాతావరణం కూడా కలుషితం అవుతుంది. ఆర్గానిక్ పంటలే రైతులకు లాభాదాయకం.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Comments

-Advertisement-