అమరావతిలో భారతదేశపు మొదటి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ
అమరావతిలో భారతదేశపు మొదటి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ
- 2 సంవత్సరాలలో స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ తయారీకి దిశానిర్దేశం
- భారతదేశపు క్వాంటమ్ కంప్యూటర్ రంగానికి కేంద్రంగా మారనున్న అమరావతి క్వాంటమ్ వ్యాలీ
అమరావతి, సెప్టెంబరు 11: అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భారతదేశంలోనే మొదటి క్వాంటమ్ రిఫరెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు ప్రకటించింది. ₹40 కోట్ల అంచనా వ్యయంతో స్థాపించబోయే ఈ ఫెసలిటీలో క్వాంటమ్ భాగాల పరీక్ష, బెంచ్‌మార్కింగ్ మరియు లక్షణ నిర్ధారణకు అవసరమైన సదుపాయాలను అందజేయనుంది. దీంతో భవిష్యత్తులో అమరావతి నుంచే క్వాంటమ్ కంప్యూటర్‌ల తయారీకి పునాదిగా నిలవనుంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రముఖ స్టార్టప్‌లు, విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు మరియు క్వాంటమ్ హార్డువేర్ అభివృద్ధిలో నిమగ్నమైన అంతర్జాతీయ భాగస్వాములు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించి, వివరించారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ (AQV) కార్యక్రమంలో భాగస్వామ్యంతో పనిచేయడానికి తమ నిబద్ధతను వ్యక్తం చేశారు.
భారతదేశపు క్వాంటమ్ భవిష్యత్తును ముందుకు తీసుకువెళ్తున్న జాతీయ మరియు అంతర్జాతీయ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ క్వాంటమ్ మిషన్ (NQM) డైరెక్టర్ డాక్టర్ జె.బి.వి. రెడ్డి, IBM క్వాంటమ్ ఇండియా లీడ్ ఎల్. వెంకట్ సుబ్రహ్మణ్యం, TCS ఇండియా స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ హెడ్ సి.వి. శ్రీధర్ కీలక భాగస్వాములుగా పాల్గొన్నారు. NQM మరియు సైన్స్ & టెక్నాలజీ విభాగం (DST) కావలసిన విధానపరమైన మరియు కార్యక్రమ మద్దతును అందిస్తున్నాయి. IBM మరియు TCS అమరావతి క్వాంటమ్ వ్యాలీకి వ్యూహాత్మక మూల స్తంభాలుగా వ్యవహరిస్తున్నాయి. TIFR కి చెందిన ప్రొఫెసర్ ఆర్. విజయ రాఘవన్ కూడా ఈ సమావేశంలో సభ్యునిగా పాల్గొన్నారు. ఆయన భారతదేశపు మొదటి 6-క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి స్వదేశీ ఆవిష్కరణ సామర్థ్యాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ "అమరావతి క్వాంటమ్ వ్యాలీ కేవలం పరిశోధనా కేంద్రంగా మాత్రమే కాకుండా భారతదేశపు స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ తయారీ వ్యవస్థకు కేంద్రంగా అవతరిస్తుందన్నారు. ఈ ఉన్నత భాగస్వామ్యాలతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ క్వాంటమ్ విప్లవంలో ముందు వరుసలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోందని" అయన అన్నారు.
అమరావతిలోని క్వాంటమ్ రిఫరెన్స్ సౌకర్యం స్వదేశీ ఆవిష్కరణలను వేగవంతం చేస్తుంది. పరీక్ష మరియు లక్షణ నిర్ధారణకు అవసరమైన సదుపాయాలను అందజేసి దిగుమతుల మీద ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఇది భారత ప్రభుత్వ జాతీయ క్వాంటమ్ మిషన్‌తో అనుగుణంగా ఉంటుంది. క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్‌ను అతి గొప్ప సాంకేతిక ఆవిష్కరణలు మరియు అధునాతన క్వాంటమ్ తయారీకి ప్రపంచ కేంద్రంగా నిలబడనుంది.