యూరియా పంపిణీపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలి
యూరియా పంపిణీపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలి
- రాష్ట్రంలో యూరియా నిల్వలు, సరఫరాలపై కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు
- అధికారిక లెక్కలు – గ్రౌండ్ లెవెల్ నిల్వల్లో తేడా లేకుండా పర్యవేక్షణ చేయాలి
- క్రిష్ణా, బాపట్ల, కడప జిల్లాల్లో సమస్యలను కలెక్టర్లు త్వరగా పరిష్కరించాలని ఆదేశం
అమరావతి, సెప్టెంబర్ 05: రాష్ట్రంలో యూరియా నిల్వలు, పంపిణీ, సరఫరాలపై క్రిష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, బాపట్ల, విజయనగరం, కడప, ఏలూరు, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లతో మంత్రి మాట్లాడుతూ జిల్లాల్లో యూరియా సరఫరా సమస్యలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను అధిగమించాలని సూచించారు. అధికారిక లెక్కలు – గ్రౌండ్ లెవెల్ నిల్వల్లో ఎలాంటి తేడా లేకుండా పర్యవేక్షణ జరగాలని ఆదేశించారు. జిల్లాల్లో ఉన్న యూరియా నిల్వల వివరాలను తక్షణం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. క్రిష్ణా, బాపట్ల, కడప జిల్లాల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నందున కలెక్టర్లు త్వరితగతిన స్పందించి పరిష్కరించాలన్నారు. నిల్వలు ఎక్కువున్న ప్రాంతాల నుండి డిమాండ్ ఉన్న ప్రాంతాలకు యూరియా సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. రబీ సీజన్ కోసం 9.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను ఇప్పటికే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గంగవరం, కాకినాడ పోర్టుల నుండి రాష్ట్రానికి రావాల్సిన 53 వేల మెట్రిక్ టన్నుల యూరియా సమయానికి చేరుకునేలా రాష్ట్ర అధికారులు, పోర్ట్ అధికారులు, రైల్వే అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. సోషల్ మీడియా, వార్తా పత్రికల్లో వచ్చే తప్పుడు కథనాలపై వెంటనే స్పందించాలని, ప్రతిరోజూ వాస్తవాలు, యూరియా నిల్వల పరిస్థితిపై మీడియాకు కలెక్టర్లు వివరణ ఇవ్వాలని సూచించారు. యూరియా సరఫరాపై డయల్ యూవర్ కలెక్టర్ అనే కార్యక్రమానికి ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాను మంత్రి అభినందించారు. పలు చోట్ల మన గ్రోమోరు దగ్గర ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో ప్రత్యేక షాపులు ఏర్పాటు చేసి రైతులకు యూరియా అందేలా కలెక్టర్లు చొరవ చూపాలని మంత్రి ఆదేశించారు. జిల్లాల వారిగా యూరియా నిల్వలపై ప్రత్యేక దృష్టి పెడితే ఒక అంచనాకు వస్తామని, రైతులకు సులువుగా పంపిణీ చేసేందుకు అడ్డంకులు తొలుగుతాయన్నారు. మండలాల వారిగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, రాబోవు 10 రోజుల వరకు కలెక్టర్లు యూరియా పంపిణీ సజావుగా జరిగేలా చూడాలని సూచించారు. అవరమైతే టోకెన్ పద్ధతిలో యూరియా పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్దం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో యూరియా పంపిణీ కి సంబంధించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ తయారుచేసి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తుందని ఈ.ఓ స్పెషల్ సీఎస్ రాజశేఖర్ మంత్రికి తెలిపారు. ఈ టెలీకాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఈ.ఓ స్పెషల్ సీఎస్ రాజశేఖర్ , వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు, క్రిష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, శ్రీకాకుళం జిల్లా స్వప్నిల్ దినకర్ పుడ్నకర్, బాపట్ల జిల్లా కలెక్టర్ మురళి, విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్, కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పాల్గొన్నారు.
