పెట్టుబడిదారులకు పూర్తి సహకారం
పెట్టుబడిదారులకు పూర్తి సహకారం
- ఒప్పంద సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేయాలి
- ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నైపుణ్యాభివృద్ధి శిక్షణ
- పునరుత్పాదక రంగంలో ఏపీ ముందంజ
- -యాక్సిస్ ఎనర్జీ, సుజ్లాన్, రిలయన్స్ సీబీజీ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి గొట్టిపాటి సమీక్ష
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక రంగంలో వివిధ ప్రాజెక్టులు చేపడుతున్న పెట్టుబడిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పూర్తి సహాయ, సహకారాలు అందిస్తుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ భరోసా ఇచ్చారు. పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ ప్రాజెక్టులు చేపడుతున్న రిలయన్స్, యాక్సిస్ ఎనర్జీ, సుజ్లాన్ ప్రతినిధులతో మంత్రి గొట్టిపాటి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో ఆయా కంపెనీల పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. యాక్సిస్ ఎనర్జీ, సుజ్లాన్, రిలయన్స్ కంపెనీలు ఎంఓయూ నిబంధనలకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలన్నారు. ఎంఓయు ప్రకారం అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత సదరు కంపెనీలదే అని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో స్థానిక యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అదే విధంగా ప్రస్తుతం జరుగుతున్న పనులలోనూ ఎక్కువ మంది స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని సూచించారు. దీనికి అవసరమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తరించాలని వెల్లడించాలన్నారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలని, పారదర్శకతతో పనులు చేయాలని కంపెనీలను ఆదేశించారు. ప్రాజెక్టుల సత్వర అనుమతుల కోసం ఇప్పటికే పారదర్శకమైన సింగిల్ విండో విధానాన్నిప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలను మరింత మెరుగు పరిచేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అర్హులైన వారికి నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పునరుత్పాదక రంగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని చెప్పారు.
గత ప్రభుత్వ విధానంతో భారీగా నష్ట పోయామన్న కంపెనీలు...
సమీక్ష సందర్భంగా కంపెనీల ప్రతినిధులు పలు అంశాలను మంత్రి గొట్టిపాటి దృష్టికి తీసుకు వచ్చారు. వైసీపీ ప్రభుత్వ విధానంతో గత ఐదేళ్లలో భారీగా నష్ట పోయామని మంత్రికి తెలిపారు. భూ సేకరణలో ఎదురువుతున్న సమస్యలను వివరించారు. కూటమి ప్రభుత్వ మద్ధతుతో రాబోయే మూడేళ్లలోనే సోలార్, విండ్, సీబీజీ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వివరణ ఇచ్చారు. అదే విధంగా పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి రాష్ట్రంలోని యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సదరు కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు. యాక్సిస్ ఎనర్జీ ప్రతినిధులు మాట్లాడుతూ., బ్రుక్‌ఫీల్డ్‌తో కలిసి ఏర్పాటు చేసిన ఎవ్రెన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా 3,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్ ప్రాజెక్టుల పనులను ప్రారంభించామని తెలిపారు. సుమారు రూ.30,500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టి, 3,500 ఉద్యోగాలను సృష్టించేందుకు కట్టుబడి ఉన్నామని సదరు ప్రతినిధులు మంత్రికి స్పష్టం చేశారు. అనంతరం సుజ్లాన్ ప్రతినిధులు మాట్లాడుతూ., అనంతపురం జిల్లా కుదేరు యూనిట్‌లో అధిక సామర్థ్యం కలిగిన గాలిమర టర్బైన్ల తయారీకి ప్లాంట్‌ను అప్‌గ్రేడ్ చేశామని చెప్పారు. దీని వలన ప్రస్తుతం 1,200 మందికి ఉపాధి కల్పించామని వెల్లడించారు. ప్రతి సంవత్సరం మరో 500 ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.12,000 కోట్లు పెట్టుబడులు పెట్టి., 1,375 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన విండ్ ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. విండ్ టర్బైన్ల తయారీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా దేశంలోనే అతి పెద్ద గ్రీన్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించామని సుజ్లాన్ ప్రతినిధులు మంత్రి గొట్టిపాటికి వివరించారు. విండ్ అనుకూల ప్రాంతాల్లో సోలార్ ప్రాజెక్టుల అనుమతులపై సమీక్షించాలని మంత్రిని కోరారు.
రిలయన్స్ సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుతో 2.50 లక్షల మందికి ఉపాధి
రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న సీబీజీ ప్లాంట్ల పురోగతిపై రిలయన్స్ ప్రతినిధులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ... సకాలంలో ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసి, స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని అన్నారు. రైతులకు లాభదాయకమైన కౌలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తొలిదశలో ప్రకాశం, నెల్లూరు, పల్నాడు జిల్లాల్లో సీబీజీ ప్లాంట్ల నిర్మాణం జరుగుతుందని, అనంతరం అన్నమయ్య, కడప జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రిలయన్స్ సంస్థ రూ.65 వేల కోట్ల భారీ పెట్టుబడులతో సీబీజీ ప్లాంట్లు పెట్టేందుకు ముందుకు వచ్చిందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. మొత్తం 500 సీబీజీ ప్లాంట్ల ద్వారా రాష్ట్రంలో సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు. ఉపయోగంలో లేని ప్రభుత్వ భూమికి ఎకరాకు రూ. 15 వేల కౌలు, రైతుల భూములకు ఎకరాకు రూ. 31 వేల కౌలు రూపంలో ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఇంధన శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.