మొండి బకాయిదారులపై ఉదాసీనతను సహించము
మొండి బకాయిదారులపై ఉదాసీనతను సహించము
- ఆస్తి పన్ను, తాగునీటి కొళాయి చార్జీల బకాయిలను రాబట్టాలి
- నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ ఆదేశం
కర్నూలు సిటీ, సెప్టెంబర్ 10 (పీపుల్స్ మోటివేషన్):-
నగరంలో ఆస్తి పన్ను, తాగునీటి కొళాయి చార్జీలకు సంబంధించి ఉన్న మొండి బకాయిల వసూళ్ల విషయంలో ఎలాంటి ఉదాసీనతను సహించబోమని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో పన్ను వసూళ్లపై రెవెన్యూ, ఇంజనీరింగ్, నోడల్ అధికారులు, అడ్మిన్, అమినిటీస్ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ…నగరపాలక సంస్థకు ఆస్తి పన్ను బకాయిలు దాదాపు రూ.93 కోట్లు ఉన్నాయని, అందులో టాప్-100 బకాయిదారుల నుండి రూ.12.76 కోట్లు వసూలు చేయాల్సి ఉందని తెలిపారు. తాగునీటి కొళాయి చార్జీల బకాయిలు మొత్తం రూ.21 కోట్లు ఉండగా, టాప్-100 బకాయిదారులే రూ.7 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. నోడల్ అధికారుల నేతృత్వంలో డీఈఈ, ఏఈ, అడ్మిన్, అమినిటీస్ కార్యదర్శులు సమన్వయంతో, వారివారీ పరిధిలో టాప్-100 మొండి బకాయిదారులపై ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. నగర వ్యాప్తంగా టాప్-100 బకాయిల వసూళ్లకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా, గత ఆర్థిక సంవత్సరంలో తాగునీటి కొళాయి చార్జీలను 95% వసూలు చేసిన 115 అమినిటీస్ కార్యదర్శి బి.ఉదయ్ కుమార్‌ను కమిషనర్ అభినందించారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, ఆర్‌ఓలు జునైద్, వాజీద్, స్వర్ణలత, ఎస్‌ఈ శేషసాయి, ఎంఈ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.