సిఎం వాటర్ మేనేజ్మంట్ విదానం సత్ఫలితాలను ఇచ్చింది రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు
సిఎం వాటర్ మేనేజ్మంట్ విదానం సత్ఫలితాలను ఇచ్చింది రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు
అమరావతి, సెప్టెంబరు 11: దార్శనికుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాటర్ సెక్యురిటీ, మేనజ్మెంట్ ఆలోచనవిధానం మంచి సత్ఫలితాలను ఇచ్చిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టుకుని రాష్ట్రంలో కరువు లేకుండా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు అడుగులు వేస్తున్నారన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జలవనరుల శాఖకు సంబందించిన పలు ప్రాజక్టుల ప్రగతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి సమగ్రంగా సమీక్షించి పలు ఆదేశాలు జారీచేయడం జరిగిందన్నారు. గతేడాదితో పోల్చితే రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ , మేజర్, మీడియం రిజర్వాయర్ లలో నీటినిల్వలు పెరిగాయన్నారు. గత ఏడాది వర్షపాతం తో పోల్చితే, ఈ ఏడాది 9 శాతం వర్షపాతం తక్కువగా నమోదు అయినా కూడా భూగర్భజలాలు , మేజర్, మీడియం రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఉన్నాయంటే, అదంతా రాష్ట్ర ముఖ్యమంత్రి వాటర్ సెక్యురిటీ, మేనేజ్మెంట్ వల్లే సాధ్యం అయిందన్నారు. మేజర్, మీడియం రిజర్వాయర్లలో 85.6 శాతం మేర నీటి నిల్వలు ఉన్నాయని, భూగర్బ జల మట్టాలు కూడా 8.43 మీటర్లకు చేరుకున్నాయని తెలిపారు. అదే విదంగా తుంగ భద్ర డ్యామ్ 33 గేట్లు మార్చడానికి రూ.52 కోట్ల నిధులను, దవళేశ్వరం బ్యారేజ్ కు కొత్త గేట్ల ఏర్పాటుకు రూ.138 కోట్లను ముఖ్యమంత్రి కేటాయించారని, ఆయా పనులు వచ్చే ఏడాది వర్షాకాలం ప్రారంభంలోపు పూర్తి చేయాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రూ.209 కోట్ల తో శ్రీశైలం ప్రాజెక్టు లో గ్రౌటింగ్, స్పిల్వే పనులు, అఫ్రాన్ వంటి పెండింగ్ పనులు చేయాలని సూచించారన్నారు. రాయలసీమ లో కీలకమైన గోరకల్లు రిజర్వాయర్ ప్రమాదభరితం గా ఉంటే గత ఐదేళ్లలో ఒక్క రూపాయు కూడా కేటాయుంచలేదని, వచ్చే సీజన్ నాటికి గోరకల్లు రిజర్వాయర్ కి మరమ్మతులు పూర్తి చేసేలా రూ.56 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. గత ఐదేళ్లలో చేయలేని పనిని ఒక్క ఏడాదిలోనే హంద్రీ నీవా పనులు పూర్తిచేసి కుప్పంకు నీరందించామన్నారు. హంద్రీ నీవా ద్వారా 497 చెరువులకు నీరు అందించేలా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారన్నారు. 2026 జూన్ కి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారన్నారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు 38,457 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల మరమ్మత్తు పనులను చేపట్టేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు వంశధార, తోటపల్లి, వంశధార -నాగావళి లింక్ , జంఝావతి, హిరమండలం లిఫ్ట్ , నాగావళి- చంపావతి, మహేంద్ర తనయ, తారకరామ వంటి కీలకమైన 9 ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. మాచర్ల నియోజకవర్గంలోని వరికిపూడి శిల ప్రాజెక్ట్ కు ఉన్న అడ్డంకులను అధిగమించేలా అనుమతులు తీసుకోవాలని సూచించారన్నారు. రాష్ట్రం లో 1008 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజక్టులు ఉంటే, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వాటిలో దాదాపు 613 లిఫ్ట్ లు పని చేయడంలేదని, వీటి మరమ్మత్తుకు దాదాపు రూ.725 కోట్లు అవసరమని అంచనా వేయడం జరిగిందని, టెండర్ల ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేసి వాటి మరమ్మత్తు పనులను వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.
రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారులు వేంకటేశ్వర రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.